వికేంద్రీకరణ ఈ రాష్ట్రానికి శరణ్యం

అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం

విశాఖకు మావోయిస్టుల ప్రభావం అనేది దుష్ప్రచారం

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఇల్లు అయినా కట్టుకున్నారా..?

ప్రజలందరికీ న్యాయం చేయాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అసెంబ్లీ: ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడంతో ఆంధ్రరాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాష్ట్రానికి వికేంద్రీకరణ శరణ్యం అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలందరికీ న్యాయం చేయాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన అని, గతంలో మాదిరిగా పొరపాట్లు జరగకుండా.. ఆచితూచి అడుగులు వేస్తూ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు నిర్ణయం తీసుకున్నారన్నారు. అసెంబ్లీలో మంత్రి కన్నబాబు ఏం మాట్లారంటే.. ‘కీలకమైన అంశాలపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని విషయాలను విపులంగా చర్చించాల్సిన అవసరం ఉంది. సమాజ ప్రయోజనాలతో పోల్చితే వ్యక్తిగత ప్రయోజనాలు, మన జీవితాలు చాలా చిన్నవి. మనుషులు అందరూ ఒక్కటే వారి జీవితాలు సమానం.. వారి ఆశలు, వారి ఆత్మగౌరవాలు సమానం. ఇది గుర్తించలేని మనిషి మంచి మనిషిగా బతకలేడు. ఏ నాయకుడు మంచి నాయకుడు కాలేడు. ఏ మనిషి అయినా ఉన్నతంగా జీవించాలని అనుకుంటారు. పరిస్థితుల దృష్ట్యా సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటారు అంత మాత్రాన వాళ్లకు ఆశలు లేవని, అభివృద్ధి కోరుకోవడం లేదని అనుకోవద్దు.

స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకు కరువు, వెనుకబడిన ప్రాంతాలు అని మాట్లాడుకుంటున్నాం. ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోవడమే సమస్యలన్నింటికీ మూలం. తెలంగాణ ఉద్యమం కొన్ని ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడంతో పుట్టింది. ఒక కుటుంబం బతకలేక వలస వెళ్లే పరిస్థితులు వచ్చాయని ఆలోచించకపోతే ఈ ప్రభుత్వాలకు, ప్రజలు ఇచ్చిన అవకాశాలకు అర్థం లేకుండా పోతుంది.

విజయనగరం, అనంతపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి వలసలు వెళ్తుంటే చాలా మంది వారి జీవనశైలి అనుకుంటారు. కానీ వెళ్లేవారు మాత్రం మా తలరాత అని అనుకుంటారు. ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆత్మగౌరవం కాపాడే తరుణం వచ్చింది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈ రోజు కొత్త అధ్యయానికి తెర తీశారని సభ  దృష్టికి తీసుకువస్తున్నాను. ప్రాంతాల పట్ల పక్షపాతాలు చూపించడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. గత ఐదేళ్లు ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు.

ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని చర్చ జరుగుతుంది. 1937లో శ్రీబాగు ఒప్పందం మొదలుకొని మొన్న బీసీజీ నివేదిక వరకు ఫైనాన్స్‌ మినిస్టర్‌ బుగ్గన చాలా విపులంగా వివరించారు. శ్రీబాగ్‌ ఒప్పందం ఏం చెప్పింది. ఆ తరువాత 1953లో ఏం జరిగింది. 1953–56 వరకు కర్నూలు రాజధానిగా ఉండి ఆ తరువాత హైదరాబాద్‌ వచ్చాం. 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం మనం కళ్లారా చూశాం. హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి పారిపోయి రావడానికి చంద్రబాబు రాజకీయం కారణం. ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన తప్పులు జరగకూడదు. పొరపాట్లు నివారించి ముందుకువెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకే అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కొరకు జీఎన్‌రావు కమిటీని నియమించారు. ఆ కమిటీ వికేంద్రీకరణ శరణ్యం అని చెప్పింది. ఆ తరువాత బీసీజీ అనే సంస్థను నియమించి రిపోర్టు తీసుకొని రెండు కమిటీల నివేదికలపై హైపవర్‌ కమిటీ నియమించారు. ఈ రెండు నివేదికలు, అంతుకు ముందు శ్రీకృష్ణ, శివరామకృష్ణన్‌ కమిటీల రిపోర్టులు కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పాయి.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మూడు రాజధానులు ఉండాలని కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ అని నిర్ణయాన్ని తెలియజేశారు. శివరామకృష్ణన్‌ కమిటీ ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం చేయవద్దని చెప్పింది. కొత్తగా నగరాన్ని నిర్మించాలంటే అది సుదీర్ఘమైన అంశం.. దీనిపై ఆచితూచి అడుగులు వేయాలని చెప్పింది. శివరామకృష్ణన్‌ కమిటీ మూడు ఆప్షన్స్‌ ఇచ్చారు. గ్రీన్‌ ఫీల్డ్‌ నగరాన్ని కొత్తగా నిర్మాణం చేసుకోవడం, ఉన్న నగరాన్ని అనుకూలంగా విస్తరించడం, డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అని మూడు ఆప్షన్లు ఇచ్చారు.

అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు కొత్త నగరాన్ని నిర్మించుకోవాలని అనుకున్నాడు. కానీ, గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ నిర్మాణం విఫలమైనట్లుగా కనిపిస్తుంది. అమరావతి గ్రాఫిక్స్‌ సిటీగా మిగిలిపోయింది. డిజైన్లు, విదేశీ బృందాలు, గ్రాఫిక్స్, సినీ డైరెక్టర్ల సెట్టింగుల అని రకరకాలుగా నాలుగేళ్లు సమయాన్ని వృథా చేశారు. విదేశీయులను తీసుకువచ్చి అమరావతిలో ఏదో జరిగిపోతుందనే భ్రమను ప్రపంచానికి కల్పించాడు. చివరకు రైతుల నుంచి తీసుకున్న భూములకు ప్లాట్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి తెచ్చాడు. చంద్రబాబు అదృష్టం ఏంటంటే.. బాజా భజంత్రీలు, మార్కెట్‌ మాయాజాలం, ఏం చెప్పినా ఆహా అంటూ ప్రచారం చేసే వ్యవస్థ చంద్రబాబుకు ఉంది. ఆ మాయలో పడిన చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేశాడు. తీసుకున్న 53 వేల ఎకరాలను రూ.లక్షా 9 వేల కోట్లతో అభివృద్ధి చేయొచ్చు అని, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కావాలంటే రూ. 4 నుంచి 5 లక్షల కోట్లు కావాలని చంద్రబాబే గతంలో ప్రకటించారు.  అమరావతి నిర్మాణానికి చంద్రబాబు పెట్టింది దాదాపు రూ. 5700 కోట్లు, ఇవి కాకుండా మరో రూ.2,700 కోట్లు ఖర్చు చేసి ఆ అప్పు సీఎం వైయస్‌ జగన్‌కు మిగిల్చి వెళ్లిపోయారు. ఇదే విధంగా ఖర్చు చేసుకుంటూ పోతే ఎంత డబ్బుతో.. ఎప్పటికి పూర్తిచేయగలం.

కేవలం అమరావతిపైనే దృష్టిపెడితే మిగతా ప్రాంతాలను, అవసరాలను నిర్లక్ష్యం చేయాలా..? విద్యా, వైద్యం, వ్యవసాయం, సాగునీటి, తాగునీటి సమస్యల పరిష్కారాలను గాలికి వదిలేసి అమరావతినే నిర్మాణం చేయాలా అనే ఆలోచన ఈ ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు సమగ్రాభివృద్ధి అన్ని ప్రాంతాలకు జరగాలి. ప్రజల మనోభావాలకు గౌరవం ఇవ్వాలని, నివేదిక ఆధారంగా వికేంద్రీకరణ జరగాలని హైపవర్‌ కమిటీ సూచన మేరకు సీఎం వైయస్‌ జగన్‌ ఆమోదించారు.

అమరావతి నిర్మాణానికి 35 సంవత్సరాలు పడుతుందని  అప్పటి మున్సిపల్‌ మంత్రి నారాయణ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. గొప్ప రాజధాని అని గొప్పలు చెప్పుకునేందుకు వ్యవస్థలన్నింటినీ గాలికి వదిలేయాలనేది చంద్రబాబు ఆలోచన. ఉన్న వనరులను వినియోగించుకుంటూ ప్రజలందరికీ న్యాయం చేయాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన. శివరామకృష్ణన్‌ కమిటీ ఒక విషయాన్ని చెప్పింది. రెండు నుంచి మూడు లక్షల ఉద్యోగాలను ప్రతి సంవత్సరం యాడ్‌ చేసుకుంటూ వెళ్తే తప్ప వచ్చే 25 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పన చేయలేరని, దాన్ని బట్టి ప్లాన్‌ చేసుకోవాలని చెప్పింది.

అమరావతి సస్టేనబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇనిస్ట్యూషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ కింద నిధులు ఇస్తానని చెప్పిన వరల్డ్‌ బ్యాంక్‌.. రైతులు, ఎన్జీఓస్‌ కంప్లయింట్‌ చేశారు. పరిస్థితులు అనుకూలంగా లేవు అని అప్పుకూడా ఇవ్వకుండా వరల్డ్‌ బ్యాంకు వెనక్కు వెళ్లిపోయింది. కొంతమందికే అది కలల రాజధాని. మాయపకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా చంద్రబాబు ప్రాణం అమరావతిలో ఉంది. అమరావతిని టచ్‌ చేసిన వెంటనే జోలె పట్టుకొని రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి. ఆయన  రాజకీయ జీవితంలో హుద్‌హుద్, సునామీ, రైతులు చనిపోయినప్పుడు ఎప్పుడూ జోలె పట్టలేదు. చివరకు చంద్రబాబు సతీమణి స్వయంగా గాజులు వితరణ ఇచ్చినట్లుగా చూశాం. ఒక నగరాన్ని నిర్మించుకొని కుతుబ్‌షాలాగా కీర్తి పొందాలనుకున్నారు. కీర్తి అంటే చేసే పనిలో ఆత్మపెట్టి చేస్తే.. ప్రజలు హర్షిస్తే కీర్తి వస్తుంది. ఇవాల్టికి వైయస్‌ఆర్‌ను ఎందుకు గుర్తుంచుకున్నారంటే.. ప్రజల కోణంలో చూసి పరిపాలన చేశారు కాబట్టే..

చంద్రబాబు దురాశ, అవినీతి ఆలోచనకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాం. హైదరాబాద్, ఇతర నగరాలు వాటంతట అవే పెరిగాయి. విశాఖ ఒకప్పుడు మత్స్యకార గ్రామం, ఇవాళ మహానగరంగా విస్తరించింది. ఈ రాష్ట్రంలో విశాఖ అతిపెద్ద నగరం. అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేశారు. విశాఖలో పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లు ఎందుకు పెట్టారు. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లో కమిట్‌ అయితే 50 శాతం కంటే ఎక్కువ విశాఖలో పెట్టుబడి పెట్టేందుకే వచ్చారని గుర్తించాలి. అమరావతిని బయటిప్రపంచం గుర్తించలేదనేందుకు ఇదొక ఉదాహరణ.

నీతి అయోగ్‌ తాజాగా ఒక రిపోర్టు ఇచ్చింది. వెనుకబడిన జిల్లాల నివేదిక ఇచ్చింది. దీంట్లో మూడు జిల్లాలు మన రాష్ట్రం నుంచి ఉన్నాయి. కడప, విశాఖ, విజయనగరం అని ఇచ్చింది. దేశంలో 105 జిల్లాల్లో మన రాష్ట్రంలో 3 జిల్లాలు ఉన్నట్లుగా రిపోర్టు ఇచ్చారు. ఉత్తరాంధ్ర, అనంతపురం, రాయలసీమ జిల్లాలను చూసినప్పుడు నాయకుడు ఎవరైనా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. విశాఖలో ఒకే ఒక్క పంట వస్తుంది. 13 జిల్లాల్లో యూనివర్సిటీ లేని ఒకే ఒక్క జిల్లా విజయనగరం. మావోయిస్టుల ప్రభావం విశాఖలో ఎక్కువగా ఉంటుంది.. ఇక్కడ ఎలా పెడతారని మీడియాలో రాస్తున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టేందుకు వ్యతిరేకించే శక్తులు, టీడీపీ అనుకూల వాదనలు విశాఖకు మావోయిస్టుల ప్రభావం ఉందని వాదన చేస్తున్నారు. సూటిగా అడుగుతున్న టీడీపీ హయాంలో హోంమంత్రిగా ఉన్న మాధవరెడ్డి ఆ రోజుల్లో నక్సల్స్‌ దాడిలో హైదరాబాద్‌ సమీపంలో మరణించిన విషయం తెలియదా..? నక్సల్‌బరి లాంటి ఉద్యమమే శ్రీకాకుళం జిల్లా నుంచి పుట్టింది. పెత్తందారి వ్యవస్థను నిర్మూలించేందుకు ఆకలి కేకల నుంచి వచ్చిన పోరాటాలు అవి. చంద్రబాబు సృష్టించే కృత్రిమ ఉద్యమాలు కాదు. వాటిని పరిష్కరించేందుకు వైయస్‌ఆర్‌ దేశంలో మొట్టమొదటి సారిగా నక్సల్స్‌తో చర్చలకు పిలిచారు. నక్సల్స్‌ ప్రభావం అని తప్పుడు ప్రచారం తీసుకురావడం సిగ్గుచేటు.

అమరావతి మా వర్గం వారి కోసం కట్టుకున్నామని చంద్రబాబు చెబితే పరిశీలించే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెబుతారు. నా మీద కోపంతో, ఒక సామాజిక వర్గం మీద కోపంతో రాజధాని మార్చకూడదని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మీద కోసం సీఎం వైయస్‌ జగన్‌కు ఎందుకు ఉంటుంది. దేశంలోనే చక్రం తిప్పుతున్నానని చెప్పుకునే మనిషిని వైయస్‌ జగన్‌ 29 గ్రామాల్లో తిప్పుతున్నారు. ఇంతకంటే రాజకీయ పతనం ఏముంటుంది. సీఎం వైయస్‌ జగన్‌ చుట్టు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. సీఎం జగన్‌ కోసం ప్రాణాలు ఇచ్చే వారిలో మంత్రి కొడాలి నాని ఉన్నారు. ఒక సామాజిక వర్గం పేరు చెప్పి, ఒక మతం పేరు చెప్పి రాజకీయం చేయాలని మబ్బులో నీరు చూసుకొని ముంత వలకబోసుకున్నట్లుగా చంద్రబాబు తీరు ఉంది.

కర్నూలులో హైకోర్టు పెడితే రెండు జిరాక్స్‌ మెషిన్లు వస్తాయని అవహేళనగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. జిరాక్స్‌ మెషిన్లు కాదు హెరిటేజ్‌ పాల బూతులు కూడా వస్తాయి. హైకోర్టు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని కర్నూలు వెళ్లి చెప్పమనండి. విశాఖకు వెళ్లి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను వ్యతిరేకిస్తున్నామని చెప్పమనండి. విశాఖపట్నం చాలా దూరమని కొత్త వాదన తీసుకువచ్చారు. శ్రీకాకుళం నుంచి అమరావతి ఎంత దూరమో.. అమరావతి నుంచి శ్రీకాకుళం అంతే దూరం. ఈ దేశ రాజధాని ఎక్కడ ఉంది. మొన్నటి వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ ఎక్కడ ఉంది. ఒక అబద్ధాన్ని సృష్టించి దాన్ని నిజం చేసేందుకు శక్తిసామర్థ్యాలను చంద్రబాబు దారపోస్తున్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వారి సమస్యలను సీఎం వైయస్‌ జగన్‌ దూరం చేస్తున్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, పూర్తి ఫీజురియింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలు తీసుకువచ్చారు. చంద్రబాబుకు జనాలను విడగొట్టి అడ్డుగోడలు కట్టడం అలవాటు. ఆ ప్రకారమే ఎస్సీ వర్గీకరణ, కాపు రిజర్వేషన్ల కార్యక్రమం, తెలంగాణ, ఆంధ్ర మధ్య గొడవకు ప్రధాన కారణం చంద్రబాబే. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కొత్తగా మన రాష్ట్రంలో సమస్య తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాడు కానీ,  అమరావతిలో కట్టుకున్నాడా..? కరకట్ట మీదే కాపురం చేశాడు కానీ, వేరే ఆలోచన చేశాడు. తాత్కాలికం పేరుతో కాలం గడిపారు కానీ శాశ్వతం అనే ఆలోచన చేశారా..? అమరావతిలో ఇల్లు నిర్మించుకున్నది సీఎం వైయస్‌ జగన్‌. అమరావతి రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు అకౌంట్‌లోకే పడుతుంది. అమరావతి అభివృద్ధి మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలి. అది మా సీఎం వైయస్‌ జగన్‌ చేసి చూపిస్తారు.

Back to Top