డైవర్షన్‌ పాలిటిక్స్‌లో చంద్రబాబును మించినవాళ్లు లేరు

మంత్రి కన్నబాబు

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను నియమించాం

దుర్భిక్షం నుంచి అనంతపురం బయటపడుతోంది

వాస్తవాలను పక్కదారి పట్టించేలా టీడీపీ నేతల వ్యాఖ్యలు

ప్రస్తుతం ఇంటి వద్దకే విత్తనాలను అందిస్తున్నాం

విత్తు నుంచి విక్రయం వరకూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది

 

 తాడేపల్లి: డైవర్షన్‌ పాలిటిక్స్‌లో చంద్రబాబును మించినవాళ్లు లేరని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఒకవైపు తుపానును ఎలా ఎదుర్కోవాలని ప్రభుత్వ యంత్రాంగం అంతా నిమగ్నమై ఉంటే..టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. విత్తు నుంచి విక్రయం వరకూ రైతులకు ఈ ప్రభుత్వం అండగా నిలిచిందని స్పష్టం చేశారు. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎప్పటికప్పుడు సీఎం వైయస్‌ జగన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారని మంత్రి తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

తుపాను కారణంగా నష్టపోయిన ఉద్యానవన పంటలను సాగు చేసిన రైతులను తక్షణమే ఆదుకునేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఆ ప్రకారం వెంటనే అధికారుల బృందాలను పంపిస్తున్నాం. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వ్యవసాయ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులను పంపిస్తున్నాం. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి శాస్త్రవేత్తలను, వైయస్‌ఆర్‌ హార్టికల్చర్‌కు చెందిన శాస్త్రవేత్తలను కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించాం. దాదాపు 169 మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా ప్రాధమిక అంచనాకు వచ్చాం.ఆర్‌బీకే స్థాయిలోనూ, జిల్లాస్థాయిలోనూ అగ్రికల్చరర్‌ బోర్డు మీటింగ్‌లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. జాయింట్‌ కలెక్టర్లకు కూడా చెప్పాం. ఏం చేయాలి..పంటలను ఏ విధంగా కాపాడుకోవాలన్నది రైతులకు ఆర్‌బీకే సెంటర్ల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. అగ్రికల్చరర్‌ బోర్డ్సు చెప్పే సలహాలు, సూచనలు కూడా పరిగణలోకి  తీసుకోవాలని చెప్పారు.

ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ కూడా  మాతో మాట్లాడి తుపాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఆరా తీశారు. సీఎంవో అధికారులు కూడా మాతో మాట్లాడారు. వెంటనే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో  ఇరిగేషన్‌ డ్రైనేజీకి సంబంధించి తక్షణమే గు్రరపు డెక్కలను తొలగించాలని ఆదేశించాం. రైతులు ఎక్కడ నష్టపోయినా కూడా తక్షణమే స్పందించి ఆదుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రైతులను ఆదుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
అగ్రికల్చర్‌ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి పరిస్థితులను సమీక్షిస్తున్నాం. 

తుపాను నేపథ్యంలో పరిస్థితులు ఒక పక్కన ఉంటే..మరోపక్క ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏదో ఒక బురద జల్లాలి కాబట్టి..ప్రభుత్వం కడుకుంటుంది. తుపాను వ్యవహారాల్లో నిమగ్నమైన యంత్రాంగాన్ని డైవర్ట్‌ చేయాలనుకున్న టీడీపీ నాయకులు ఇవాళ ఉదయం ప్రెస్‌మీట్లు పెట్టి వ్యవసాయాన్ని గాలికి వదిలేశారని, సీఎం వైయస్‌ జగన్‌కు వ్యవసాయంపై అనుభవం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీళ్ల డైవర్షన్‌ ప్రచారంలో వీరికి వీరే సాటి. తుపాను వస్తే రైతులను ఏ విధంగా ఆదుకోవాలని యంత్రాంగం నిమగ్నమై ఉంటే..వ్యవసాయ రంగం మొత్తం కుదేలైనట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. టీడీపీ నేతలకు సిగ్గు అన్నది లేదు. 

ఐదేళ్లు వ్యవసాయాన్ని పట్టించుకోకపోబట్టే కదా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు. కేవలం 23 సీట్లు ఎందుకు వచ్చాయని ఆత్మ విమర్శ కూడా చేసుకోవడం లేదు. మీరేదో రైతు జన ఉద్దారకుడిలాగా మాట్లాడుతున్నారు.
వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్ట మొదటి రోజు నుంచి కూడా తాను రైతు పక్షపాతినని చెప్పి..ఆ దిశగా పయనిస్తున్నారు. రైతుల పట్ల ఏరకంగా శ్రద్ధ తీసుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ వ్యవసాయ రంగంపై మనసు పెట్టి మరి అభివృద్ధి చేస్తున్నారు. ఈ విషయం రైతులు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు అండ్‌ కంపెనీకి మాత్రమే అర్థం కావడం లేదు. 

రాయలసీమ ఎండిపోయిందని, భయంకరమైన దుర్భిక్షం నెలకొందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఇవాళ ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడారు. కాల్వ శ్రీనివాసులుకు కాల్వలు నిండి ప్రవహించడం ఇష్టం లేనట్లుగా ఉంది. ఎప్పుడైన అనంతపురంలో చెరువులు పొంగిపొర్లినట్లు మీరు చూశారా?. నీళ్లు కనిపిస్తున్నాయని వరి సాగు చేయవద్దని అనంతపురంలో మేం ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వేరుశనగ రైతులను మేం ఆదుకోనట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకు అబద్ధాలు వండి వార్చుతున్నారు. వేరుశనగకు సంబంధించి విస్తీర్ణం తగ్గినట్లుగా మాట్లాడుతున్నారు

విస్తీర్ణం  తగ్గడానికి కారణం ఏంటో కూడా మీకు అవగాహన లేదు. రెండేళ్ల నుంచి వర్షాలు అనుకూలంగా ఉండటంతో పంట మార్పిడి చేస్తున్నారు. వర్షాలు లేకపోతే అక్కడ వేరుశనగ పంటలు వేస్తారు. కానీ ఇప్పుడు ఇతర పంటలు వేయడానికి ముందుకు వస్తున్నారు. దుర్భిక్షం నుంచి  అనంతపురం బయటకు వస్తుందని ఆనందం కాల్వ శ్రీనివాసులుకు లేదు. వేరుశనగ నష్టపోయినట్లుగా కలరింగ్‌ ఇస్తున్నారు. వాస్తవాలు మాట్లాడకపోతే రైతులు ఆందోళనలు చెందాల్సి వస్తుంది.
మీ హయాంలో విత్తనాల కోసం క్యూ లైన్లలో రోజులు తరబడి నిలబడేవారు.

ఈ రోజు ఆర్‌బీకే సెంటర్ల ద్వారా విత్తనాలను ఇంటి వద్దనే అందజేస్తున్నాం. విత్తనం నుంచి విక్రయం ద్వారా అడుగడుగున రైతులను చెయ్యి పట్టుకొని వైయస్‌ జగన్‌ నడిపిస్తున్నారు. 
హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు కంటే అర్థం కాదు..మీరు అనంతపురంలోనే ఉన్నారు కదా ? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా? రాయలసీమ మీద ముసలికన్నీరు కార్చుతున్నారు. చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? ఆ రోజు మీకు నోళ్లు రాలేదు. హంద్రీనీవా గురించి ఒక్క రోజైనా చంద్రబాబును ప్రశ్నించారా? ఈ రోజు వచ్చి చంద్రబాబు రాయలసీమ ఉద్దారకుడిగా మాట్లాడుతున్నారు. 

వైయస్‌ జగన్‌ రాయలసీమకే కాదు..ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. రాయలసీమకు శాశ్వత నీటి వనరులు కల్పించేందుకు ప్రయత్నం చేస్తుంటే మీరు కోర్టులకు ఎక్కి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదా? తెలంగాణకు మద్దతుగా మాట్లాడుతున్నారు. మీకు రాయలసీమ గురించి మాట్లాడే హక్కు లేదు.

ఒక డబ్బాలో నాలుగు వేరుశనగ కాయలు తెచ్చి చూపిస్తున్నారు. మొన్న ఆమధ్య చంద్రబాబు కూడా  వారోత్సవాలు చేయమని పిలుపునిస్తే..అప్పుడు కూడా ఇలాగే ఎండిన పంటలు తెచ్చి ధర్నా చేశారు. ఒకపక్క వరదలు వచ్చి జలాశయాలు నిండిపోతున్నాయి. పంటలు కళకళలాడుతున్నాయి. ముంపు కారణంగా అక్కడక్కడ పైర్లు కొన్ని ఎండిపోయాయి. కాంతారావు సినిమా మాదిరిగా అదే కథలు..అదే కన్నీళ్ళతో మూస సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గే లేదు.
ఈ వ్యవసాయ శాఖ మంత్రి మీ హయాంలోని వ్యవసాయ శాఖ మంత్రిలాగా పనిచేయదలుచుకోలేదు. కేవలం రైతాంగానికి ఏది కావాలో అదే చేస్తున్నాం.

రైతులకు ఏవిధమైన అభివృద్ధి చేయాలో అదే అమలు చేస్తున్నాం. ఇవాళ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ..దానికన్న ఎక్కువగా ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్నాం. శనగ రైతులు నష్టపోతే..సీఎం వైయస్‌ జగన్‌ వచ్చాక క్వింటాల్‌కు రూ.1500 అదనంగా ఇచ్చారు. మీ హయాంలో అలాంటి ఆలోచన వచ్చిందా?. మీ హయాంలో ఒక్క పంటనైనా కొనుగోలు చేశారా?

సీఎం ఆదేశాల మేరకు మద్దతు ధరలు ప్రకటించాం. ఉల్లి, అరటి, మిరప, బత్తాయి, పప్పుశనగను గ్రేడ్‌ –1 కింద మార్చి ఇవాళ కొత్తగా ఎంఎస్‌పీలు ప్రకటించాం. ఇవన్నీ కూడా రాయలసీమలోని పంటలను దృష్టిలో పెట్టుకొనే చేశాం. ఇదంతా రాయలసీమ రైతులకు మేలు చేసే పనులు కాదా అని మంత్రి కన్నబాబు నిలదీశారు.
 

Back to Top