బ‌డ్జెట్‌లో రైతు సంక్షేమానికి పెద్ద‌పీట‌

శాస‌న‌స‌భ‌లో వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.41,436 కోట్లు

రైతు భరోసా, కిసాన్‌ యోజన కింద రూ. 7,220 కోట్లు

రైతులకు యూనివర్శల్‌ బీమా పథకం కల్పించిన ఏకైక రాష్ట్రం ఏపీ
 
ఏపీ సీడ్స్‌కు జాతీయ స్థాయిలో అవార్డులు

ఆర్బీకేల ద్వారా రూ.450 కోట్ల విలువైన ఎరువులు సరఫరా

ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటున్నాం

అమరావతి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట వేసి మ‌రోసారి రైతుల‌పై ఉన్న ప్రేమ‌ను బ‌డ్జెట్‌లో చూపించింది. రూ.41,436 కోట్ల రూపాయలతో ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతు భరోసా కేంద్రాల వద్ద బ్యాంకింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నామని కాకాణి అన్నారు.  రైతుల ఆదాయం పెంచే విధంగా ఆర్భీకే సేవలు అందిస్తున్నాయి. రైతులకు కావాల్సిన అన్ని సేవలను గ్రామస్థాయిలోనే అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 8,837 ఆర్బీకే భవనాలు వివిధ స్థాయిలో ఉన్నాయి. ఆర్‌బీకేలను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నాం యూట్యూబ్‌ ఛానళ్లు, మాస పత్రికను ప్రారంభించామ‌ని మంత్రి కాకాణి తెలిపారు. గురువారం శాస‌నస‌భ‌లో మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి వ్య‌వ‌సాయ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఆ వివ‌రాలు ఇలా..

వ్యవసాయ సలహా మండళ్లు
రాష్ట్ర, జిల్లా, మండల, ఆర్బీకే స్థాయిల్లో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసాం. పంటల ప్రణాళిక, ఆర్బీకే పరిధిలోని వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయి. వ్యవసాయంలో అనుభవం ఉన్న అభ్యుదయ రైతులు ఇందులో సభ్యులుగా ఉంటారు. కౌలు రైతులు, మహిళా రైతులు, ప్రాంతాన్ని అనుసరించి ఆక్వా రైతులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఈ మండళ్లు వ్యవసాయ శాఖతో సమన్వయం అవుతూ రైతుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాయి.   

ప్రకృతి వైపరీత్యాలు
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ పంటసీజన్ ముగిసేలోగానే పెట్టుబడి రాయితీ అందించే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు వైయస్ జగన్. గతంలో పంట నష్టం జరిగితే పరిహారం ఇవ్వడానికి 2-3 ఏళ్లు పట్టేది. ఈ పరిస్థితి మారుస్తూ 
ఖరీఫ్ 2022 లో వర్షాలు, వరదల కారణంగా వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన 45,998 మంది రైతులకు 39.40 కోట్లు ఖరీఫ్ ముగిసేలోపే అందించాం. 
రబీ 2022 - 23లో మాండస్ తుఫానులో నష్టపోయిన 91,237  మంది వ్యవసాయ, ఉద్యాన రైతులకు రూ.76,98,70,000 రబీ ముగిసేలోపే అందజేసాం.
గత ప్రభుత్వ హయాంలో 2018తిత్లీ బాధితులైన 90వేలమందికి పైగా ఉద్యాన రైతులకు అదనపు పరిహారంగా 182.60 కోట్లు విడుదల చేసాం. 
ఈ నాలుగేళ్ల కాలంలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు 1,911.81 కోట్ల పెట్టుబడి రాయితీ అందించి ఆదుకున్నాం. ప్రకృతి విపత్తు సహాయ నిధి కింద 2023-24 బడ్జెట్ లో 2000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

వ్యవసాయ రుణాలు
2019 నుండి ఇప్పటి వరకూ వివిధ బ్యాంకుల ద్వారా 6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేసాం. కౌలు రైతులకు ప్రాధాన్యత ఇస్తూ 9,20,000 మంది కౌలు రైతులకు 6,229.28కోట్ల పంట రుణాలు మంజూరు చేసాం. సీసీఆర్ కార్డు పొందిన అందరికీ రైతుభరోసా, సున్నావడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటలబీమా, సబ్సిడీ విత్తనాలు, పంట కొనగోళ్లు వర్తింపచేసి లబ్ది చేకూరుస్తున్నాం. 

డా.వైయస్సార్ పొలం బడి
వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి, మేలైన వ్యవసాయ పద్ధతుల ద్వారా పంట దిగుబడి పెంచి తద్వారా రైతుకు మేలు చేసేందుకు మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం డా.వైయస్సార్ పొలం బడి.రైతు ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో మెరుగైన ధర కల్పించడంతో పాటు ఎగుమతి అవకాశాలను మెరుగుపరిచేందుకు 2022-23లో మేలైన వ్యవసాయ పద్ధతులు, సర్టిఫికేషన్ అంశాలను పొలంబడి కార్యక్రమంలో సమీకృతం చేసాము. దీని అమలు కోసం ప్రతి జిల్లాలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక క్లస్టర్ చొప్పున 26 జిల్లాల్లో క్లస్టర్స్ ఏర్పాటు చేసి మేలైన యాజమాన్య పద్ధతులు, సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. వేలాది పొలం బడి కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షలాది మంది రైతులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికేషన్ అందించాం. 

అగ్రి ల్యాబ్స్ 
రైతులు వినియోగించే ఉత్పాదకాల నాణ్యతా ప్రమాణాలు ధృవీకరించేలా అగ్రిల్యాబ్స్ ఏర్పాటు. నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 9, రీజనల్ కోడింగ్ సెంటర్లు 4 నిర్మాణం చురుగ్గా నిర్మాణం అవుతున్నాయి. ఇందుకోసం నేటి బడ్జెట్ లో 37.39 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

రైతుకు ఎక్స్ గ్రేషియా...
అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఆత్మహత్యకు పాల్పడకూడదు. దురదృష్టవశాత్తూ అలాంటి విషాదం జరిగితే ఆ బాధిత కుటుంబానికి తక్షణం అండగా నిలిచేలా 7లక్షల రూపాయిల ఆర్థిక సాయం అందించేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేసారు. ఈ బడ్జెట్ లో రైతుల ఎక్స్ గ్రేషియా కోసం 20 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

రాయితీపై యంత్రపరికారాలు

వ్యవసాయానికి యాంత్రీకరణ అవసరం. గ్రామాల్లోని రైతులకు అద్దె ప్రాతిపదికన యంత్ర పరికరాలు అందించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీకేలను అనుసంధానించుకుంటూ ఇప్పటికే ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా రైతుల కోరికపై 3,50,000 మంది సన్నకారు రైతులకు స్ప్రేయర్లు, టార్పాలిన్లను 50% సబ్సిడీపై అందించింది మన ప్రభుత్వం. ఇందుకోసం 450 కోట్లు వెచ్చిస్తున్నాం. 

వ్యవసాయంలో నవశకం కిసాన్ డ్రోన్లు
వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతులకు అందించాలని సీఎం వైయస్ జగన్ నిర్దేశించారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయ రంగంలో డ్రోన్ల ద్వారా పురుగు మందులు, కలుపు మందుల పిచికారీ వల్ల ఎరువుల వినియోగం 20% తగ్గింది. దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గి, నికర ఆదాయం పెరుగుతుంది. ఆర్బీకేల్లో 10 వేల డ్రోన్లను ఏర్పాటు చేసి, గ్రామీణ యువతకు, రైతులకు వీటి వినియోగంపై ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా శిక్షణ అందిస్తున్నాం. తొలిదశలో 200 కోట్ల విలువగల డ్రోన్లతో కూడిన 2000 వైయస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ బడ్జెట్లో డ్రోన్లు-సాంకేతిక ప్రోత్సాహానికి 80కోట్ల నిధులతో ప్రణాళిక చేసాం. 

చిరుధాన్యాలకు ప్రోత్సాహం

వైయస్ జగన్ గారి చొరవతో చిరుధాన్యాలకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2500 ప్రకటించాం. 
ప్రాథమిక ప్రాసెసింగ్ యంత్ర సామగ్రికి లక్షా ఇరవై ఐదు వేల రాయితీని రైతులకు అందించాం. 
చిరుధాన్యాల ప్రోత్సహం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 
అంగన్వాడీల్లో, విద్యార్థుల మధ్యాహ్న భోజనాల్లో చిరుధాన్యాలను చేర్చడం ద్వారా  పోషకాహార లోపాలను సరిదిద్దాలని నిర్ణయించాం. 
రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకమైన వ్యవసాయశాఖకు ఈ వార్షిక బడ్జెట్ లో మొత్తం 12,369.50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

ఉద్యాన పంటలు
రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనిచ్చే ఉద్యాన పంటలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. 
రాష్ట్రంలో 44,87,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి. 3,14,78,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదు అయ్యింది. 
దేశ పండ్ల ఉత్పత్తిలో  15.60% వాటాతో ప్రథమ స్థానంలో ఉంది. 
ఉద్యానశాఖ గత ఏడాదికంటే 10.56% వృద్ధి నమోదు చేసింది. 
రాష్ట్ర స్థూల విలువ జోడింపుగా 52,923 కోట్లు అందించింది. 
అరటి ఎగుమతుల్లో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది ఏపీ. 

ఉద్యాన శాఖ ప్రతిపాదనలు
సూక్ష్మ సేద్యం కిందకు అదనంగా 3,75,000 ఎకరాలను తీసుకురావడం
ఉద్యాన ప్రభుత్వ నర్సరీలో నాణ్యమైన మొక్కల ఉత్పత్తి సరఫరా
రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు, ఉద్యాన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు మరింత పెంచడం, కార్పొరేట్లకు అనుసంధానించడం.
సూక్ష్మ సేద్యం కోసం రైతులకు సహకారం. 
గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ పరికరాలకు సంబంధించి 969.40 కోట్లు బకాయిలను సైతం తీర్చాం. 
ఉద్యాన రైతుల అభ్యున్నతి కోసం ఈ వార్షిక బడ్జెట్ లో ఉద్యాన శాఖకు మొత్తం 656.64 కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తున్నాం. 

పట్టు పరిశ్రమ
సమగ్ర ఈ మార్కెటింగ్ ద్వారా పట్టు పరిశ్రమ ప్రగతి పథంలో ఉంది. 
బైవూల్టెన్ పట్టు గూళ్ల ధరలు కేజీ రూ.487 నుండి రూ.589 కి పెరిగి పట్టు రైతులకు అధిక లాభాలు చేకూరాయి. 
ఉత్తమ బైవోల్టెన్ ప్రాక్టిసింగ్ స్టేట్ గా జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకున్నాం. 
రాష్ట్రంలో పట్టు పరిశ్రమ విభాగానికి మొత్తం 99.72 కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తున్నాం. 

మార్కెటింగ్

రైతుల పంట ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్ లో ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధరకు తక్కువకు అమ్ముతున్నట్టు తెలిస్తే ప్రభుత్వం జోక్యం కల్పించుకుని 3వేల కోట్ల రూపాయిలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధినుండి రైతులను ఆదుకుంటుంది. రాష్ట్రంలోని 218 మార్కెట్ కమిటీల ద్వారా ఈ ప్రయోజనం రైతులకు అందిస్తున్నాం. మద్దతు ధరలేని 6 పంటలకు కనీస మద్దతు ధర కల్పించి మన ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 
మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి లకు మద్దతు ధర ప్రకటించి రైతులకు మేలు చేసారు సీఎం వైయస్ జగన్. 
సీఎం యాప్ ద్వారా రోజూ ప్రతి గ్రామం నుండి వ్యవసాయ ధరలను నమోదు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. 
రాష్ట్ర రైతులను దేశంలోని వ్యాపారులతో అనుసంధానించడానికి ఈ ఫార్మ్ మార్కెటింగ్ ప్లాట్‌ ఫాం ఏర్పాటు చేసాం. 
దీనిద్వారా ఇప్పటి వరకూ 53.51 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. 

నాడు-నేడు
వ్యవసాయ శాఖలో నాడు నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టాం.
మార్కెటింగ్ శాఖ అభివృద్ధి కోసం 513.74 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

సహకార వ్యవస్థ
వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అభివృద్ధికి సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుంది.
70,29,000 సభ్యత్వంతో రాష్ట్రంలో 2,046 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు సేవలందిస్తున్నాయి. 
ఆప్కాబ్ స్వప్పకాలిక రుణంగా 8,278.42కోట్లు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణంగా 2,115.56 కోట్లు అందించింది. 

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి

నాబార్డు ద్వారా మంజూరైన 1,844.95 కోట్లు వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తున్నాం. 

మహిళా పాడి సహకార సంఘాలు
పాడిరైతులకు వెన్నుదన్నుగా నిలిచేలా అమూల్ తో ఒప్పందం చేసుకుంది మన ప్రభుత్వం. పాడి రైతుకు సాధ్యమైనంత ఉత్తమ ధర అందించడానికి, రాష్ట్రంలో పాడి సహకార సంఘాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 
నాణ్యమైన పాల సేకరణ కోసం AMCU (ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్), BMCU (బల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్), బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ భనాల ఏర్పాటుకు 680 కోట్లు వెచ్చిస్తున్నాం. 
అమూల్ పాలవెల్లువ మొదటి దశలో 17 జిల్లాల్లో మొదలై 3,145 గ్రామాల్లో 2,63,000 మంది మహిళా పాడిరైతుల నుండి 701 కోట్ల లీటర్ల పాలు సేకరించి 307.60 కోట్ల పాల బిల్లులను నేరుగా వారి ఖాతాలకు చెల్లించాము. 
రాష్ట్రంలో సహకార డెయిరీ రంగ పునరుద్ధరణతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో గత రెండేళ్లలో అమూల్ సంస్థ పాల ఉత్పత్తి ధరను 7సార్లు పెంచింది. దీంతో ప్రైవేటు డెయిరీలు సైతం పాల ఉత్పత్తి ధరను పెంచక తప్పలేదు. దీనివల్ల పాడి రైతులకు 2,897 కోట్ల అదనపు ప్రయోజనం లభించింది. 

సహకార శాఖకు ఈ వార్షిక బడ్జెట్ లో 233.71 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

ఫుడ్ ప్రాసెసింగ్ పై ప్రత్యేక దృష్టి

ఫుడ్ ప్రాసెసింగ్ కు అనుకూలమైన పంటలు, ఉత్పత్తులు అంటే పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, డైరీ, పౌల్ట్రీ, ఆక్వా ఉత్పత్తులు పండించడంలో ఏపీ ముందంజలో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ ను ప్రోత్సహించడానికి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2025ను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులు తమ పంటకు అధిక విలువను జోడించి అధిక లాభాలూ పొందగలరు. 
ఆర్బీకే, మార్క్ ఫెడ్, రైతుల వద్ద మిగులు ఉత్పత్తులను ప్రోసెస్ చేసేందుకు సెకెండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి వంతున 26 యూనిట్లు సుమారు 3,600 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనుంది. 20% రాష్ట్ర బడ్జెట్ 80% బ్యాంక్ లోన్ తో ఏర్పాటు అవుతాయి. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి ఈ వార్షిక బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించడం జరిగింది. 
సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు ఈ వార్షిక బడ్జెట్ లో 40 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 
ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, ప్రోత్సాహకాల కోసం ఈ ఏడాది బడ్జెట్ లో రూ.146 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 
మొత్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రూ.286.45 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం
అత్యధిక పీజీ స్కాలర్ షిప్ లు విషయమై జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది. 
2022-23లో నెల్లూరు జిల్లా, ఉదయగిరిలో మేకపాటి గౌతం రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రారంభం అయింది. 
వ్యవసాయంలో డ్రోన్ వినియోగంపై రైతులకు, యువతకు శిక్షణ అందిస్తోంది. 
ఈ వార్షిక బడ్జెట్ లో ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 472.57 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదిస్తున్నాం. 

డా.వైయస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం
వరుసగా 2020, 21, 22 అత్యధిక సంఖ్యలో ఉత్తీర్ణతలతో 2వ ర్యాంక్ సాధించింది. 

శ్రీవేంకటేశ్వర పశువైద్య విద్యాలయానికి 138.50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 
ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వ విద్యాలయం ఈ ఏడాది 27.45 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

పశుసంవర్ధక శాఖ
పాడి మన జీవనాడి. పశువుల ఆరోగ్య పరిరక్షణకు రైతుభరోసా కేంద్రాల్లో రాజన్న పశువైద్యం ద్వారా పశువులకు వైద్యసేవలు అందిస్తున్నాం. 
డా.వైయస్సార్ సంచార పశుఆరోగ్య సేవ, వెటర్నరీ మెడిసిన్ కాల్ సెంటర్, వికేంద్రీకృత జంతు వ్యాధి నిర్థారణ, ఆంధ్రా గో పుష్టి విభాగాలు స్కోచ్ అవార్డు అందుకున్నాయి. 
పశు సంవర్థక శాఖకు 1,114.23 కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తున్నాం. 

మత్స్యశాఖ
చేపలు, రొయ్యలు ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ 30% వాటాతో అగ్రగామిగా ఉంది. ఈ రంగం స్థూల విలువ జోడింపుకు 9% వ్యవసాయ స్థూల విలువ జోడింపుకు 25.6% అందిస్తోంది. దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల విలువలో 20,020 కోట్లతో ఏపీదే సింహ భాగం. 

వైయస్సార్ మత్స్యకార భరోసా

వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని 4వేల నుంచి 10వేలకు పెంచింది. డీజిల్ సబ్సిడీ అందించడంతో పాటు, వేట సమయంలో మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ మరణించినా, శాశ్వత వైకల్యం సంభవించినా ఆ కుటుంబానికి అందించే పరిహారం సైతం 5లక్షల నుండి 10 లక్షలకు పెంచింది. 

ఆక్వా రంగ సంక్షేమం

ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర రూ. 1.50కే అందిస్తోంది మన ప్రభుత్వం. 
నాణ్యమైన, ధృవీకరించిన ఆక్వాఫీడ్ ను ఆర్బీకేల ద్వారా అందజేస్తున్నాం. 
కొత్తగా సమీకృత ఆక్వా ల్యాబ్ లు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రభుత్వ ఆక్వా ల్యాబులను అప్‌ గ్రేడ్ చేసాం. 

ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
మత్స్యకారుల వలసలు నివారించేందుకు ప్రభుత్వం 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి రూ.3,605.89 కోట్లు కేటాయించింది. ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, జువ్వలదిన్నె హార్బర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా మిగిలిన ఐదు హార్బర్ల నిర్మాణాలకు కాంట్రాక్టులు ఖరారు అయ్యాయి. 
దేశీయంగా చేపల వినియోగాన్ని పెంచేలా ఆక్వాహబ్ లను ఏర్పాటు చేస్తోంది మన ప్రభుత్వం. 
అలాగే 10 ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ఆక్వా ఫార్మర్ సొసైటీస్ ద్వారా 546.91కోట్లతో స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 20% రాయితీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. 

9 గంటల ఉచిత విద్యుత్
ప్రస్తుతం రాష్ట్రంలో 19,21,000 వ్యవసాయవిద్యుత్ కనెక్షన్ల ద్వారా రైతులకు పగటిపూట 9 గంటల నాణ్యమైన  విద్యుత్ అందిస్తున్నాం. 
ఆక్వారైతులకు సైతం యూనిట్ కు రూ.3.50 రాయితీని ఇచ్చి చేయూత అందిస్తున్నాం. 
వ్యవసాయ రంగానికి రానున్న 30 ఏళ్లలో ఉచిత విద్యుత్ అందించే విధంగా సీఎం వైయస్ జగన్ ప్రణాళిక సిద్ధం చేసారు. 
ఇందుకోసం 7వేల మెగావాట్ల విద్యుత్ ని సెకీ ద్వారా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. 
ఈ వార్షిక బడ్జెట్ లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం 5,500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

ఉపాధి హామీ పథకం

గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పిస్తూ, వ్యవసాయ రంగానికి దీర్ఘ కాలిక ప్రయోజనాలు కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాం. 
వీటికోసం 2,833కోట్ల రూపాయిలు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పనులకు ఖర్చు చేసాం. 
వ్యవసాయ అనుసంధానంతో ఉపాధి హామీ పథకం కోసం ఈ వార్షిక బడ్జెట్ లో రూ.5,100 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

వైయస్సార్ జలకళ
అర్హులైన రైతులకు ఉచితంగా బోరు బావులు వేయించేందుకు ఉద్దేశించిన పథకం వైయస్సార్ జలకళ. ఈ పథకం క్రింద ఇప్పటి వరకూ 1747 బోరు బావులు తవ్వారు. 
2022-23లో 64.93 కోట్ల వ్యయంతో 5,185 బోరు బావులు తవ్వగా 7179 మంది రైతులు లబ్ది పొందారు. 
2023-24 సం.లో 212.64 కోట్ల అంచనా వ్యయంతో 20 వేల బోరు బావులు తవ్వడం ద్వారా 30వేల మంది రైతులకు మేలు జరిగి, లక్ష ఎకరాల భూమి సాగులోకి తేవాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. రూ.375 కోట్ల అంచనా వ్యయంతో విజయవంతమైన బోరు బావులకు 25 వేల పంపుసెట్లను చిన్న, సన్నకారు రైతులకు అందించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది ఈ లక్ష్యం కోసం ప్రతిపాదిస్తున్న బడ్జెట్ 252 కోట్లు. 

 సాగునీరు

మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 685 TMCల నీరు అందించి, 1,24,25,000 ఎకరాలను సాగు చేయడం జరిగింది.

పోలవరం
పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వాల తప్పిదాలను సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు  వెళ్లేందుకు నిపుణల సలహాతో, అనుమతులు పొంది పనులను శరవేగంగా కొనసాగిస్తోంది మన ప్రభుత్వం. 
ఈ ఏడాది నీటివనరుల శాఖ బడ్జెట్ 11,908.10 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అనుబంధ శాఖల బడ్జెట్  మొత్తం 41,436.29 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 
గత ప్రభుత్వ హయాంలో 23,183 కోట్లరూపాయిలు మాత్రమే ఉన్న బడ్జెట్ నేడు సీఎం వైయస్ జగన్ ఆధ్వర్యంలో పూర్తిగా 100% రెట్టింపుతో 41,436.29 కోట్లకు చేరిందని తెలపడానికి గర్విస్తున్నాం. 

మట్టే తన సంపద అని భావించి, అందులోనే తన జీవితాన్ని చూసుకునే మట్టిమనిషికి, రైతన్నకు ఎంత సాయం చేసినా తక్కువే అంటారు సీఎం వైయస్ జగన్. 
ఆ స్ఫూర్తితోనే రైతులకు ఎప్పుడూ అండగా ఉండేందుకు మేము కృషి చేస్తున్నాం. 
రైతంటే మమకారం, వ్యవసాయం అంటే ఎనలేని ప్రేమ అని చెప్పడమే కాక చేసి చూపిస్తున్న రైతు పక్షపాతి ముఖ్యమంత్రి సీఎం వైయస్ జగన్ కు రైతులందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్ ను సభ ఆమోదానికి ప్రవేశ పెడుతున్నాను.

Back to Top