విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో తీసుకుంటున్న సంస్కరణలు, నిర్ణయాలు సహకార రంగంలో కూడా తీసుకోగలిగారు కాబట్టే ఈ వజ్రోత్సవాలను గర్వంగా, ఆడంబరంగా నిర్వహించుకోగలుగుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం వైయస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. అందరికీ నమస్కారం, అరవై ఏళ్ళు పూర్తి చేసుకుని గర్వంగా వజ్రోత్సవం చేసుకుంటున్న శుభ సందర్భంలో ఈ స్ధాయికి తీసుకురావడానికి కృషిచేసిన సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. సీఎంగారు అన్ని రంగాల్లో తీసుకుంటున్న సంస్కరణలు, నిర్ణయాలు సహకార రంగంలో కూడా తీసుకోగలిగారు కాబట్టే ఈ వజ్రోత్సవాలను గర్వంగా, ఆడంబరంగా నిర్వహించుకోగలుగుతున్నాం. 2019కు ముందు ఆప్కాబ్‌కు సంబంధించి రూ. 13,700 కోట్ల లావాదేవీలు ఉంటే ఈ రోజు దాదాపుగా రూ. 36,700 కోట్లకు పెంచుకోగలిగాం, సహకార బ్యాంకులకు సంబంధించి కేవలం రూ. 53,000 కోట్లు ఉంటే ఈ రోజు రూ. 1,05,000 కోట్ల లావాదేవీలకు పెంచుకోగలిగాం. 36 ఏళ్ళుగా నష్టాల్లో ఉన్న కర్నూలు డీసీసీబీని ఈ రోజు లాభాల బాటలోకి తీసుకొచ్చాం, 22 ఏళ్ళుగా నష్టాల బాటలో ఉన్న కడప కేంద్ర సహకార బ్యాంకును ఈ రోజు లాభాల బాటలోకి తీసుకొచ్చాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టి పోతే సీఎంగారి దృష్టికి తీసుకువెళ్ళగానే సహకార బ్యాంకులకు రూ. 440 కోట్లు అందించిన ఘనత సీఎంగారిది, ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన దగ్గర షేర్ క్యాపిటల్ కూడా లేని పరిస్ధితుల్లో సీఎంగారు చొరవ తీసుకుని ఒకే ఒక్క ఆదేశంతో రూ. 295 కోట్లు బ్యాంకులకు ఇవ్వమన్నారు, దీంతో బ్యాంకులు లాభాల బాటలోకి వచ్చాయి, విజన్ ఉన్న లీడర్ సీఎంగారు, కేంద్ర సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. సహకార బ్యాంకులు రైతులకు పూర్తి అండదండగా నిలుస్తున్నాయి. ఏపీలో మనం ఆచరిస్తున్నదే ఇప్పుడు దేశం అనుసరిస్తుంది. విజయ అనే బ్రాండ్‌ను చంద్రబాబును సర్వనాశనం చేస్తే మన సీఎంగారు అన్నీ వాటిని పునరుద్దరణ చేస్తున్నారు. పీఏసీఎస్‌లను కూడా లాభాల బాటలోకి తీసుకొస్తున్నారు, 70 ఏళ్ళకు మనం ప్లాటినం జూబ్లీ వేడుకలు చేసుకుంటాం, ఆ రోజు కూడా సీఎంగా శ్రీ జగన్ గారు వస్తారు. తప్పనిసరిగా ఆ రోజుకు పీఏసీఎస్‌లు కూడా లాభాల బాటలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుందాం, అందరికీ ధన్యవాదాలు, అభినందనలు.