తాడేపల్లి: డర్టీ చంద్రబాబు.. మహానాడు వేదికపై ఒక టిష్యూ మేనిఫెస్టోను విడుదల చేశాడని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. 2014 ఎన్నికల ముందు సుమారు 650కి పైగా వాగ్దానాలతో విడుదల చేసిన మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడని, గతంలో ఆల్ ఫ్రీ బాబూ.. నేడు ఆల్ కాపీ బాబుగా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. దమ్మూ, ధైర్యం ఉంటే మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా..? అని చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో పట్టుమని 10 హామీలు కూడా అమలు చేయలేని డర్టీఫెలో చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్ర చూస్తే మొత్తం గజదొంగను మించి ఉంటుందన్నారు. మహానాడు వేదికపై చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను మంత్రి జోగి రమేష్ చింపేసి చెత్తబుట్టలో పడేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని వాగ్దానాలను 98 శాతం అమలు చేసిన చరిత్రకారుడు సీఎం వైయస్ జగన్ అన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి.. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇచ్చిన మాటను నెరవేరుస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని చెప్పారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పనికిమాలిన చంద్రబాబు తల్లికి వందనం అని వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకాన్ని కాపీ కొట్టి మరీ గొప్పగా చెబుతున్నాడని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాలుగేళ్లుగా అమ్మ ఒడి పథకాన్ని చదువుకునే పిల్లల తల్లులకు అందజేస్తున్నారని గుర్తుచేశారు. 14 సంవత్సరాల్లో చంద్రబాబు చేయలేని కార్యక్రమాలన్నీ నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలోనే సీఎం వైయస్ జగన్ చేసి చూపించారన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో 2.11 లక్షల కోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా చేరవేశారన్నారు. ఏ గ్రామానికి వెళ్లి చూసినా సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ కనిపిస్తాయి. ఏ ఇంటికి వెళ్లినా అమ్మ ఒడి, ఆసరా, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక కనిపిస్తాయి. ప్రతి ఊరిలో అభివృద్ధి, ప్రతి గడపలో సంక్షేమం కనిపిస్తాయని చెప్పారు. నాలుగు సంవత్సరాల కాలవ్యవధిలో ఇవన్నీ సీఎం వైయస్ జగన్ చేసి చూపించారన్నారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో దేశంలోని ముఖ్యమంత్రులంతా సీఎం వైయస్ జగన్‌ను చూసి నేర్చుకోవాల్సిందేనన్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, స్టేట్ హైవేలు, నేషనల్ హైవేలు ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మంత్రి జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు నకిలీ నాయకుడు.. ఆయనకు సొంత పార్టీ లేదు.. గుర్తు లేదు.. ఒంటరిగా నిలబడి పోటీచేసే సత్తా కూడా లేదన్నారు. పిరికిపంద చంద్రబాబుకు సీఎం వైయస్ జగన్‌ను ఓడించే దమ్ముందా..? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఆల్ ఫ్రీ బాబు ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడో.. 2024 ఎన్నికల్లో ఆల్ కాపీ బాబు అడ్రస్ గల్లంతవుతుందన్నారు. వచ్చే సంవత్సరం మహానాడు తేదీ నాటికి చంద్రబాబు, టీడీపీకి పాడె కట్టి ఓ పక్క కృష్ణానదిలో, మరోపక్క గోదావరిలో ప్రజలే కలుపుతారన్నారు. చంద్రబాబు చాప, దిండు సర్దుకొని హైదరాబాద్‌కో, సింగపూర్‌కో, అండమాన్‌కో పారిపోక తప్పదన్నారు. పిట్టల దొరలా వేషాలు వేసుకొని మహానాడు వేదికపై రంకెలేస్తున్నాడన్నారు. 2014–19లో నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చంద్రబాబు ఏం పీకాడని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. దీపం పథకం గతంలో అమలు చేసి ఉంటే చంద్రబాబు దీపాన్ని అక్కచెల్లెమ్మలు ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం 14 ఏళ్లలో ఎందుకు చేయలేదు..? ప్రతి రైతుకు 20 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు.. 2014–19 కాలంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయాడు..? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. బీసీలను రక్షించడం కాదు.. భక్షించిందే చంద్రబాబు.. బీసీలు టీడీపీకి అండాదండా అని మాయమాటలు చెప్పి బీసీలను తొక్కేశాడు. బీసీలకు ఒక్కరికైనా రాజ్యసభ సీటు ఇచ్చావా..? వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వ కేబినెట్‌లో 25 మంత్రి పదవులు ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 17 మంత్రి పదవులు సీఎం వైయస్ జగన్ ఇచ్చారు. ఏనాడైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశానని చెప్పగలవా చంద్రబాబు..? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. బీసీల రక్షణ, బీసీల ఆత్మగౌరవం సీఎం వైయస్ జగన్ అని మంత్రి జోగి రమేష్ అన్నారు. పేదల రక్తాన్ని పీల్చిన చంద్రబాబు.. ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు. 50 వేల మంది పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి చంద్రబాబు అడ్డుపుల్లలు వేశాడని గుర్తుచేశారు. సామాజిక సమతూల్యం దెబ్బతింటుందని మాట్లాడిన పనికిమాలిన చంద్రబాబు.. పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెబితే ప్రజలెవరూ నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం వైయస్ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడి సాధించిందన్నారు.