బీసీ సంక్షేమంపై చర్చకు చంద్రబాబు సిద్ధమా..?

బాబుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ సవాల్‌

నా ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బాబుకు, ఆయన బానిసలకు ఉందా..?

బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక్క వ్యక్తికైనా రాజ్యసభ సీటు ఇచ్చారా..?

రాజ్యసభ సీటు ఆశచూపి వర్ల రామయ్యను మోసం చేసింది వాస్తవం కాదా..?

మూడేళ్లలోనే 85 వేల మంది బీసీ ప్రజాప్రతినిధులను తయారుచేసిన ఏకైక లీడర్‌ సీఎం వైయస్‌ జగన్‌

జయహో బీసీ సభ సక్సెస్‌ చూసి చంద్రబాబులో అసూయ, ద్వేషం పెరిగింది

మా పథకాలను కొనసాగిస్తానంటే.. మా జగనన్నకు జిందాబాద్‌ కొట్టినట్టే..

తాడేపల్లి: 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బీసీలకు చంద్రబాబు ఏం చేశారో.. మూడు సంవత్సరాల కాలంలో సీఎం వైయస్‌ జగన్‌ ఏం చేశారనే అంశంపై చర్చకు చంద్రబాబు సిద్ధమా..? అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ స‌వాల్ విసిరారు. 14 సంవత్సరాల పాలనలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక్క వ్యక్తికైనా రాజ్యసభ సీటు ఇవ్వగలిగావా..? అని నిలదీశారు. 14 సంవత్సరాల కాలంలో బీసీలను టీడీపీ ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీలో గానీ భాగస్వామ్యులను చేయగలిగావా..? దమ్ముంటే లిస్ట్‌ తీయాలని చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్‌ సవాల్‌ విసిరారు. మూడు సంవత్సరాల కాలంలో మా లీడర్, సీఎం వైయస్‌ జగన్‌ 85 వేల మంది బీసీలను ప్రజాప్రతినిధులుగా తయారు చేశారని చెప్పారు. జయహో బీసీ మహాసభ సక్సెస్‌ను చూసి చంద్రబాబుకు అసూయ, ద్వేషం పెరిగిపోయిందన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేలా, కించపరిచేలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. రాజ్యసభ మెంబర్‌ నుంచి పంచాయతీ బోర్డు మెంబర్‌ వరకు సుమారు 85 వేల మంది ప్రజాప్రతినిధులు ఒక్కచోట చేరి మా ఉన్నతికి కారణం సీఎం వైయస్‌ జగన్‌ అని బీసీ మహాసభ సాక్షిగా కీర్తించారన్నారు. మూడు సంవత్సరాల కాలంలో 85 వేల మంది ప్రజాప్రతినిధులను తయారు చేసిన దేశంలోనే ఏకైక లీడర్‌ సీఎం వైయస్‌ జగన్‌ అని బీసీలంతా పండుగ చేసుకుంటుంటే.. ఆ పండుగను చూసి కళ్లుకట్టి అసూయ, ద్వేషంతో చంద్రబాబు రగిలిపోతున్నాడన్నారు. బీసీల ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టే విధంగా, కించపరిచే విధంగా మూడు రోజుల నుంచి చంద్రబాబు అనేక వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన 14 సంవత్సరాల కాలంలో బీసీలను ఆయన ప్రభుత్వంలో, టీడీపీలో గానీ భాగస్వామ్యులను చేయగలిగాడా..? దమ్ముంటే లిస్ట్‌ తీయాలని మంత్రి జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. మూడు సంవత్సరాల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిపాలనలో 85 వేల మంది బీసీలను ప్రజాప్రతినిధులను చేసి గొప్ప వ్యక్తి, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయ నిర్మాత సీఎం వైయస్‌ జగన్‌ అని పునరుద్ఘాటించారు. 

పిచ్చిపట్టినట్టు, సైకోలా ప్రవర్తిస్తున్న చంద్రబాబుకు.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ఉందా అని మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. బాబును మోస్తూ బానిస బతుకు బతుకుతున్న అచ్చెన్నాయుడు, యనమల, అయ్యన్నపాత్రుడుకు ఉందా..? అని ప్రశ్నించారు. 
 
14 సంవత్సరాల చంద్రబాబు హయాంలో బీసీ సమాజానికి సంబంధించిన ఒక్క వ్యక్తికైనా రాజ్యసభ సీటు ఇచ్చారా..? కంభంపాటి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ తప్పు బీసీలకు ఇచ్చారా..? వర్ల రామయ్యకు రాజ్యసభ టికెట్‌ ఇస్తామని టీవీల్లో ప్రకటనలు ఇప్పించారు. అది చూసి ఉప్పొంగిపోయిన వర్ల రామయ్య బాబు ఇంటికి బయల్దేరి ప్రకాశం బ్యారేజీ దాటకముందే ఆ టికెట్‌ను కనకమేడలకు అమ్ముకోలేదా..? అని మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు.

వెనుకబడిన వర్గాలను ఓట్ల కోసం వాడుకొని, వదిలేసి.. ఈరోజు మళ్లీ అధికారం చంద్రబాబు పరితపిస్తున్నాడన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తీసేయను.. కొనసాగిస్తానని మాట్లాడుతున్నాడంటే.. ఆ మాటలోనే సీఎం వైయస్‌ జగన్‌ గొప్పతనం ఏంటో అర్థమైపోతుందన్నారు. 14 సంవత్సరాల కాలంలో చంద్రబాబు చేయలేని అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల వద్దకు సీఎం వైయస్‌ జగన్‌ తీసుకెళ్తున్నారు కాబట్టే.. ఆ పథకాలను కొనసాగిస్తానని చెబుతున్నాడు. ఇంతకంటే మాకు ఏం కావాలి.. పథకాలను కొనసాగిస్తానని చంద్రబాబు అంటున్నాడంటే.. సీఎం వైయస్‌ జగన్‌కు జిందాబాద్‌లు కొట్టడమే అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. 

అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా చంద్రబాబు సిద్ధపడ్డాడు. బీసీల ఓట్ల కోసం మళ్లీ గాలం వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే జయహో బీసీ మహాసభను అపహాస్యం చేసి.. సభకు 85 వేల మంది ప్రజాప్రతినిధులు తరలివస్తే.. ఎవరూ రాలేదని, ఖాళీ కుర్చీలని, జనం లేచిపోతున్నారని పచ్చ గ్యాంగ్‌తో టీవీల్లో ప్రచారం చేయిస్తున్నాడు.. పేపర్లలో రాయిస్తున్నాడు. మా బీసీల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం.. సీఎం వైయస్‌ జగన్‌తో సాధ్యమైంది. మీటింగ్‌కు ఒక్కరోజు ముందే బీసీ సోదరులంతా రాష్ట్ర నలుమూలల నుంచి కేరింతలు కొట్టుకుంటే వచ్చారు. కానీ, చంద్రబాబు, ఎల్లో మీడియా మాత్రం నిర్లజ్జగా  అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బాబు అండ్‌ కో ఎన్ని వేషాలు వేసినా, ఎంత ప్రలోభపెట్టాలని చూసినా బీసీలు సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉంటారు అని మంత్రి జోగి రమేష్‌ స్పష్టం చేశారు. 
 

Back to Top