తాడేపల్లి: చంద్రబాబు తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రతినిధి అని, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమసమాజ స్థాపనకు ప్రతినిధి అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. 75 ఏళ్ల స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ గతంలో సామాజిక ధర్మం పాటించలేదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సీఎం వైయస్ జగన్ సామాజిక ధర్మం, సామాజిక న్యాయం పాటించారన్నారు. మహానాడు వేదికపై చంద్రబాబు.. ఒక మాయల ఫకీరులా కూర్చుని రెండు రోజుల పాటు ప్రభుత్వం మీద, సీఎంపైన అడ్డగోలు విమర్శలు, తిట్ల పురాణంతో సాగించాడని ధ్వజమెత్తారు. తొడలు కొడితే, బూతులు తిడితే సామాజిక న్యాయం అవుతుందా..? అని చంద్రబాబును మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి జోగి రమేష్ ఇంకా ఏం మాట్లాడారంటే.. మూడేళ్లలో సీఎం వైయస్ జగన్ అమలు చేసిన సామాజిక న్యాయం చూసి మేధావులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఆశ్చర్యపోతున్నారు. తాము అడగకుండానే ఈ స్థాయిలో సీఎం సామాజిక న్యాయం చేశారని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు సామాజిక న్యాయభేరి యాత్రకు అడుగడుగునా ఆదరణ చూపారు. కృతజ్ఞత కనబర్చారు. సీఎం వైయస్ జగన్ అభినవ పూలే.. ఇవాళ బీసీలు యావత్తూ టీడీపీకి దూరం అయ్యారు. అందరూ సీఎం వైయస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించారు. సీఎం వైయస్ జగన్‌ని వారు అభినవ పూలే అని కూడా అభివర్ణిస్తున్నారు. అన్ని నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఇస్తూ ఏకంగా చట్టమే చేశారు. శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్‌తో పాటు, మంత్రివర్గంలో కూడా ఆ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సామాజిక న్యాయం చేశారు. ఆ విధంగా ఆయన సామాజిక న్యాయ నిర్మాత అయ్యారు. ఇవాళ అన్ని ప్రాంతాల వారు ఒకటే చెబుతున్నారు. 2024లో వైయస్ జగన్ వన్స్‌మోర్. అంటే మళ్లీ జగనే కావాలి అని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, అలాగే అన్ని పార్టీలు కూడా సామాజిక ధర్మం సీఎం వైయస్ జగన్‌లా పాటిస్తే, సామాజిక న్యాయం కావాలని ఎవరూ గొంతెత్తి అడగాల్సిన పని లేదు. మిగిలిన రాష్ట్రాలకు చెందిన బడుగు, బలహీనవర్గాల నేతలు మాకు ఫోన్ చేసి, మన సీఎంని ఎంతో ప్రశంసిస్తున్నారు. అందుకు ఎంతో గర్వంగా ఉంది. తొడలు కొట్టిస్తే ఏమైంది..? వాస్తవానికి బీసీలకు తాను ఏం చేశానన్నది కూడా చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన వారి కోసం ఏమీ చేయలేదు. అదే సీఎం వైయస్ జగన్ ఎన్నైనా చెప్పగలరు. బాబుకు దమ్ముంటే మేము చెప్పేదానికి చర్చకు రావాలి. చంద్రబాబు మీరు ఏనాడైనా బీసీలు, ఎస్సీలకు రాజ్యసభ టికెట్ ఇచ్చి అవకాశం కల్పించారా? చివరకు నీ పార్టీ నాయకుడు వర్ల రామయ్యకు రాజ్యసభ టికెట్ ఇస్తానని చెప్పి, మాట తప్పావు. చంద్రబాబు అసలు నీకు సిగ్గుందా? మహానాడులో తొడలు కొట్టిస్తావా? గత ఎన్నికల్లో మీ బావమరిది బాలకృష్ణతో కూడా తొడలు కొట్టించావు. కానీ ఏమైంది. మాపై వ్యతిరేకత ఎందుకుంటుంది..? మహానాడులో చంద్రబాబు అన్న మాట ప్రజా వ్యతిరేకత. అసలు ప్రజలకు సీఎం వైయస్ జగన్‌పై ప్రజలకు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది. ఈ ప్రభుత్వం గత మూడేళ్లలో ఏకంగా రూ.1.41 లక్షల కోట్లు, నేరుగా సామాన్యులు, నిరుపేదల ఖాతాల్లో జమ చేసింది. ఎక్కడైనా మీ హయాంలో ఉన్నట్లు జన్మభూమి కమిటీలు, దళారులు ఉన్నారా? మరి మామీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది?. అమ్మఒడి ఇస్తున్నందుకు అక్కచెల్లెమ్మల్లో వ్యతిరేకత ఉంటుందా? రైతు భరోసా ద్వారా పెట్టుబడి ఇస్తుంటే వారిలో వ్యతిరేకత ఉంటుందా? ఆసరా ద్వారా దాదాపు 90 లక్షల అక్కచెల్లెమ్మలకు వారి రుణాలు చెల్లిస్తుంటే వ్యతిరేకత ఉంటుందా? చేయూత ద్వారా సహాయం పొందుతున్న 45 నుంచి 60 ఏళ్ల అక్కచెల్లెమ్మలకు వ్యతిరేకత ఉంటుందా? దాదాపు 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తుంటే, వారిలో వ్యతిరేకత ఉంటుందా? సమసమాజ స్థాపన ప్రతినిధి.. చంద్రబాబు తన సామాజిక వర్గ ప్రతినిధి. అదే సీఎం వైయస్ జగన్ సమసమాజ స్థాపనకు ప్రతినిధి అని ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబుకు రాజ్యసభ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటే, పప్పు బెల్లానికి అమ్మేసుకునేవాడు. లేదా తన సామాజికవర్గానికి చెందిన వారికి ఇచ్చేవాడు. ఇవాళ సీఎం వైయస్ జగన్ చేస్తున్న సామాజికధర్మాన్ని అన్ని వర్గాలవారు ప్రశంసిస్తున్నారు. అందుకే అన్ని ప్రాంతాల వారు ఒకే మాట అంటున్నారు. తామంతా 2024లో సీఎం వైయస్ జగన్ కోసమే పని చేస్తామని బడుగు, బలహీనవర్గాల వారంతా స్పష్టం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, మైనారిటీలు ముక్తకంఠంతో అదే మాట చెబుతున్నారు. 75 ఏళ్ల స్వతంత్య్ర భారతావనిలో నాడు మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం శ్రీ వైయస్ జగన్ కేవలం మూడేళ్లలో చేసి చూపించారు. పూలే ఆలోచనలను అమలు చేస్తున్నారు. లక్షలాది పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెడుతున్నారు. అందుకే ఆయన ఒక అభినవ పూలే. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అయితే, అందులోని ప్రతి ఒక్కదాన్ని ఆచరించి చూపుతున్న గొప్ప వ్యక్తి సీఎం వైయస్ జగన్. అన్ని పదవుల్లో బడుగు, బలహీనవర్గాలను కూర్చోబెడుతున్నారు. అలా ఒక గొప్ప సామాజిక విప్లవాన్ని ఆయన సాధించారు. మరి అలాంటి సీఎం వైయస్ జగన్‌పై ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? చంద్రబాబు నీకా ధైర్యం ఉందా? మా ఒక్క అనంతపురం సభ, మీ మహానాడుకు సమానం. నీవు ఆ సమావేశానికి కోట్లు ఖర్చు పెట్టి ఉంటావు. చంద్రబాబుకు ఒకటే చెబతున్నాము. నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. ఈ మంత్రివర్గంలో సీఎం వైయస్ జగన్ 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. నేను 18 ఇస్తాను అని చెప్పావా? అలాగే రాజ్యసభ టికెట్లు బీసీలకు ఇస్తానని చెప్పే ధైర్యం చేశావా? కానీ అవేవీ చేయకుండా, చెంచాగాళ్లతో ప్రభుత్వాన్ని, సీఎం వైయస్ జగన్‌ని తిట్టించావు. అదేనా నీ రాజకీయం. లోకేష్ ఏదో పాదయాత్ర చేస్తారట. ఆయన ఎన్ని యాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు ఛీకొడతారు తప్ప, ఆదరించరు. మేము గడప గడపకూ వెళ్తున్నప్పుడు సీఎం వైయస్ జగన్ తమ సభ్యుడని ప్రతి కుటుంబం చెబుతోంది. చంద్రబాబు బాదుడే బాదుడు అని ఈమధ్య రోడ్ల మీద తిరుగుతుంటే, ప్రజలు ఒకటే చెబుతున్నారు. చంద్రబాబును కుమ్ముడే కుమ్ముడు అని. బుద్ధి చెబుతామని. ఎందుకంటే ప్రజలకు ఇది ఇస్తానని.. కనీసం ఒక్కటైనా నీవు మహానాడులో చెప్పావా. అదే బాబు–సీఎం వైయస్ జగన్‌కి తేడా.. ఎంతసేపూ డబ్బులు పంచుతున్నారని విమర్శలు చేశావు. ఔను పేదలకు కాకుండా డబ్బులు ఇంకా ఎవరికి పంచుతారు? చంద్రబాబు ఎంతసేపూ తన సామాజికవర్గం బాగుండాలి. ఇక్కడ అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలన్న ఆలోచన. అదే సీఎం వైయస్ జగన్‌ని చూస్తే రాష్ట్రంలో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు బాగుండాలి. అన్నీ అభివృద్ధి చెందాలి. అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలు చాలా బాగుండాలి అనుకుంటారు. సమసమాజ స్థాపన ఆయన లక్ష్యం. మళ్లీ మీకు ఓటమి తప్పదు.. చంద్రబాబుది తమ సామాజికవర్గం ముందుకు వెళ్లాలన్నదే లక్ష్యం. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. అందుకే నీవు, నీ అబ్బాయి చెరో పక్క నుంచి వచ్చినా, తల కిందులుగా తపస్సు చేసినా, 2024 ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్‌ని ఏమీ చేయలేరు. మీ పార్టీ మరోసారి ఓడిపోవడం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, 2019 ఎన్నికల్లో మాదిరిగానే వన్‌సైడ్ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే సీఎం వైయస్ జగన్ ప్రభంజనం కొనసాగుతోంది. ప్రజలు చంద్రబాబుకు చెంపలు వాయించి బుద్ధి చెబుతారు. చంద్రబాబువి మాయల మరాఠీ వేషాలు. అసలు తాను ఏం చేస్తానన్నది కూడా ఆయన మహానాడులో చెప్పలేకపోయాడు. పథకాలు ఆపేస్తానంటున్న చంద్రబాబును ప్రజలు ఎలా ఆదరిస్తారు? వైయస్ జగన్ పాదయాత్ర ఒక మహాఘట్టం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు మీరూ పాదయాత్ర చేసినంత మాత్రాన ప్రజలు ఆదరించరు.