చంద్రబాబు, లోకేష్‌ కూడా జైలుకెళ్లడం ఖాయం

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం

కర్నూలు: గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని శాఖల్లోనూ అవినీతి జరిగిందని, దోపిడీ అంతా ఒక్కొక్కటిగా బయటపడుతుందని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కుంభకోణాలకు పాల్పడిన వారందరినీ ఆధారాల ప్రకారం అరెస్టు చేస్తామన్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడి అరెస్టు ఆరంభం మాత్రమేనని, అవినీతి కేసులో చంద్రబాబు, లోకేష్‌ కూడా జైలుకెళ్లక తప్పదన్నారు. కర్నూలులో మంత్రి గుమ్మనూరు జయరాం మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం డిస్పెన్సరీలను తనిఖీ చేస్తే మందుల కొరత ఉన్నట్లు తెలిసిందని, మెడిసిన్‌ సప్లయ్‌ చేసే కంపెనీలకు రూ.300 కోట్లు బకాయిలున్నాయని చెప్పడంతో అనుమానం వచ్చి దర్యాప్తు చేయించామన్నారు. విజిలెన్స్‌ దర్యాప్తులో రూ.150 కోట్లు అవినీతి జరిగిందని తేలడంతోనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. 

తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇలాంటి స్కామ్‌ జరిగింది. తెలంగాణలో మాదిరిగానే  ఏపీలో కూడా నామినేటెడ్‌ పద్ధతుల్లో టెండర్లు కట్టబెట్టి రూ.150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని తేలిందన్నారు. టెలీ సర్వీస్, ఆర్‌సీ, నాన్‌ ఆర్‌సీ ద్వారా అచ్చెన్నాయుడు దోపిడీ చేశాడని మండిపడ్డారు. కార్మిక శాఖలోనే కాదు.. గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారంతా అవినీతికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి చాలా ఉందని, కచ్చితంగా ఆధారాలతో సహా దొరుకుతారన్నారు. టెలీ సర్వీస్‌కు నెలకు రూ.25 లక్షల దోపిడీ చేశారని, విచారణ పూర్తయిన తరువాతే ఏసీబీ అధికారులు అరెస్టు చేశారన్నారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, బీసీలెవరూ బాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. 
 

Back to Top