విశాఖపట్నం: నారా లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ఏం సాధించారో చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండు చేశారు. నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆయన సవాల్ విసిరారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పప్పు లోకేష్‌కు పప్పును కానుకగా పంపుతున్నాను. కొంచెం ఉప్పు కారం కూడా వేశాను. సిగ్గు లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. నేను లోకేష్‌లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ ను కాదు. రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం వైయస్ జగన్ దయ వలన మంత్రి అయ్యాను. అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించలేదా? 420 గాళ్లను పక్కన పెట్టుకొని 420 గాడిలా లోకేష్ మాట్లాడారు. మీ అన్న పవన్ విసన్నపేట వెళ్లి ఏమీ పికలేకపోయారు. నువ్వేమీ పికుతావు లోకేష్’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. విశాఖపట్నం సర్యూ్కట్‌హౌస్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటేః *శంఖారావం అంటూ లోకేశ్ వంకర మాటలుః* టీడీపీ శంఖారావం సభలో నారా లోకేశ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నామీద విమర్శలతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద, వారి కుటుంబ సభ్యులపై స్థాయికి మించినట్లు నోరుపారేసుకున్నాడు. శంఖారావం కార్యక్రమాన్ని ఆయన పలికినట్లు సంకారావం అని వంకరగా నేనైతే మాట్లాడలేను. ఎందుకంటే, నేను తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడ గలను. వాస్తవానికి అది అనకాపల్లి నియోజకవర్గ సమావేశమైనప్పటికీ, కార్యక్రమాన్ని మాత్రం యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగులాపల్లె ప్రాంతంలో నిర్వహించారు. ఈ విషయాన్ని ఈ లోకేశ్ మొద్దుకు తెలుసో లేదో నేను గుర్తుచేస్తున్నాను. *లోకేశ్‌కు రిటర్న్‌గిఫ్టు ఇస్తాం...ః* ప్రస్తుతం నేను నిర్వర్తించే శాఖనే గతంలో లోకేష్ కూడా చేశాడు గనుక.. అప్పట్లో ఆయనేదో ఊడబొడిచినట్లు.. ఎన్నెన్నో ఘనకార్యాల్ని వెలగబెట్టిన ట్లు బిల్డప్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన విమర్శల్లో భాగంగా నిన్నేదో నాకు గిఫ్టు పంపుతున్నాననే విన్యాసానికి పాల్పడ్డాడు. మరి, భారతీయ సంప్రదాయం ప్రకారం మనకెవరైనా ఏదైతే బహుమతి ఇచ్చినప్పుడు.. మనం కూడా తిరిగి వారికి ఏదొకటి బహూకరించడమనేది ఆనవాయితీ. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు మంచివారు. సంప్రదాయాల్ని పాటించే వారు. ఈ మాత్రం మర్యాద, సంస్కృతి, సంప్రదాయం మాకూ తెలుసు గనుక .. లోకేశ్‌కు ఏమివ్వాల్నా అని ఆలోచించాం. ఈక్రమంలో మా స్వగ్రామంలో శాలివాహన సామాజికవర్గీయులైన కుమ్మర్లు మా కుటుంబంతో మమేకమై ఉంటారు. మేం ఎవరికి ఏమివ్వాలన్నా.. మా ప్రాంతం తాలూకూ మట్టితో చేసిన కుండలో ఇచ్చేయాలనే ఉద్దేశంతో లోకేశ్‌కు ఇష్టమైన పప్పును వండి సిద్ధం చేశాము. దీన్ని ఎవరైనా సాహసం చేసి ఆయనకు మేమిస్తామని తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు. లేదంటే, తనకిష్టమైన పప్పు కోసం స్వయంగా లోకేశ్‌నే పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకుంటే మాకెటువంటి అభ్యంతరం లేదు గనుక ఈ పప్పు మట్టి కుండను ఇక్కడ్నే ఉంచుతాము. *పప్పులో ఉత్తరాంధ్ర ఉప్పూకారం కలిపాంః* లోకేశ్‌కు ఇచ్చే పప్పులో కాస్త ఉప్పూకారం కూడా కలిపాం. ఎందుకంటే, ఉత్తరాంధ్ర ప్రాంతమంటే ఆ తండ్రీకొడుకులకు చాలా చిన్నచూపు. ఇక్కడి ప్రజల మనోభావాల్ని అర్దం చేసుకోలేని వీళ్లు గతంలో ఎన్నడూ ఈ ప్రాంత అభివృద్ది గురించి ఆలోచన చేయలేదు. ఎన్నికలు దగ్గర పడేకొద్ది మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతంపై ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడుతున్నా రు. ఈ ప్రాంత ప్రజల సేవల పట్ల ఇన్నాళ్ళూ విశ్వాసం చూపని పార్టీ తెలుగుదేశం గనుక.. ఆ అబ్బాకొడుకులకు మేమిచ్చే పప్పుతోనైనా సిగ్గు, లజ్జ, పౌరుషం వస్తుందని ఉత్తరాంధ్ర ఉప్పూకారం కలిపాము. *లోకేష్ లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదుః* నేను వందల ఎకరాల్ని దోచేశానని, రూ.వందల కోట్లు దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నావు. నేనేమీ లోకేష్ లా బ్యాక్‌డోర్ పొలిటీషియన్‌ను కాదు. నా తండ్రి చనిపోయిన తర్వాత దాదాపు 18 సంవత్సరాల పాటు ఈ ప్రాంత ప్రజల సమస్యలతో పోరాడి.. మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి .. ప్రజల మన్ననల్ని సంపాదించి జగన్‌మోహన్‌రెడ్డి గారి దయ వలన శాసన సభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చొన్నాను. అదే తమరు ఎలా పదవుల్లోకొచ్చారు..? తమరు మంత్రి అయ్యాకనే ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్సీగా ఉంటూనే ఎమ్మెల్యేగా పోటీచేసి ఎన్నికల్లో ఓడిపోతారు. ఒక మాజీముఖ్యమంత్రి కొడుకుగా.. నీ రాజకీయ చరిత్ర ఇది. అదే నేను.. 45 సంవత్సరాలుగా విశాఖపట్టణం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కొడుకుగా శాసనసభ్యునిగా గెలుపొందాకనే మంత్రినయ్యాను. జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆశీర్వాదంతో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమల శాఖకు మంత్రినయ్యాను. అసలు, నీకు సిగ్గుందా..? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకువై ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి.. నువ్వొచ్చి మాలోంటోళ్ల గురించి మాట్లాడుతావా..? ఇదీ నీకూ-నాకూ ఉన్న తేడా అని గమనించుకో.. *పూరిపాక నుంచి ప్యాలెస్ వరకూ నీ తండ్రి స్కీమేంటి..?* నాకు ఊహ తెలిసినదగ్గర్నుంచీ మా స్వగ్రామం మిందిలో మా తాతగారు కట్టించిన ఇంట్లోనే నివాసం ఉంటున్నాను. మా తాత, మా నాన్న.. నేనూ ఆ ఇంట్లోనే ఉన్నాం. మా పూర్వీకుల దగ్గర్నుంచీ అదే గ్రామంలో ఉంటున్నాం. మరి, నువ్వెక్కడ పుట్టావు..? మీ నాన్న ఎక్కడ పుట్టాడు..? ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ..? పూరిగుడిసెలో పుట్టి పెరిగిన మీ నాన్న ఇప్పుడు నిన్ను తెచ్చి హైదరాబాద్‌లో ఒక రాయల్ ప్యాలెస్‌లో పెట్టాడు. మరి, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా వచ్చావో చెబితే.. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమంది పేదవారు మీ తండ్రి తాలూకా స్కీమ్‌ను ఫాలో అయి.. పాకల్లో ఉన్నవారంతా ప్యాలెస్‌ల్లోకి వెళ్తారు. మీ తండ్రీకొడుకులు చేసిన అక్రమాలు, అవినీతి సంపాదన.. మీ కిందఉన్న మచ్చలను మరిచి .. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర గలిగిన మాలాంటి కుటుంబాల గురించి .. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతావా..? అసలు నీకూ.. నీ తండ్రికున్న స్థాయేంటి..? *అనకాపల్లి అభివృద్ధిని గుర్తించని మాలోకం నువ్వు..ః* నువ్వూ.. నీ తండ్రి రకరకాల పేర్లతో ఏవేవో కార్యక్రమాల్ని పెట్టుకుని రోజూ మా ప్రభుత్వాన్ని.. మా నేత జగన్ గారిని తీవ్రమైన విమర్శలతో దూషించడమే గానీ.. ఏరోజైనా రాష్ట్రంలో జరిగిన.. జరుగుతోన్న అభివృద్ధిని కళ్లారా చూశారా..? పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుతోన్న ప్రభుత్వ సంక్షేమం గురించి తెలుసుకున్నారా..? కనీసం, నిన్న అనకాపల్లి నియోజకవర్గ కేడర్‌తో మాట్లాడేటప్పుడు.. ఇక్కడ మేము చేసిన అభివృద్ధి పనులనైనా అడిగి తెలుసుకున్నావా..? అత్యంత ప్రతిష్టాత్మకంగా అనకాపల్లి జిల్లాను ఏర్పాటు చేసి.. అనకాపల్లి పట్టణాన్ని హెడ్‌క్వార్టర్‌ను చేసి ఒక గుర్తింపును ఇచ్చిన సంగతిని నువ్వెందుకు ప్రస్తావించలేకపోయావు..? ఈ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీనీ గుర్తించలేకపోయావు..? నీ పక్కనున్న బంట్రోతుల్ని అడిగినా ఇక్కడ జరిగిన అభివృద్ధిని చెబుతారు కదా..? *420 గాళ్లకు సారా పట్టిస్తున్నావ్.. జాగ్రత్తః* నీ పక్కనున్న ఒక ఫోర్‌ట్వంటీ గాడు కూడా నా గురించి విమర్శించే నాయకుడయ్యాడా..? గతంలో నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే.. ఈ ఫోర్‌ట్వంటీ గాడిపై క్రిమినల్ కేసు బుక్ చేయించారని తెలుసా..? అలాంటి వెధవల్ని పక్కనబెట్టుకుని నామీద విమర్శలు చేయిస్తావా..? నేను పాలతో పెరిగితే.. వాడు సారా తాగి బతికాడని అనకాపల్లి, విశాఖ ప్రజల్ని ఎవర్ని కదిలించినా చెబుతారు. కనుక, అలాంటి వాళ్లతో నువ్వు కూడా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను. *విసన్నపేట భూముల్లో నాకు సెంటు ఉన్నట్లు రుజువు చేస్తావా..?ః* లోకేశ్ ఆరోపించినటువంటి విస్సన్నపేట భూముల్లో నా పేరిట ఒక సెంటు భూమి ఉన్నా.. నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్లిపోతాను. నీవు పనికిరానివాడివని, మీ నాన్న దత్తత తెచ్చుకున్న పవన్‌కళ్యాణ్ విస్సన్నపేట వెళ్లి ఒక రోజంతా తిరిగి ఆరాతీశాడు కదా.. ఆయనే నన్నేమీ పీకలేకపోయాడు. నువ్వూ .. నీ దగ్గరున్న ఆధారాలేమైనా చూపించి.. ఫలానా ప్రభుత్వ భూమిని అమర్నాథ్ ఆక్రమించాడని.. ఫలానా ఆస్తిని అక్రమంగా దోచేశానని చెప్పు.. చూద్దాం..? అక్కడున్న రైతులు మా భూముల్ని మేము అమ్ముకుంటుంటే.. వీళ్లొచ్చి ఎందుకు రాజకీయం చేస్తున్నారంటూ గొడవ పెడుతుంటే.. వారి గురించి మాట్లాడటం వదిలేసి మామీద బురద జల్లేస్తే .. ఏదో అనకాపల్లి వచ్చామని అమర్నాథ్ గురించి నాలుగు విమర్శలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే.. అది నీ అమాయకత్వం. *గంజయి డాన్‌లు, వీరప్పన్‌లు టీడీపీవారేః* గంజాయి డాన్‌లు, వీరప్పన్‌లను పక్కనే పెట్టుకుని విశాఖ, అనకాపల్లి గంజాయి స్థావరాలని మాట్లాడుతావా..? ఇదే గంటా శ్రీనివాసరావు మీ ప్రభుత్వహయాంలో ఉన్నప్పుడే మంత్రిగా ఈ ప్రాంతంలో గంజాయి సాగు గురించి ఏమన్నారో అడిగి తెలుసుకో.. నువ్వు అద్దంలో చూసుకుంటే నీ తండ్రే కనిపిస్తాడనేది నిజం. ఎందుకంటే, ఆయనకన్నా అబద్దాలు కన్నార్పకుండా చెప్పడంలో అంతగా మించిపోయావు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి నీ తండ్రి ఏనాడైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పోర్టును నిర్మిద్దామనే ఆలోచన చేశాడా..? మరి, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట ప్రాంతంలో ఒక పోర్టును శంకుస్థాపన చేయించి పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. మీరొస్తే రండి.. మేం దగ్గరుండి ఆ పోర్టు పనులు చూయిస్తాం. అదేవిధంగా ప్రతిష్టాత్మక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయించింది నేను. ఇప్పుడక్కడ రన్‌వే పనులు, టెర్మినల్ భవనాల నిర్మాణాలు వేగవంతంగా జరుగతున్నాయి. 2025 డిసెంబర్‌కు మొదటి ఫ్లైట్‌ను తీసుకొచ్చి అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాము. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపటం దగ్గర్నుంచి మెడికల్ కాలేజీ, ట్రైబల్ యూనివర్శిటీ, అదానీ డేటాసెంటర్, ఇన్ఫోసిస్, యెకోహోమా టైర్ కంపెనీలు, బల్క్‌డ్రగ్ పార్కు, ఎన్టీపీసీకి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు గానీ నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీసుకురాగలిగాం. నీకు, నీ తండ్రికి, మీ దత్తపుత్రుడికి దమ్మూధైర్యం ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై చర్చకొస్తే రండి.. *స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగవకాశమివ్వాలని చట్టం తెచ్చాంః* స్థానికంగా ఉండే యువతకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఒక చట్టం తేవాలనే ఆలోచన నీకు గానీ.. నీ తండ్రికి గానీ.. నీ ప్రభుత్వానికి వచ్చిందా..? అదే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరు ఏ పరిశ్రమ పెట్టినా.. స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగ అవకాశాలివ్వాలని చట్టం చేసిన ప్రభుత్వం మాది. అలాంటిది, నువ్వు మంత్రిగా ఉండి సంతకాలు చేస్తేనే యువతకు ఉద్యోగాలొచ్చాయని చెప్పుకుంటున్నావంటే నీకు బుర్ర, బుద్ధి పనిచేయడం లేదని చెప్పాలి. అందుకే, నీ పేరు పప్పు అని పెట్టారు. *కుటుంబాలు, బాంధవ్యాలపై మీరు మాట్లాడుతారా..? సిగ్గుండాలిః* నువ్వు.. నీ స్థాయికి జగన్‌మోహన్‌రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడుతావా..? నువ్వెంత..? నీ బతుకెంత..? నీ తండ్రి ఏనాడైనా మీ కుటుంబ సభ్యుల్ని గౌరవించుకున్న దాఖలా ఉందా..? నీ తాతను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అని అంతా చెబుతారు. నీ బాబాయి రామ్మూర్తినాయుడు పరిస్థితి ఇప్పుడేంటి..? ఏనాడైనా తమ్ముడిగా చూశాడా మీ నాన్న.? పురందేశ్వరి మీ నాన్నకు వదిన కదా.. మీ పార్టీలో ఆమెకు ఎలాంటి గౌరవం కల్పించారు. నిజానికి, ఆమెకు రాజకీయంగా అరుదైన గుర్తింపునిచ్చి కేంద్రమంత్రి పదవి వరకు తీసుకెళ్లిన నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు. మరి, మీరు కుటుంబాల గురించి.. కుటుంబ బాంధవ్యాల గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి కదా..? *విశాఖకు ఐటీ రాదన్నారుగా.. 250 ఐటీ కంపెనీలొచ్చాయి చూడండి..ః* నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం రూ.900 కోట్లు మాత్రమే. అదే మేం అధికారంలోకొచ్చాక ఈరోజుకు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.2500 కోట్లు ఐటీ ఎగుమతులు చేస్తున్నాము. అంటే, మీరు బాగా చేసినట్టా.. మేము బాగా పనిచేసినట్లా..? ఒకప్పుడు 2017లో ఈ లోకేశ్ ఇదే విశాఖలో ఏమన్నాడు..? ఇక్కడికి ఐటీ కంపెనీలు రావు.. అవి రావడానికి సరిపడా ఇక్కడ ఎన్విరాన్‌మెంట్ లేదని చెప్పాడు కదా..? మరి, ఇప్పుడు 250 ఐటీ కంపెనీలు ఒక్క విశాఖపట్నంలోనే పనిచేస్తోన్నాయి. ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ కంపెనీని విశాఖకు తెచ్చిన చరిత్ర మా ప్రభుత్వానిది. రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80 వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కనుక, ఇప్పటికైనా వాస్తవాల్ని గుర్తుచేసుకుని .. నోరు మడతపెట్టకుండా.. జాగ్రత్తగా అదుపు చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. లేదంటే, మీ మాయమాటలు, అబద్దాల్ని ఉత్తరాంధ్ర ప్రజలు.. మరీ విశాఖపట్టణం వాసులెవరూ నమ్మరు గాక నమ్మరు. మీలాంటి తెలుగు పలకలేని సుద్ద పప్పుగాళ్లకు సరైన సమాధానమిస్తారని హెచ్చరిస్తున్నాను.