జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

  శ్రీ‌కాకుళం జిల్లా అధికారులకు మంత్రి ధర్మాన పిలుపు

శ్రీకాకుళం  :  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అందిస్తున్న సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లా అధికారులకు పిలుపు నిచ్చారు.  స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రగతిపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న అధికారులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు చేపట్టవలసిన అంశాలపై అధికారులు మరింత దృష్టి సారించాలన్నారు. ఇందుకు ప్రభుత్వపరంగా కావలసిన పరిపాలన అనుమతులు, నిధుల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. 

అందరం కలిసి కట్టుగా పనిచేసి జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనేదే తమ ధ్యేయమని, అంతేగాని శాఖల పనితీరును ప్రశ్నించడం తమ ఉద్దేశ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత శాఖల పనితీరు తెలుసుకోవాలని సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.తొలుత వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష పథకం సంబంధించి సమీక్షా ప్రారంభించిన మంత్రి
బాధ్యతలు తీసుకొన్న ప్రతి అధికారి పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించినపుడే లక్ష్యాలను అధిగమించగల మని మంత్రి తెలిపారు.విధుల నిర్వహణలో ప్రణాళికలు రూపొందించుకొని లక్ష్యాలు అధిగమించే దిశగా అడుగులు వేయాలని కోరారు. శాశ్వత భూహక్కు- భూరక్ష క్రింద జిల్లాలో 1466 గ్రామాలు ఉండగా వీటిని 2023 డిసెంబర్ నాటికి భూసర్వే పూర్తికావాలని అన్నారు. గ్రామ స్థాయిలో సభలు నిర్వహించి సర్వే వేగవంతం చేయాలన్నారు. మ్యాపులు సర్వే అయిన తదుపరి రెవెన్యూ శాఖ వాటిని సరిచూసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

2023 డిసెంబర్ నెలాఖరు నాటికి శత శాతం భూ సర్వే పూర్తవుతుందని కలెక్టర్ మంత్రికి వివరించారు.జిల్లాలో నీటి పన్ను వసూలుకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు పథకంలో ఇళ్ళ స్థలాలను కేటాయించడం జరుగుతుందని, ఇంకా అర్హులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే 90రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లాకు 17 తహశీల్దార్ కార్యాలయ భవనాలు మంజూరు అయ్యాయని అందులో 13 భవనాలు పూర్తి అయ్యాయని, వాటికి సంబంధించి చెల్లింపులు చేయాల్సి ఉందని అన్నారు.  జిల్లాలో 355 రైస్ మిల్లులు ఉన్నాయని,ప్రతి నెల మొదటి తేదీన సంచార వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని జె.సి మంత్రికి వివరించారు.

 ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వలన ప్రతీ రైతు భరోసా కేంద్రాన్ని ధాన్యం కొనుగోలు  కేంద్రంగా మార్పుచేయడం ద్వారా రైతులకు మేలు జరిగిందని అన్నారు. రైతు దగ్గరకి టెక్నికల్ సిబ్బంది వెళ్లి ధాన్యంలో తేమ శాతం నిర్ధారించి కొనుగోలు జరిగిందన్నారు. కొన్నిచోట్ల ధాన్యం కొనుగోలు జరగలేదనే విమర్శలు వస్తున్నాయని, అవికూడా లేకుండా చూడలని మంత్రి ఆదేశించారు. సోనా మసూరి వలన ఈ సమస్య తలెత్తుతుందని విత్తనాలు అందుబాటులో లేకుండా చర్యలు చేపటితే బాగుంటుందని జాయింట్ కలెక్టర్ కోరారు. ముఖ్య మంత్రి  అదేశాలను అనుసరించి  రైతు భరోసా కేంద్రాలలో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పరికరాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేయగా. వరి సాగు నిలుపుదల చేసి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి వివరించారు.

ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల పనితీరుపై ఆరా తీసిన మంత్రి సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించి పూర్తిచేయాలన్నారు. అనంతరం మత్స్య శాఖను సమీక్షించిన మంత్రి  జిల్లాలో  11తీర ప్రాంత మండలాలు, 193 కి.మీ తీర ప్రాంతం,104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

వంశధార పనులకు చెందిన నిధులు విడుదల అవుతున్నా యని సంబంధిత పనులు వేగవంతం చేయడం జరుగుతుందని మంత్రికి ఎస్.ఈకి వివరించగా, ప్రణాళికలు రూపొందించుకొని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ పూర్తికావాలని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్  కొనసాగుతుందని, పొందని వాటిపై నిత్యం పర్యవేక్షిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మంత్రికి వివరించారు. తెలిపారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై ఆరా తీసిన మంత్రి గృహ పనులు మరింత వేగవంతం కావాలని అన్నారు.  జలజీవన్ మిషన్ , పంచాయతీ రాజ్, జిల్లా పరిషత్, ఆర్ అండ్ బి, తదితర శాఖలకు సంబంధించి శాఖల వారిగా చేపడుతున్న పనులపై సమీక్షించారు.జిల్లా పరిషత్ చేపడుతున్న పనులపై ఆరా తీయగా జిల్లాలో మండల పరిషత్ భవనాలు లేవని మంజూరు చేయమని సి.ఈ.ఓ మంత్రిని కోరారు. ఎచ్చెర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్,
కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ ఆంధవరపు సూరి బాబు, పలాస శ్రీకాకుళం ఆర్.డి.ఓలు జయరామ్, బి.శాంతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణాధికారి బి.లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజినీర్ కాంతిమతి, ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజినీర్ డోల తిరుమల రావు. వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Back to Top