చంద్ర‌బాబు అండ్‌కోది త‌ప్పుడు ప్ర‌చారం

ఎల్లోమీడియా క‌థ‌నాల‌ను ఖండించిన మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీకాకుళం: తాను చెప్పిన విషయాన్ని వక్రీకరించి చంద్రబాబు అండ్ కో తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. గతంలో కడపకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చి కళింగ వైశ్యుల భూముల వ్యవహారంలో సెటిల్మెంట్ చేస్తుంటే 'నువ్వొచ్చి చేయడమేమిటని, ఇక్కడి నుంచి పొమ్మని చెప్పానుస అని, అదే విషయాన్ని కళింగ వైశ్యుల ఆత్మీయ సమావేశంలో చెప్పానని తెలిపారు. కళింగ వైశ్యులకు తాను అండగా ఉన్నానన్న విషయాన్ని గుర్తు చేశానన్నారు. దీనిని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రతిదీ రాజకీయం చేయడం తప్ప అంతకుమించి టీడీపీ నేతలు సాధించిందేమీ లేదన్నారు. అసలు సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, అప్పట్లో గట్టిగా చెప్పి పంపించేశానని అన్నారు. జిల్లాకు తాను ఎంత మేలు చేశానో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. జిల్లాలో ఎక్కడ చూసినా తన మార్కు అభివృద్ధి ఉంటుందన్నారు. ఈ జిల్లాకు మేలు జరిగింది ఒక్క వైయ‌స్ఆర్‌ ఫ్యామిలీతోనే అని ధర్మాన స్పష్టం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, అంబేడ్కర్ యూనివర్సిటీ, రిమ్స్ మెడికల్ కళాశాల తదితర కీలక ప్రాజెక్టులు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి చలవేనన్నారు. ఆ తర్వాత సీఎం వైయ‌స్ జగన్ హయాంలో జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, మూల పేట పోర్టు, వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మహేంద్రతనయ ప్రాజెక్టు పనులు ఊపందుకోవడం, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ తదితర అభివృద్ధి పనులెన్నో జరిగాయన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసి జిల్లాకు ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి చేయలేదని విమర్శించారు. చేతనైతే జిల్లాలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు సవాల్ విసిరారు.

Back to Top