శ్రీకాకుళం: స్థానిక సంస్థల కోటాలో త్వరలో శాసన మండలికి వెళ్లనున్న నర్తు రామారావును రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అభినందించి, ఆత్మీయ సత్కారం అందించారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.."రామారావు చాలా కాలం నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. 3 దశాబ్దాలుగా ఉన్నారు. యాదవ కులానికి చెందిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. గతంలో వైయస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం చట్ట సభల్లో వెనుకబడిన వర్గాల వారు సమస్యలు వినిపించుకునేందుకు అవకాశం ఇస్తానని అన్నారు. ఆ రోజు వైయస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ ఆయన ఎంపిక ఖరారు అయింది.
జిల్లాలో ఉన్న యాదవులంతా హృదయపూర్వకంగా వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంది. రాష్ట్రంలో జనాభాకు తగ్గట్టుగా వారి వారి రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా వారందరికీ నేడు అవకాశాలు ఇస్తున్నారు. 75 ఏళ్లుగా ఈ విధంగా ఎన్నడూ జరగలేదు. రాజకీయ అధికారం కోసం ఆరాట పడుతున్న సామాజిక వర్గాలకు తగు ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ కులానికి చెందిన సమస్యలు చెప్పాలన్న ఆవేదనతో ఉన్నవారికి ఇవాళ సంబంధిత వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారి కల ఫలించింది. ఆ విధంగా ఎన్నో ఏళ్ల కల ఫలించింది. అట్టడుగు వర్గాలు రాజకీయ అధికారం దక్కేందుకు వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం ద్వారా మార్గం సుగమం అయింది. తమకు తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఆవేదన వారిలో ఉంది. అదేవిధంగా ఎన్నో అవమానాలకు గురయిన సామాజిక వర్గాలు ఇప్పుడు చట్ట సభల్లో మాట్లాడే అవకాశం దక్కింది. ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టం. ఎవరి అభివృద్ధి రాజకీయాధికారంతో ముడిపడి ఉంటుందో సంబంధిత పథకాలు కానీ చట్టాల అమలు కానీ మంచి ఫలితాలు ఇవ్వవు అని భావిస్తూ ఉన్నాను. చాలా వరకూ అట్టడుగు వర్గాలు ఎన్నికల అనంతరం నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయి. బోయ, యాదవ, అగ్ని కుల క్షత్రియ, అలానే వాడ బలిజ, వడ్డెర, శెట్టి బలిజ ఇటువంటి కమ్యూనిటీలు ఒకప్పుడు నిర్ల్యక్షానికి గురి అయ్యాయి. కానీ ఇప్పుడు వైయస్ జగన్ నిర్ణయం కారణంగా అటువంటి పరిస్ధితులు లేవు. రామారావు సమర్థంగా పనిచేసి మంచి పేరు తీసుకు రావాలని భావిస్తున్నారు. ఈ నెల 22 వ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఆయన నామినేషన్ వేసేందుకు చేపట్టే ప్రక్రియకు అంతా తరలి రావాలని కోరుతున్నాను. ఇదే సందర్భంలో యాదవుల తరఫున, జిల్లా ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాను. అని పేర్కొన్నారు.
అనంతరం నర్తు రామారావు మాట్లాడుతూ.. నా నాయకత్వానికి తగిన గుర్తింపు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆ రోజు వైయస్ నాకొక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన తనయుడు అవకాశం ఇచ్చారు. యాదవులను ఏకతాటిపై తెచ్చేందుకు కృషి చేస్తాను. వైయస్ఆర్ సీపీ బలోపేతానికి పనిచేసి మళ్లీ సీఎం వైయస్ జగన్ అయ్యే విధంగా పనిచేస్తాను అని అన్నారు.