వలంటీర్ల వ్యవస్థపై రామోజీరావు విషపు రాతలు

వలంటీర్లు అధికారులు కాదు..  సేవకులు మాత్రమే

చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల దోపిడీ రామోజీకి క‌నిపించ‌లేదా..?

ప్రతి పథకానికి ఒక రేటు. జన్మభూమి కమిటీల అవినీతి

నిస్వార్థ సేవకులైన వలంటీర్లపై ఎందుకంత అక్కసు?

చంద్రబాబును జాకీలతో ఎత్తేందుకు రామోజీరావు ప్రయత్నం

అందుకే ప్రతిరోజూ ఎల్లో మీడియాలో విషపు రాతలు

ఎల్లో మీడియా ఎన్ని ప్రయత్నాలు చేసినా బాబు ఆశ నెరవేరదు

సమాచార, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం: నిస్వార్థ సేవకులైన గ్రామ, వార్డు వలంటీర్లపై ఈనాడు రామోజీరావు విషపు రాతలు రాస్తున్నారని సమాచార, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిప‌డ్డారు. వలంటీర్లు అంత నిస్వార్థంగా పని చేస్తుంటే, రామోజీరావుకు ఎందుకంత అక్కసు? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల దోపిడీ రామోజీ కళ్లకు కనిపించలేదా అని నిల‌దీశారు.  పింఛన్లు, ఇళ్ల మంజూరు హక్కును జన్మభూమి కమిటీలకు ఇచ్చారని, ఆ మేరకు జీవోలు కూడా జారీ చేశారని గుర్తుచేశారు. రాజమహేంద్రవరంలో మంత్రి వేణుగోపాల‌కృష్ణ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి వేణుగోపాల‌కృష్ణ ఏం మాట్లాడారంటే.. 

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న క్రియల పట్ల పౌర సమాజం ఆలోచించాల్సిన పరిస్థితి. ఆనాడు ఎన్టీ రామారావు చనిపోయారా? చనిపోయేలా చేశారా? చంపేశారా? అన్నది అప్పుడు చూసిన వారందరికీ తెలుసు. ఎన్టీఆర్‌ మరణం. అందుకు కారణం ఏమిటి అనేది ఆనాడు రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం అని నినాదాలు ఇచ్చిన ఎన్టీ రామారావును ఒక ఆత్మగా మార్చారు.

రామోజీ ఎజెండా ఒక్కటే
ఆనాటి ఎన్టీ రామారావుకు వెన్నుపోటులో కర్త, కర్మ, క్రియ అయిన రామోజీరావు, ఈ మధ్యే 40 ఏళ్ళ తెలుగుదేశం అంటూ ఎన్టీఆరే రాముడు, ఎన్టీఆరే కృష్ణుడు అంటూ.. పత్రికలో రాసిన రాతలను చూస్తే.. ఆనాడు ఈనాడును చదివిన ప్రతి ఒక్కరూ, అసలు వీళ్ళు మనుషులేనా అని అనుకుంటారు. రామోజీరావు దృష్టిలో టీడీపీ అన్నది ప్రజల కోసం పుట్టిన పార్టీ కాదు. తన కోసం పుట్టిన పార్టీ. కాబట్టే, తన కోసం ఎన్టీఆర్‌ పని చేయకపోతే, ఎన్టీఆర్‌ను తప్పించాడు. రేపు చంద్రబాబు తన కోసం పని చేయకపోతే, చంద్రబాబును తప్పించి ఏ  పయ్యావుల కేశవ్‌కో టీడీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టగల సమర్థుడు రామోజీ. అందుకు అనుగుణంగా రామోజీరావు తన పత్రికలో రాతలు రాస్తారు. రామోజీరావు ఎజెండా ఒక్కటే కనిపించింది. ప్రతి రాత ఆయనకు అనుకూలంగా ఉండాలి.

వలంటీర్లపై ఎందుకంత అక్కసు?
ఈనాడులో ఇవాళ రామోజీరావు, గ్రామ వలంటీర్ల మీద విషం చిమ్ముతూ కధనం రాశారు. వలంటీర్లు అంత నిస్వార్థంగా పని చేస్తుంటే, రామోజీరావుకు ఎందుకంత అక్కసు? ఆనాడు చంద్రబాబు తన పాలనలో గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తే, రామోజీరావు ఎందుకు పట్టించుకోలేదు?. ఆయనకు నిజంగా సమాజం మీద ప్రేమ ఉంటే, జన్మభూమి కమిటీలు ఏ స్థాయిలో అవినీతి, అక్రమాలు చేశాయన్నది ఎందుకు రాయలేదు?. 

అవి మీకు తప్పనిపించలేదా?
పెన్షన్లకు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2017, సెప్టెంబరు 17న జీఓ. నెం:135 జారీ చేస్తే, రామోజీ మీకది కనిపించలేదా? అది తప్పనిపించలేదా?. అదే విధంగా జీఓ నెం:36. ఆ జీఓను 2017, మే, 10న జారీ చేశారు. గృహాల పథకంలో లబ్ధిదారులను కూడా జన్మభూమి కమిటీలకు ఇస్తూ ఆ జీఓ జారీ చేశారు. అంటే ఇల్లు, పెన్షన్‌ ఏది కావాలన్నా, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిందే. కానీ అవేవీ రామోజీరావుకు తప్పుగా కనిపించలేదు. అదీకాక, జన్మభూమి కమిటీల మీద ఆరోజుల్లో మేము కోర్టుకు వెళ్ళినప్పుడు– న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆరోజు జన్మభూమి కమిటీలను సమర్థిస్తూ.. అధికార పార్టీయే ప్రభుత్వం – ప్రభుత్వమే అధికార పార్టీ.. అంటూ, ఆ రెండింటికీ తేడా లేదని న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 

వలంటీర్లు నిస్వార్థ సేవకులు.. 
అదే ఇవాళ వలంటీర్లు సేవకులు మాత్రమే. వారెవ్వరూ లబ్ధిదారులను ఎంపిక చేయరు. కేవలం తమ పరిధిలో ఉన్న ఇళ్ల వారి అవసరాలు తీర్చడంలో, ప్రభుత్వం యంత్రాంగానికి మధ్య వారధిలా పని చేస్తారు. పెన్షన్, ఇంటి స్థలంతో పాటు, ఏది కావాలన్నా, ఏ పథకం కావాలన్నా వారికి అర్హత ఉందా? లేదా? అని మాత్రమే చూస్తారు. అవి వారికి అందేలా సహకారం అందిస్తారు. వారికి గైడ్‌ చేస్తారు. ఇందులో ఎక్కడా అవినీతి, పక్షపాతం చూపరు. ఎక్కడా లంచానికి తావు లేదు. వలంటీర్లు నిస్వార్థంగా సేవలందిస్తున్నారు. వారు ప్రభుత్వం మీద మమకారంతో పని చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము ఏనాడూ దాచుకోలేదు. ప్రభుత్వ పథకాలు డెలివరీ చేయడానికి వైయ‌స్ జగన్‌ అభిమానులు కాకపోతే, చంద్రబాబు అభిమానులు వస్తారా? ఈ విషయాన్ని ఇకనైనా గుర్తించండి రామోజీ. తమకు ప్రతి ప్రభుత్వ పథకం ఇంటి గడప వద్దనే అందుతోందని సామాన్యులు గొప్పగా భావిస్తున్నారు. అందుకు కారకులు వలంటీర్లు. ఇది వాస్తవం కాదా? నిజం చెప్పాలంటే వలంటీర్లు నిరుపేదల పాలిట దేవుళ్ల మాదిరిగా ఉన్నారు.

డోర్‌ డెలివరీపై ఏనాడైనా రాశారా?
ప్రతి నెలా కచ్చితంగా ఒకటో తేదీన ఆదివారం అయినా, మరో సెలవు రోజైనా సరే, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్‌ చేతిలో పెడుతున్నారు. అంత గొప్ప కార్యక్రమం గురించి ఒక్కనాడైనా రాశారా? మీరు రాయరు. ఎందుకంటే, మీకు కావాల్సిన వ్యక్తి సీఎం పదవిలో లేరు. ఎన్టీ రామారావును ఆత్మగా మార్చిన రాతలు రాసిన ఈనాడు, ఇటీవల అదే ఎన్టీఆర్‌ను రాముడు, కృష్ణుడు అని రాయడం వింతగా ఉంది. వలంటీర్లు అధికారులు కారు. సమాజం పట్ల బాధ్యతతో, నిస్వార్థంగా పని చేసే సేవకులు మాత్రమే. అంతేకానీ, జన్మభూమి కమిటీల మాదిరిగా పచ్చి అవినీతికి పాల్పడే వారు కారు. కాబట్టి, వలంటీర్లు ఎలా ఉండాలో తెలుగుదేశం పార్టీ వలంటీర్లు అయిన రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు చెప్పటం మానేస్తే మర్యాదగా ఉంటుంది. 

ఆనాడు మీకేమీ కనిపించలేదా?
చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు ప్రతి పథకానికి ఇంత రేటు అని వసూలు చేశాయి. గ్రామ సభలు లేవు. అంతా జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం. వారు అంతులేని అవినీతికి పాల్పడ్డారు. అలా చంద్రబాబు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు దోపిడి వ్యవస్థకు కేరాఫ్‌గా మారాయి. యుక్త వయసులో ఉన్న యువతి భర్త చనిపోతే, ఆమె పెన్షన్‌ కోసం వెళ్తే, ఎలా వ్యవహరించారనేది అందరికీ తెలుసు. ఆ జన్మభూమి కమిటీలు మీకు ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి కమ్మగా కనిపించాయి. కానీ వలంటీర్ల వ్యవస్థ అలాంటిది కాదు. వారికి ఏ పథకంలోనూ లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం లేదు.

వాటినీ రీ ప్రింట్‌ చేయండి
ఆనాడు తమ పత్రికలో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా రాసిన వార్తలు, ఎడిటోరియల్స్‌ను కూడా రామోజీరావు ఇవాళ చూడాలి. వాటిని ప్రజలకు కూడా చూపాలి. అందుకే వాటిని రీప్రింట్‌ చేయాలని కోరుతున్నాం. నిస్వార్థంగా సేవలందిస్తున్న వలంటీర్లలో విషం నింపే ప్రయత్నం రామోజీరావు చేస్తున్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకొండి.

ఆయన ఇంకా దిగజారుతున్నారు
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైయస్‌ జగన్‌ వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాన్ని దేశం యావత్తూ ప్రశంసిస్తోంది. కానీ నీకు మాత్రం అవేవీ కనిపించవు. కేవలం చంద్రబాబును జాకీలతో ఎత్తే ప్రయత్నంలో రామోజీ.. మీరు చేస్తున్న ప్రతి పని ఆయనను మరింత దిగజారుస్తోంది. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. అందుకే గడప గడపకూ కార్యక్రమంలో ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. 

మీ ఆత్మ గౌరవం ఏమైంది?
ఆనాడు ఎన్టీ రామారావును మోసం చేశారు. చంద్రబాబు కోసం రామారావును పదవి నుంచి దింపేలా అనైతికంగా వార్తలు రాశారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీ రామారావు పార్టీ ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు వెళ్లి అదే కాంగ్రెస్‌తో జత కట్టాడు. ఇక్కడ నీ ఆత్మ గౌరవం ఏమైంది? అందుకే మీరు ఎన్ని విషపు రాతలు రాసినా, ఎంత దుష్ప్రచారం చేసినా, చంద్రబాబును పెంచాలని చేసే ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు.

Back to Top