రాజ‌ధానిని కామ‌ధేనువులా వాడుకున్నాడు

- మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

ఎంఓయూకు స్విస్ ఛాలెంజ్‌కు తేడా లేకుండా చేశారు. రాజ‌ధానిని ఒక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారు. అమ‌రావ‌తిని కామ‌ధేనువుగా మార్చ‌కున్నారు. అమాయ‌కుల్ని బెదిరించి భూములు దోచుకున్నారు. జూన్ 1, 2014 నుంచి డిసెంబ‌ర్ 30, 2014 లోపు ఆరు నెల‌ల్లో చ‌ట్ట వ్య‌తిరేకంగా దోపిడీకి పాల్ప‌డ్డారు. ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకున్నారు. చంద్ర‌బాబు చెప్పే మాట‌ల‌న్నీ హ‌స్యోక్తులే. అమ‌రావ‌తిలో రాజ‌ధాని క‌ట్టి 13 జిల్లాల్లో ఆదాయ వ‌న‌రులు ఎలా పెంచుతారో ఆయ‌న‌కే తెలియాలి. ఎక్క‌డైనా ప్ర‌పంచం న‌లుమూల‌ల ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌భుత్వ భూములు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాన్ని భౌగోళికంగా అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని రాజ‌ధాని నిర్మాణానికి అనుకూలంగా మార్చుకుంటారు. కానీ చంద్ర‌బాబు మాత్రం అందుకు విరుద్ధంగా చేస్తారు. ప్రైవేటు కంపెనీలు ప్ర‌భుత్వం చుట్టూ తిర‌గాల్సిందిపోయి.. చంద్ర‌బాబు ప్ర‌బుత్వం మాత్రం అసెండ‌స్‌, సెమ్‌కార్ప్ అనే ప్రైవేటు కంపెనీల చుట్టూ తిరిగింది. అది కూడా ప్లాట్లు వేయ‌డానికి ఒకే ఒక్క ఐకానిక్ బిల్డింగు క‌ట్ట‌డానికి. భార‌త‌దేశంలో ఏం కంపెనీ రాకుండా ఏపీఐడీఏ చ‌ట్టం తీసుకొచ్చారు. తీరా స్విస్ చాలెంజ్లో లొసుగులు తీస్తే సింగ‌పూర్ కంపెనీ ఖ‌ర్చు చేసేది రూ. 300 కోట్లు కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాటాగా ఎక‌రా నాలుగు కోట్ల విలువున్న 1691 ఎక‌రాలు ఇవ్వ‌డంతోపాటు రోడ్లు మ‌రమ్మ‌తుల‌కు గ్యాస్‌, కంక‌ర‌, ఇసుక ఫ్రీగా ఇచ్చి రూ.5500 కోట్లు ఇస్తారు. అంతా చూసుకుంటే ఏపీ ప్ర‌భుత్వ వాటా ఇంచుమించుగా 14వేల కోట్లు ఉంది. కానీ సింగ‌పూర్ కంపెనీకి 52 శాతం వాటా ఇచ్చి... ఏపీ ప్ర‌భుత్వానికి కేవ‌లం 48 శాతం వాటా తీసుకున్నారు. ఎందుకు ఇదంతా చేశారంటే.. సింగ‌పూర్ కంపెనీలొస్తే వీళ్ల భూముల‌కు ధ‌ర‌లు పెరుగుతాయ‌ని వీరి అంచ‌నా. ఇదికాక ప్లాట్లు అమ్మినా సింగ‌పూర్ కంపెనీల‌కు క‌మీష‌న్ ఇచ్చేలా స్విస్ చాలెంజ్‌కు చంద్ర‌బాబు ఒప్పుకున్నారు.
అన్ని ఖ‌ర్చులు, ఆస్తులు మ‌నం భ‌రించి వారికి ఎక్కువ వాటా ఎందుకిచ్చారో ఆలోచిస్తే ఇందులో చంద్ర‌బాబు స్వార్థం ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది.

చంద్ర‌బాబు హైద‌రాబాద్‌ను క‌ట్టాన‌ని డ‌ప్పేసుకుంటున్నాడు. నిజానికి ఆయ‌న క‌ట్టింది ఒకే ఒక్క బిల్డింగ్‌. అభివృద్ధి క్ర‌మంలో వ‌చ్చిన కంపెనీల‌ను త‌న వ‌ల్ల‌నే వ‌చ్చింద‌ని చెప్పుకోవ‌డం బాబుకు అల‌వాటు. ఐటీ ఎగుమ‌తులు చూసుకుంటే బెంగ‌ళూరు 45%,  చెన్నై 14, హైద‌రాబాద్ కేవ‌లం 10%తో ఉంది. ఎన్నో గొప్ప ల‌క్ష‌ణాలు, నైపుణ్యం మ‌న తెలుగువారికి ఉండీ వెన‌క‌బ‌డి ఉండ‌టానికి కార‌ణం చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉండ‌టం. హైద‌రాబాద్లో కూడా చంద్ర‌బాబు క‌ట్టింది సైబ‌ర్ స్పేస్ కాదు.. రియ‌ల్ ఎస్టేట్ వారికి భూములు కేటాయించాడు. చంద్ర‌బాబు దిగిపోయేనాటికి హైద‌రాబాద్ ఐటీ ఎగుమ‌తుల్లో 5వ స్థానానికి ప‌డిపోయింది. ఎయిర్‌పోర్టు ప్రారంభ‌మైంది 2004.. పూర్త‌యింది 2007 అంటే.. క‌ట్టింది దివంగత మ‌హానేత వైఎస్సార్‌. ఔట‌ర్ రింగ్ రోడ్డు, పీవీ న‌ర‌సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే అన్నీ జ‌రిగింది వైఎస్సార్ హ‌యాంలోనే. ఐదేళ్ల‌లో క‌న‌క‌దుర్గ ఫ్లై ఓవ‌ర్ క‌ట్ట‌లేక‌పోయాడు. శ్రీకాకుళంలో వంశ‌ధార‌, తోట‌కుల ప్రాజెక్టు క‌ట్టింది వైఎస్సారే. రాజ‌ధానికి ల‌క్షా ప‌దివేల కోట్లు కావాల‌ని చెప్పి.. 50 వేల కోట్ల‌కు టెండ‌ర్లు పిలిచి 5 వేల కోట్లు ఖ‌ర్చు చేశాడు. ఆ డ‌బ్బును కూడా బ్యాంకులు, అమ‌రావ‌తి బాండ్ల ద్వారా తీసుకొచ్చాడు. భ‌యం లేకుండా అప్పులు తెచ్చి పండ‌గ చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే. భావిత‌రాల‌పై అప్పులు ఎలా మోపుతున్నామ‌న్న బాధేలేదు. అప్పులు ఎలా తీరుస్తారంటే ప్ర‌తి ఏడాది భూములు అమ్మ‌కానికి పెడ‌తాడంట‌. 51 వేల కోట్ల ప‌నుల‌కు తెచ్చేది మొత్తం అప్పే. గోదావ‌రి, కృష్ణ‌, పెన్నా న‌దులు అనుసంధానం చేసి ఉత్త‌రాంధ్ర‌, ప్ర‌కాశం, క‌డ‌ప జిల్లాల‌ను క‌రువు నుంచి కాపాడాలంటే క‌నీసం 50 వేల కోట్లు కావాలి. బాధ్య‌త‌లు వ‌దిలి చంద్ర‌బాబు మాహిష్మ‌తి అని ప‌రుగులు పెట్టాడు. ఒక్క కిలోమీట‌ర్ రోడ్డు వేయ‌డానికి 46 కోట్లు ఖ‌ర్చు చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. ఎవ‌రూ విన‌ర‌ని అనుకుంటాడేమోన‌ని చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలే. హైద‌రాబాద్‌, ముంబైల‌తో పోల్చితే అమ‌రావ‌తిలో నిర్మాణ వ్య‌యం త‌క్కువ‌ని చెప్ప‌డంలోనే ఆయ‌న నాలెడ్జ్ తెలుస్తుంది. వైఎస్సార్ ఆహ్వానం మేర‌కు 2005 నుంచి కొరియ‌న్ కంపెనీలు దేశంలో ప్లాంట్ పెట్టాల‌ని ప్లాన్ చేశాయి. కానీ చంద్ర‌బాబు మాత్రం కియాను నేనే తీసుకొచ్చాన‌ని చెప్పుకుంటాడు. ఎవ‌రో రాసిచ్చిన పేప‌ర్లు చ‌ద‌వ‌డంలో తొంద‌ర త‌ప్పితే ఆలోచ‌న చేయాల‌న్న ఆలోచ‌న బాబుకు లేదు.

 

Back to Top