టీడీపీ హయాంలోనే ఏపీ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం

ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి
 
ఎఫ్ఆర్‌బీఎం నిబంధనల ప్రకారమే బడ్జెట్ అమలు...

కరోనా సంవత్సరమైన 2020-21ని పదే పదే సాధారణ సంవత్సరాలతో పోలుస్తారా ?  

.బడ్జెట్ కేటాయింపులకూ, ఖర్చులకూ పొంతన లేదనడం అబద్ధం..

కేంద్ర ప్రభుత్వమే ఫిస్కల్ కౌన్సిల్ అవసరం లేదని పార్లమెంట్ లో చెప్పింది..

టిడిపి నాయకులు చెప్పినట్లు చేయకపోతే మొండితనమా ?

పేదల సంక్షేమానికి అక్షరాలా ఒక్క లక్షా 20 వేల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ..

అమ‌రావ‌తి: ఎఫ్ఆర్‌బీఎం నిబంధనల ప్రకారమే బడ్జెట్ అమలు చేస్తున్నామ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి వెల్ల‌డించారు. బడ్జెట్ అమలు కోసం ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్ ను ఆర్ధికమంత్రి తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వమే ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు కుదరదంటూ పార్లమెంటులో తేల్చిచెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాగ్, ఆర్థిక సంఘం, గణాంకాల సంస్థ ఉండగా. ఫిస్కల్ కౌన్సిల్ అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో చెప్పిన విషయాన్ని ఆర్ధిక మంత్రి బుగ్గన ఈ సందర్భంగా ప్రస్తావించారు. శుక్ర‌వారం మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆ వివ‌రాలు ఇలా...

బడ్జెట్ అమలు

కరోనా సంవత్సరమైనా 2020-21ని పదే పదే సాధారణ సంవత్సరాలతో పోలుస్తూ విపక్షాలు చేస్తున్న విమర్శల్ని ఆర్థికమంత్రి తప్పుబట్టారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2020-21లో ప్రపంచ మరియు దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తి భారీగా పతనమైంది. కరోనా కారణంగా 2020-21లో మన రాష్ట్ర ఆర్ధిక స్థితి కూడా బాగా దెబ్బతిన్నది. కరోనా వల్ల 2020-21 సంవత్సరంలో మన రాష్ట్ర ఆదాయం సుమారు రూ 8,000 కోట్లు తగ్గడమే కాకుండా, కరోనా నియంత్రణ మరియు చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం రూ 7,120 కోట్లు అదనంగా ఖర్చు చేసింది. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులున్నా ఎఫ్.ఆర్.బి.ఏం నిబంధనల ప్రకారమే బడ్జెట్ ను అమలు చేస్తున్నామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వ్యయాలు

కరోనా ప్రభావం ఎదుర్కొన్న 2020-21 ఆర్ధిక సంవత్సరంలో తొలి ఆరునెలల్లో మూలధన వ్యయం తక్కువగా చేశామన్న విమర్శల్ని ఆర్ధిక మంత్రి తప్పుబట్టారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో కరోనా ఇబ్బందులున్నా రూ.18,797.38 కోట్లు మూలధన వ్యయం చేసినట్లు ఆయన గుర్తుచేశారు. టీడీపీపాలన నుంచి ప్రభుత్వం మారిన 2019-20 ఆర్ధిక సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం రూ.12,242 కోట్లుగా ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ తాము రూ.31,198 కోట్లు మూలధన వ్యయం చేయాలని బడ్జెట్లో పొందుపరిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయాలపై టీడీపీ విమర్శలు అర్ధరహితమని ఆర్థికమంత్రి బుగ్గన అన్నారు. మూలధన వ్యయం విషయంలో టీడీపీ ఆరోపణలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయం ఎంత చేశారో చెప్పాలన్నారు.

ఆర్థిక‌సంవ‌త్స‌రం        మూల‌ధ‌న‌వ్య‌యం(రూ.కోట్ల‌లో)       రెవెన్యూ వ్య‌యం(రూ.కోట్ల‌లో)
2021-22 (BE)                                 31,198.38                          1,82,196.54
2020-21 (RE)                                18,797.39                           1,52,989.89
2019-20 (Acc.)                              12,242.08                           1,37,474.54
2018-19 (Acc.)                              19,976.33                           1,28,569.45
2017-18 (Acc.)                              13,490.71                           1,21,213.78   

పేదలకు అక్షరాలా రూ. 1, 67, 798 కోట్లు

పేదలకు గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకుంటున్నారన్న విపక్షాల విమర్శల్ని ఆర్థికమంత్రి తీవ్రంగా ఖండించారు. గతంలో అలా చేసుకున్న చరిత్ర టీడీపీదే అన్నారు. ఈ ప్రభుత్వం గడిచిన 32 నెలల కాలంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా.. డీబీటీ కింద రూ. 1, 27, 173 కోట్లు, నాన్ డీబీటీ కింద రూ. 40, 625 కోట్లు.. అంటే మొత్తం రూ. 1, 67, 798 కోట్లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జ‌రిగింద‌ని ఆర్థికమంత్రి గుర్తుచేశారు. దేశంలో ఇంత భారీగా సంక్షేమానికి ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మరెక్కడా లేదన్నారు. ఏపీ చరిత్రలో చూసినా సంక్షేమం కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టిన ప్రభుత్వం కనిపించదన్నారు. ప్రభుత్వం పేదలకు పెడుతుంటే చూసి ఓర్వలేక టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని. ఆర్ధికమంత్రి ఆక్షేపించారు. పేదలకు సంక్షేమ పథకాల వల్ల ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆరోపణల్ని కూడా ఆయన ఖండించారు.

టీడీపీ నాయకులు చెప్పినట్లు చేయకపోతే మొండితనమా ?

టీడీపీ దృష్టిలో ఆర్ధిక అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం, ప్రైవేట్ సంస్థలతో ఎంవోయూలకు పరిమితం కావడం, వాటితో లేనిది ఉన్నట్లు చూపించి మార్కెటింగ్ చేసుకోవడం, ప్రజా విద్య మరియు వైద్య వ్యవస్థను నీరుగార్చడం, ప్రజలకిచ్చిన వాగ్దానాలు మరచి మోసం చేయడమని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వ దృష్టిలో ఆర్ధిక అభివృద్ధి అంటే రైతన్నల సంక్షేమం, మానవ మూలధన నిర్మాణం (Human Capital Formation), ప్రజా విద్యా వైద్య రంగాల్ని మెరుగుపర్చడం, మహిళా సాధికారత, అభివృద్ధి వికేంద్రీకరణ, పారిశ్రామికరణ మరియు ఉద్యోగ కల్పన మొదలైన అంశాలుంటాయన్నారు.

టీడిపి నాయకులకు పేదవాడు చదువుకొని ఆరోగ్యంగా జీవితంలో ఎదగి అన్ని రంగాలలో ముందుండి పాల్గొనడం ఇష్టములేదని తెలియజేశారు. వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వంలో జరిగే వినూత్న కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాలు మెచ్చుకొని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే టీడీపి నాయుకులకు దిక్కు తోచకు ఇలాంటి తప్పుడు ఆరోపణులు చేస్తున్నారన్నారు. టీడీపీ చెప్పినట్లు వినకపోతే మొండి ప్రభుత్వమని విమర్శలు చేస్తారా అని నిలదీశారు. టీడీపీ హయాంలో దివాలా తీసిన రాష్ట్రాన్ని తాము తిరిగి గాడిన పెడుతున్నామని, ఆ లోపు వచ్చిన కరోనా ఇబ్బందులతో కొన్ని సమస్యలు తలెత్తడం వాస్తవమన్నారు.

అవినీతి కుంభకోణాలు

రెండేళ్ల వైయ‌స్ఆర్‌ సీపీ పాలనలో అవినీతి పెరిగిపోతోందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని ఆర్ధికమంత్రి బుగ్గన తీవ్రంగా తప్పుబట్టారు. లక్షా 27 వేల కోట్ల మొత్తాన్ని రైతన్నలు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు జగనన్న అమ్మ ఒడి, విద్య మరియు వసతి దీవెన, చేయూత, ఆసరా, రైతు భోరోసా, మొద‌లైన  కార్యక్రమాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ అందించిన ప్రభుత్వం తమదని ఆర్ధిక మంత్రి అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీతో కుల, మత, ప్రాంతాలు, పార్టీలకతీతంగా అవినీతి రహితంగా ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన జన్మభూమి కమిటీల అరాచకులు, భూముల కుంభకోణాలు, ఫైబర్ నెట్ స్కాం, స్కిల్ డెవలప్ మెంట్ స్కాములో జనం ఇంకా మర్చిపోలేదన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాలతో విసిగిపోయిన ప్రజలు తమకు అధికారంకట్టబెట్టారన్నారు. తమపై ఉన్న అవినీతి మరకల్ని వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వానికి అంటించాలని చూడటం సరికాదని ఆర్థికమంత్రి తెలిపారు.

టీడీపీ ఆర్ధిక క్రమశిక్షణా రాహిత్యం వల్లే

టీడీపీ ప్రభుత్వ హయాంలో అనుసరించిన అస్తవ్యస్త ఆర్ధిక విధానాల కారణంగానే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిందని, వాటిని సరిదిద్దే క్రమంలో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదని ఆర్థికమంత్రి బుగ్గన తెలిపారు. వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం అప్పులపై విమర్శలు చేసే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. గత టిడిపి ప్రభుత్వం 2019లో దిగిపోతూ రూ 41,900 కోట్ల బిల్లులను పెండింగు పెడితే ఆ బిల్లులు మన ప్రభుత్వంపై పెను భారం అయ్యాయని; విద్యుత్తు కొనుగోలు మరియు పంపిణీ సంస్థలకు సంబంధించిన అప్పును రూ 46,200 కోట్లు మేర అదనంగా పెంచేసి విద్యుత్తు రంగాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బతీశారని; సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పైన రూ 20,000 కోట్లు అదనంగా అప్పుచేశారని; ఫైనాన్సియల్ క్లోజర్ లేకుండా టెండర్లను పిలడం లాంటివి చేసి టిడిపి ఆర్ధిక ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆర్ధిక మంత్రి తెలియజేశారు.

కాంట్రాక్టర్ల కమిషన్ కోసం ఆంధ్ర రాష్ట్రానికి జీవ నాడి అయినా పోలవరం ప్రాజెక్టును మరియు ఆంధ్ర ప్రదేశ్ పునర్వవిస్తకరణ చట్టాన్ని తాకట్టు పెట్టని చరిత్ర టిడిపిదని చెప్పారు. టిడిపి హయామైన 2014-19 లో చేసిన అదనపు అప్పులను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి చట్ట పరంగా రావాల్సిన రూ 17,923 కోట్ల అప్పును నిలుపుదల చేసిందని తెలిపారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అమలు చేసిన ఆర్ధిక విధానాలతో పోలిస్తే వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వములో ఆర్థిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉందన్నారు. కరోనా ఇబ్బందుల్ని అధిగమించడంలోనూ ఏపీ ప్రభుత్వం మెరుగైన పనితీరు చూపుతోందన్నారు.

కరోనాతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్షం.. తప్పుడు లెక్కలతో ప్రజల్ని తప్పు దోవ పెట్టేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివి అని ఆర్థికమంత్రి అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా వీటిని సమన్వయం చేస్తూ  వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని  మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి వెల్లడించారు.

Back to Top