‘విశాఖ గర్జన’ను గ్రాండ్‌ సక్సెస్‌ చేయాలి

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపు

మనకు ముసుగుల అవసరం లేదు.. వికేంద్రీకరణ మన విధానం

మూడు రాజధానుల సాధన కోసమే జేఏసీ 

విశాఖలో వార్డుల వారీగా సమావేశాలు, ఆ తర్వాత మానవహారాలు

మన ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందాలి

విశాఖపట్నం: మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి మ‌ద్ద‌తుగా ఈనెల 15వ తేదీన నిర్వ‌హించ త‌ల‌పెట్టిన `విశాఖ గ‌ర్జ‌న‌`ను విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. వికేంద్రీక‌ర‌ణే వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. విశాఖ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏం మాట్లాడారంటే..

పాదయాత్ర పేరుతో టీడీపీ నాయకులు ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ ఆ యాత్ర చేస్తోంది. అలా ప్రాంతీయ విభేదాలు తలెత్తేలా వారు  వ్యవహరిస్తున్నారు. తమ దోపిడి ఆగిపోయిందన్న బాధ వారిది. వారి విమర్శలు సరి కావు.

జేఏసీ డిమాండ్‌ సమంజసం
విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పడిన జేఏసీ, ఈనెల 15న భారీ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చింది. అదే మన విధానం కాబట్టి, జేఏసీ ఇచ్చిన పిలుపును సక్సెస్‌ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ పార్టీ జిల్లాల అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేసి, నన్ను రమ్మంటే వచ్చాను. దీనికి తగినట్లుగా మనందరం సమాయత్తం కావాలి. ఇక్కడ రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి జేఏసీ పిలుపు. మనం ఇక్కడికి చెందిన వారం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. రెండు మనకు రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీ విధానం, మన ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

పార్టీ శ్రేణులన్నీ పాల్గొనాలి..
ఇక్కడి ప్రజల మనోభావాలను అనుగుణంగా పని చేయాల్సి ఉంది.  ఈనెల 15న గర్జన ర్యాలీ. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బీచ్‌లో వైయస్సార్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. దానికి అనుగుణంగా మనకు ఉన్న అన్ని అవకాశాలు క్రోడీకరించి, ర్యాలీని సక్సెస్‌ చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమంలో పార్టీ శ్రేణులన్నీ పాల్గొనాలి. అలాగే పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా తప్పనిసరిగా హాజరవ్వాలి. పార్టీ పరంగా కూడా అవసరం మేరకు మనమంతా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి. విశాఖలోని అన్ని వార్డులలో సమావేశాలు నిర్వహించాలి. రేపు (మంగళవారం) సమావేశాలు. ఎల్లుండి (బుధవారం) ప్రతి వార్డు సెంటర్‌లో మానవ హారాలు నిర్వహించాలి. ఇందులో పార్టీ నగర పెద్దలంతా పాల్గొనాలి.

ముసుగుల అవసరం లేదు
ఇక ముసుగుల అవసరం లేదు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు చేస్తున్న పాదయాత్ర పూర్తిగా తెలుగుదేశం పార్టీది. రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం రైతుల పేరుతో చేస్తున్న యాత్ర అది. కాగా, ఈ ప్రాంత అభివృద్ధి మన లక్ష్యం, విధానం కాబట్టి, మనకు ఎలాంటి ముసుగులు అవసరం లేదు. అందుకే మనమంతా ఇక్కడి జేఏసీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాలు పంచుకోవాలి. జేఏసీలో మేధావులు ఉన్నారు. వారి నిర్ణయాలకు అనుగుణంగా మనం అందరం పని చేయాలి.

మరి మీరు మేధావులైతే..
నిన్న టీడీపీ నాయకుడు ఒకరు మాట్లాడారు. మనం అజ్ఞానులం అని అచ్చెన్నాయుడు విమర్శించారు. సరే నాకు బుర్ర లేదు. నీవు నా కంటే ఎత్తుగా, బరువుగా ఉన్నావు. మరి ఇన్ని ఉన్న నీవు, విశాఖ అభివృద్ధి ఎందుకు వద్దంటున్నావు. ఈ ప్రాంతం నుంచి నీకు పదవులు కావాలి. నీకు, నీ పిల్లలకు అధికారం కావాలి. నీ ఇష్టం వచ్చినట్లు దోచుకోవాలి. కానీ ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందొద్దా? రాజధాని మొత్తం అమరావతిలోనే ఉండాలంట. ఇదెక్కడి సమంజసం? నాడు ఉమ్మడి రాష్ట్రంలో 1983 తర్వాత ఏ పార్ఠీ ఎక్కువ అధికారంలో ఉంది? మీ పార్టీనే కదా? మరి ఆనాడు ఈ ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఇక్కడ ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఆ పని చేతకాదు కానీ, మమ్మల్ని సన్నాసులు అన్నావు. మీ నోటికి అదుపు లేదా? మేమూ ఆ విధంగా మాట్లాడగలం కదా?

సహనం కోల్పోతున్నారు
తెలుగుదేశం నాయకులు సహనం కోల్పోతున్నారు. ఎందుకంటే వారికి ప్రజల్లో మద్దతు లేదు. ఈటీవీ వంటి ఒకటి రెండు ఛానళ్ల అండతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మీకు అదే వచ్చు. కాబట్టి చేసుకొండి. కానీ ఈ ప్రాంత అభివృద్ధి ఎందుకు కోరుకోవడం లేదు? అసలు మీ పాలనలో ఇక్కడ ఎందుకు అభివృద్ధి పనులు చేయలేదు? 

వైయస్సార్‌ హయాంలోనే
విశాఖలో కేవలం వైయస్సార్‌ హయాంలోనే పలు కంపెనీలు వచ్చాయి. ఇక్కడ హెల్త్‌ సిటీ ఏర్పాటైంది. బ్రాండెక్స్‌ కంపెనీ కూడా ఇక్కడకు వచ్చింది. ఐటీ కంపెనీలు వచ్చాయి. ఆ మంత్రివర్గంలో ఉన్న మేము ఆ పనులన్నీ చేశాం. ఈ విషయాన్ని మేము ధైర్యంగా చెప్పగలం. మరి మీరు అలా చెప్పుకోగలరా? సుజల స్రవంతి గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. దానికి ఆనాడు వైయస్సార్‌ పనులు మొదలు పెడితే, ఆ తర్వాత ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. తిరిగి ఇవాళ వైయ‌స్ జగన్‌ ఆ పనులు చేపడుతున్నారు. ఇవి వాస్తవాలు కావా? అయినా సిగ్గు లేకుండా మమ్మల్ని అజ్ఞానులు అంటున్నావు. నీకు అసలు బుద్ధి ఉందా? మాట్లాడితే విచక్షణ ఉండాలి. సంస్కారం ఉండాలి. మీ పాలనలో కనీసం ఇక్కడ ఒక పెద్ద ఆస్పత్రి కోసం అయినా ఆలోచించారా? ఇక్కడ హైదరాబాద్‌ తర్వాత విశాఖలోనే అభివృద్ధి కనిపిస్తోంది అంటే, దానికి కారణం ఎవరు? ఎవరి హయాంలో ఇక్కడ ఐటీ పరిశ్రమలు వచ్చాయి? ఇక్కడ భారీ కంపెనీలు వచ్చాయి? మీ హయాంలో కనీసం బీఆర్‌టీఎస్‌ రోడ్డు అయినా వేశారా? ఏ ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా? మీ పార్టీకి చెందిన అశోక్‌గజపతి రాజు కేంద్రంలో మంత్రిగా పని చేశారు. కనీసం ఆయన హయాంలో అయినా, విశాఖలో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేశారా?

ఒక్కటైనా చెప్పుకోగలరా?
అదే సీఎం వైయస్‌ జగన్‌, బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం తపనతో పని చేస్తున్నారు. ఈ సమావేశం ద్వారా టీడీపీ నాయకులను కోరుతున్నాను. రాష్ట్రంలో మీరు చేసిన ఒక్క మంచి పని.. మీ మార్క్‌ పని చెప్పండి. పేదల సంక్షేమం కోసం ఈ పని చేశామని.. ఒక్కటంటే ఒక్కటి చెప్పండి. ఏమన్నా అంటే, నాడు ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చామని చెబుతారు. దాని రేటు కూడా చంద్రబాబు పెంచాడు. అదే మేము అనేక పథకాలు, కార్యక్రమాలు పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్నాం. కాదంటారా? మమ్మల్ని విమర్శిస్తున్న బీజేపీ నాయకులను అడుగుతున్నాను. మీ పాలిత రాష్ట్రాలలో అలాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు?.

ప్రతి మాటకు జవాబు చెప్పాలి
మనం జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. వాటిని సక్సెస్‌ చేయాలి. ఎందుకంటే అమరావతి పోరాటం అని చేస్తున్న ఆ పార్టీకి టక్కుటమార విద్యలు తెలుసు. మనకు ప్రజా సంక్షేమం తప్ప, మరేదీ తెలియదు. అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారు చేస్తున్న ప్రతి విమర్శకు, ప్రతి మాటకు మన జవాబు ఉండాలి. ఎందుకంటే ఏమీ చేయని వారే ఎన్నో విమర్శలు చేస్తుంటే, అన్నీ చేస్తున్న మనం ఎందుకు వెనక్కు తగ్గాలి?.

ర్యాలీని సక్సెస్‌ చేయాలి
కాబట్టి రేపు 15న జేఏసీ తలపెట్టిన గర్జన ర్యాలీని మనం తప్పనిసరిగా సక్సెస్‌ చేయాలి. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఎవరూ పూనుకోలేదు. ఇప్పుడు జేఏసీ వచ్చింది. కాబట్టి వారికి మనం పూర్తిగా అండగా నిలవాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మనమంతా కృషి చేయాలి.. అని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top