సీఎం చెప్పే ప్రతీ మాట పార్టీకి, ప్రభుత్వానికి దిక్సూచి

ఆ స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

ప్లీనరీ సమావేశాల ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి బొత్స సత్యనారాయణ

గుంటూరు: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున, ఆయన్ను స్మరించుకుంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 8వ తేదీన పార్టీ జెండా వందనం, అధ్యక్షుల ప్రారంభ ఉపన్యాసంతో ప్లీనరీ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమై.. 9వ తేదీ అధ్యక్షుల ముగింపు ఉపన్యాసంతో సమావేశాలు ముగుస్తాయన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేతలతో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి బొత్స మాట్లాడారు. 

ఈనెల 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి పెద్దలందరం కూర్చొని చర్చలు జరిపామని, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి ప్లీనరీ సమావేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్లీనరీ సమావేశానికి తరలివచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో  ఆత్రుతతో ఉన్నారని, వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్లీనరీ అద్భుతంగా జరుగుతుందని మంత్రి బొత్స అన్నారు. 

ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, మూడేళ్లలో ప్రజలకు సంతృప్తస్థాయిలో పరిపాలన అందించాం. నియోజకవర్గాలు, జిల్లాల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై చర్చించాం. ఇంకా మెరుగైన విధానాలు, పరిపాలన, ఆలోచనలతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం ఉంటుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పే ప్రతిమాట రాబోయే రెండు సంవత్సరాల్లో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి దిక్సూచి. ఆ స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

తాజా వీడియోలు

Back to Top