ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్‌ కేటగిరీ రాష్ట్రాల మధ్య పధ్నాల్గవ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ ప్రభుత్వ హామీ పరిస్థితి ఏమిటి అంటూ రాజ్యసభలో బుధవారం వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాష్ట్రాలతో కేంద్రం పంచుకునే పన్నుల రాబడి సమాంతరంగా జరగాలన్న ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే గతంలో పన్నుల పంపిణీలో 32 శాతం ఉన్న రాష్ట్రాల వాటాను 2015-2020 కాలానికి 42 శాతానికి పెంచినట్లు చెప్పారు. పదిహేనవ ఆర్థిక సంఘం సైతం 2020-2026 కాలానికి ఈ పంపిణీ నిష్పత్తిలో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్తగా జమ్మూ, కాశ్మీర్‌ రాష్ట్రంగా అవతరించినందున 42 శాతాన్ని 41 శాతానికి స్వల్పంగా తగ్గించినట్లు తెలిపారు. పన్నుల్లో వాటా పంపిణీ ద్వారా ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటును పూడ్చడం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో 90:10 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం భరించడం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిలో ఒక అంశం. 2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో విదేశీ ఆర్థిక సంస్థల రుణ సహాయంతో చేపట్టే ప్రాజెక్ట్‌ల వ్యయాన్ని వడ్డీతో సహా కేంద్రమే చెల్లించడం ప్యాకేజీలో ప్రధాన అంశమని చెప్పారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత సానువులను ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ, కాశ్మీర్‌ రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాల వ్యయంలో 90 శాతం కేంద్రం, 10 శాతం ఆయా రాష్ట్రాలు భరిస్తాయని మిగిలిన రాష్ట్రాలలో ఈ నిష్పత్తి 60:40గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు
 వెనుకబడిన కులాల (ఓబీసీలు) వర్గీకరణ కోసం నియమించిన రోహిణి కమిషన్ కాలపరిమితిని ఈ ఏడాది జూలై 31 వరకు పొడిగించినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వెల్లడించారు. ఓబీసీ వర్గీకరణ కోసం నియమించిన రోహిణి కమిషన్ కాలపరిమితిని  పొడిగించారా? కమిషన్ కోరకుండానే గడువు పొడిగించడానికి కారణాలేమిటి? ఇప్పటివరకు ఎన్ని పర్యాయాలు కమిషన్ కాలపరిమితిని పొడిగించారు? రోహిణి కమిషన్ పనిని ఎప్పటికి పూర్తి చేసి నివేదిక సమర్పిస్తుందని రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ కోవిడ్ మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్త ఆంక్షల కారణంగా కమిషన్ నిర్ణీత గడువులోగా పని పూర్తి చేయలేకపోవడంతో ప్రభుత్వం కాలపరిమితిని పొడిగించిందని మంత్రి తెలిపారు.
కమిషన్ పదవీకాలం ఇప్పటి వరకు 14సార్లు పొడిగించినట్లు మంత్రి తెలిపారు.  ప్రస్తుతం కేంద్రం వద్దనున్న ఓబీసీ  జాబితాలో వర్గీకరణకు సంబంధించి నెలకొన్న సందిగ్ధతను నివృత్తి చేసుకుని జాబితాను పూర్తిస్థాయిలో ఖరారు చేసేందుకు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి పనిచేస్తోంది. ఈ పని పూర్తికావడానికి సమయం పడుతుందని మంత్రి తెలిపారు. నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడే రోహిణి కమిషన్ పనిచేస్తోందని, కమిషన్ పదవీ కాలపరిమితి ఈ ఏడాది జూలై 31 వరకు ఉందని మంత్రి తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top