హక్కుప్రకారం కృష్ణా, గోదావరి జలాలు వినియోగించుకుంటాం

తెలంగాణతో ఎలాంటి వివాదాలు కోరుకోవట్లేదు

కరువు సీమకు నీళ్లివ్వాలన్నది సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

2021 డిసెంబర్‌ కల్లా పోలవరం పూర్తిచేస్తాం 

మా ఏడాది పాలనపై మార్కులు వేసే సీన్‌ బాబుకు లేదు

నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

విజయవాడ: రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటానే వినియోగించుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రంతో ఎలాంటి వివాదాలు కోరుకోవట్లేదని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. కృష్ణా నది వరద జలాలను వినియోగించుకోవాలన్నదే తమ ప్రయత్నమని, అందుకే పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంచుతున్నామన్నారు. రాయలసీమకు నీళ్లివ్వాలన్నది సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి నీటిని కూడా హక్కు ప్రకారం వినియోగించుకుంటామన్నారు. తెలంగాణకు గోదావరి నీటిపై ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవని, దీనిపై గోదావరి యాజమాన్య బోర్డు నుంచి స్పష్టత రావాలన్నారు.  

పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్‌ కల్లా పూర్తిచేస్తామని మంత్రి అనిల్‌ కుమార్‌ చెప్పారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోని చంద్రబాబుకు దాని గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని అసమర్థుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరాన్ని సీఎం వైయస్‌ జగన్‌ పూర్తిచేస్తారన్నారు. పోలవరం పూర్తి చేసి చంద్రబాబును కూడా ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తామన్నారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనకు మార్కులు వేసే సీన్‌ చంద్రబాబుకు లేదన్నారు. ఏడాది కాలంలోనే దేశంలోనే 4వ బెస్ట్‌ సీఎంగా వైయస్‌ జగన్‌ నిలిచారని,  చంద్రబాబు ఏనాడైనా టాప్‌5లో నిలిచారా..? అని ప్రశ్నించారు. బీసీలను 30 ఏళ్లు మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అయితే.. సీఎం వైయస్‌ జగన్‌ బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించారన్నారు. బీసీలకు ఇన్ని పథకాలు చరిత్రలో ఏ సీఎం ప్రవేశపెట్టలేదన్నారు. లోకేష్‌ మొదటి షోకే వెనక్కి వెళ్లిపోయే ఫ్లాప్‌ సినిమా లాంటోడని ఎద్దేవా చేశారు. 
 

Back to Top