బాల్య వివాహాలను అరికట్టాలి

అందరూ చదువుకునేందుకే అమ్మఒడి పథకం

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

 

విజయవాడ: మానసిక పరిపక్వతలేని వయస్సులో జరిగే బాల్య వివాహాలు.. ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయని, వాటిని అరికట్టాలని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా సూచించారు. బాలికల బాల్యవివాహాలను ముస్లిం మత పెద్దలు, ఖాజీలు ప్రోత్సహిస్తున్నారన్నారు. మైనార్టీ బాలికల విద్య, బాల్య వివాహాలు, అక్రమ రవాణా అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ మేరకు అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. విద్య, బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణా సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యలని అన్నారు. వరకట్నం పెద్ద మహమ్మారిగా మారిందని, ఆడపిల్ల ఎక్కువ చదివితే ఎక్కువ కట్నం ఇవ్వాల్సి వస్తుందనే భ్రమలో తల్లిదండ్రులు ఉన్నారన్నారు. ఇస్లాంలో చదువుకు అత్యంత ప్రాధాన్యాత ఉందని, మహ్మద్‌ ప్రవక్త విద్య ప్రాముఖ్యత గురించి వివరించారని గుర్తు చేశారు. ఆర్థిక పరిస్థితులు సరిగాలేక కొందరు విద్యార్థులు పాఠశాలకు దూరమవుతున్నారని, అలాంటి వారికోసమే సీఎం అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి ఖాతాలో.. ప్రభుత్వమే రూ. 15వేలు జమ చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని 43 లక్షల తల్లులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం జనవరి నుంచి అమ్మఒడి పథకాన్ని అమలు చేయనుందని తెలిపారు.

ప్రపంచంలో మొదటి యూనివర్సిటీ స్థాపించినది ఒక మహిళ అని, వీర వనితలను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ముస్లిం బాలికలు ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. చెడు వ్యసనాలకు బానిస కాకుండా.. యువతకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలకు అన్ని రంగాల్లోని నామినేటెడ్‌ పోస్టులలో 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దేశంలో ఒక్క సీఎం వైయస్‌ జగన్‌కే చెల్లిందన్నారు.

విద్యకు అత్యంత ప్రాధాన్యం: వాసిరెడ్డి పద్మ
మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మైనారిటీ పక్షపాతి అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని అన్నారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలతో సీఎం వైయస్‌ జగన్‌ విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని కొనియాడారు. బాల్యవివాహాలను అరికట్టేందుకు మహితా సంస్థ, మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

 

Read Also: చంద్రబాబు నిర్వాకం వల్లే విద్యుత్‌ కోతలు

Back to Top