తాడేపల్లి: సర్వీస్‌లో ఉన్న టీచర్స్ కి టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంతో పాటు ఉద్యోగులకు ఇచ్చిన హమీ ప్రకారం ప్రధాని, కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ ఆదేశాలను మార్పు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించాలని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీచర్లకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు దీనిపై పార్లమెంట్‌లో గళం విప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాలు ఊడపెరికేసి ఇంటికి పంపేసేలా టీచర్లను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. అక్టోబర్ 18న తనను కలిసిన టీచర్లతో టెట్ నుంచి మినహాయింపు దక్కేలా చూస్తానని హమీ ఇచ్చిన చంద్రబాబు, నాలుగు రోజులకే మాట మార్చి అందరూ పరీక్ష పాసవ్వాలని అక్టోబర్ 22న టెట్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. కొత్తగా టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవారితో పాటు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా పరీక్ష రాయాల్సిందేనని చెప్పి ప్రభుత్వం వారిని మానసికంగా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రమోషన్ వద్దనుకునే వారికి, ఐదేళ్ల లోపు రిటైర్ అయ్యే వారికే టెట్ పాస్ నుంచి మినహాయింపు ఇస్తామని చెప్పడం ఉద్యోగులను బ్లాక్‌మెయిల్ చేయడమేనని మండిపడ్డారు. 20 ఏళ్లుగా ఒక సబ్జెక్ట్ టీచర్‌గా పనిచేస్తున్న ఉద్యోగులు, కొత్తగా అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యి పరీక్ష పాస్ కావడం ఎంత కష్టమో ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఇదంతా కొత్తగా టీచర్ రిక్రూట్‌మెంట్ లాగే ఉందని వివరించారు. ఇప్పటికైనా ఉద్యోగుల అభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరించడం ప్రభుత్వానికి కూడా మంచిది కాదని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. టీచర్లను ఇబ్బంది పెడుతూ వారి ఉద్యోగాలు ఊడపెరికేసే ఆదేశాలను వైయస్ఆర్‌సీపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు.