గడప గడపకూ వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా..?

టీడీపీ వాగ్దానాల అమలుపై రాసే ధైర్యం ఎల్లోమీడియాకు ఉందా..?

ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై బురదజల్లే రాతలు ఎందుకు..?

మూడేళ్లలో మేనిఫెస్టోలోని అంశాలు 94 శాతానికిపైగా అమలు చేశాం

మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం మాది

రాష్ట్రం, పోలవరం సర్వనాశనం కావాల‌ని, అమరావతి దేదీప్యమానంగా వెలగాలని బాబు, ఎల్లోమీడియా కుట్ర

పోలవరంంతో ఎవ్వరికీ ఏ విధమైన పేచీలు లేవు

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: టీడీపీ హయాంలో ప్రజలకు ఇంత మేలు చేశామని గడప గడపకూ వెళ్లి చెప్పే ధైర్యం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఉందా..? 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై రాసే దమ్ము ఎల్లో మీడియాకు ఉందా..? అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎంతసేపూ ప్రజలకు మేలు చేస్తున్న వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బురదజల్లే ప్రయత్నం.. పోలవరం నాశనమైపోయింది.. రాష్ట్రం శ్రీలంకలా మారిపోతుందని దుష్ప్రచారం చేయడం చేయడమే చంద్రబాబు, రామోజీరావు వారికి సంబంధించిన గ్యాంగ్‌ పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 వాగ్దానాలపై రాసే దమ్ము ఎల్లో మీడియాకు ఉందా..? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి అంబటి ఏం మాట్లాడారంటే..

‘ప్రతీ ఇంటికి ప్రభుత్వం ఏ విధంగా సహాయపడిందో గడప గడపకూ వెళ్లి చెబుతున్నాం. మాకు ఓటు వేసిన వారి ఇంటికీ, ఓటు వేయని వారి ఇంటికీ, మమ్మల్ని ఓడించాలని ప్రయత్నం చేసిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తల ఇళ్ల ముందుకు వెళ్లి కూడా చెబుతున్నాం. మా ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల కాలంలో మేనిఫెస్టోలోని 94 శాతం పైచిలుకు వాగ్దానాలను అమలు చేసింది. అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, ఆసరా, చేయూత, వాహన మిత్ర, చేదోడు ఇలా వరుసగా లెక్కగట్టి ఇంటింటికీ వెళ్లి చెబుతున్నాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇంత జవాబుదారీతనంగా ప్రజల ముందుకు వెళ్లి చెప్పిన సంఘటన గతంలో ఎప్పుడూ లేదు. అంతటి గొప్ప కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ రూపుదిద్ది అధికారులను, ప్రజాప్రతినిధులను ఇంటింటికీ పంపిస్తున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం రివ్యూ చేసి.. అనేక విషయాలను చర్చించారు. 

మా రాజకీయ శత్రువర్గం ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ దానికి అనుగుణంగా ఉన్న రాజకీయ పక్షాలు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు 600లకు పైగా వాగ్దానాలు చేశాడు.. మా ప్రభుత్వంలో ఇన్ని పథకాలు అమలు చేశామని, సీఎం వైయస్‌ జగన్‌ కంటే గొప్పగా పరిపాలన చేశామని చంద్రబాబు ఇంటింటికీ వెళ్లి చెప్పగలడా..? రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాం.. తాకట్టుపెట్టిన బంగారం ఇంటికి చేరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చామని చంద్రబాబు చెప్పగలడా..? ఇలాంటి విషయాలను ఎల్లో మీడియా ఎందుకు ఎక్కడా ప్రస్తావించదు. మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్తున్న మా ప్రభుత్వం మీద ఎందుకు బురదజల్లుతున్నారు. 

ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఎల్లో మీడియా ఎక్కడా రాయదు. రామోజీరావు, ఆంధ్రజ్యోతి పోలవరం సర్వనాశనం అయిపోయిందని రాస్తారు.. ఆంధ్రప్రదేశ్‌ శ్రీలంకలా అయిపోవాలని వారి కోరిక. గుంటూరుకు, విజయవాడకు సంబంధం లేకుండా వారి బినామీ భూముల్లో పెట్టిన అమరావతి దేదీప్యమానంగా వెలిగిపోవాలి.. దాని మీద లక్షల కోట్లు ఖర్చు చేసి ఈ ప్రభుత్వం బాగుచేయాలి.. ఒక్కో గజం లక్ష రూపాయలకు అమ్మేలా చేస్తే.. డబ్బు సంపాదించుకునే కార్యక్రమం మా నాయకులు, కార్యకర్తలు చేస్తారనే స్థాయికి చంద్రబాబు, ఎల్లో మీడియా వెళ్లిపోయింది. చంద్రబాబు 600పైగా వాగ్దానాలు చేసి.. ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. 

పోలవరం గురించి ఎల్లో మీడియా పిచ్చిపిచ్చిగా రాతలు రాస్తోంది. ఉమ్మడి సర్వేకు  ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా అని ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ఒకాయన రాశాడు. పోలవరం గురించి కేంద్రం ఎందుకు సమావేశం ఏర్పాటు చేసిందంటే.. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాయి. అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్‌ వేస్తే.. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోర్టు సూచించింది. కేంద్రం సమావేశం ఏర్పాటు చేసింది. ఉమ్మడి సర్వే చేయాల్సిన అవసరం లేదు. భద్రాచలానికి ముప్పే లేదు అని కేంద్రం స్పష్టంగా చెప్పింది. 2009, 2011లోనే అన్నింటికీ క్లియరెన్స్‌లు వచ్చాయి. కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ స్టడీ చేసి అన్ని క్లియరెన్స్‌లు ఇచ్చేశాయి. అయినా పోలవరంలో ఏదో జరిగిపోతుందని ఉమ్మడి సర్వేకు పట్టు.. పోలవరంపై కేంద్రాన్ని కోరిన పొరుగు రాష్ట్రాలు అని హెడ్డింగ్‌ పెట్టి గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. పోలవరంపై ఎవ్వరికీ ఏ విధమైన పేచీలు లేవు’ అని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 

 

Back to Top