చంద్రబాబు ఆపిన ప్రాజెక్టులను వైయస్‌ఆర్‌ పూర్తి చేశారు

చంద్రబాబు తాను ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఉందా?

పోలవరాన్ని 2018లో పూర్తి చేస్తానన్న చంద్రబాబు ఎందుకు చేయలేదు?

పవన్‌ను నేను విమర్శిస్తే చంద్రబాబుకు ఎందుకు గుచ్చుకుంది

మంత్రి అంబటి రాంబాబు

న్యూఢిల్లీ: చంద్రబాబు ఆపిన ప్రాజెక్టులను దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి  పూర్తి చేశారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.పోలవరానికి వైయస్‌ఆర్‌ శంకు స్థాపన చేశారని గుర్తు చేశారు.  ప్రతి ఎకరాకు నీళ్లిస్తామని చంద్రబాబు చెబుతున్నాడు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు, అవాస్తవాలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  న్యూఢిల్లీలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడారంటే..

  నా మూడు ప్రశ్నలకు సమాధానమేది బాబు..?
ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమలో నిన్న సుదీర్ఘంగా మాట్లాడుతూ.. తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రినైన నన్ను పట్టుకుని కించపరుస్తూ ఆంబోతు రాంబాబు అని అంటున్నాడు. ఆయనకు ఇరిగేషన్‌ రంగంపై అవగాహన లేకనే డైవర్షన్‌ విషయాల్ని మాట్లాడుతున్నాడు. మరి, ఈ సందర్భంలో నేను గతంలో గుర్తుతెచ్చిన ఒక విషయాన్ని మరలా గుర్తుకుతేవాల్సిన పరిస్థితి వచ్చింది. ‘చంద్రబాబు జీవితమంతా ఆవులకు ఆంబోతులను సప్లై చేయడం మాత్రమే..’ అని ఆ పనితోనే ఆయన రాజకీయాల్లో పైకొచ్చాడని అన్నాను. 

అవును, నేను బాధ్యతగల్గిన ఇరిగేషన్‌ శాఖ మంత్రిని. అనేక సందర్భాల్లో చంద్రబాబుకు నేను మూడు ప్రశ్నలు వేశాను. నా మూడు ప్రశ్నలకు ఎప్పుడైనా సమాధానం చెప్పావా..? అది నీ బాధ్యత కాదా..? అందుకే, నేను వాటిని మరోమారు గుర్తుచేస్తూ బాబును ప్రశ్నిస్తున్నాను. 
అందులో ఒకటేమిటంటే, పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని శాసనసభలో నువ్వు చెప్పిన మాట వాస్తవమా కాదా..? వాస్తవమైతే ఎందుకు పూర్తిచేయలేకపోయారు..?
ఇక, రెండోప్రశ్న.. కేంద్రప్రభుత్వమే కట్టి ఇస్తామన్న పోలవరం ప్రాజెక్టును ఎందుకు దేహీ.. అని రాష్ట్రప్రభుత్వం టేకప్‌ చేసిందనే దానికి సమాధానం చెప్పమని అడిగాను. చెప్పలేదు.
మూడోప్రశ్న.. ప్రాజెక్టుకు వెన్నెముకలాంటి కాఫర్‌డ్యామ్‌ నిర్మించకుండా డయాఫ్రం వాల్‌ ఎందుకు నిర్మించారు..? అని ప్రశ్నించాను. 
-వాటిపై ఇప్పటికీ సమాధానం చెప్పలేని చంద్రబాబు నన్ను ఆంబోతు అంటున్నాడంటే ఆయన్ను ఏమనాలి..?  

రాయలసీమలో ఒక్క ప్రాజెక్టుకైనా ఫౌండేషన్ వేసి పూర్తి చేశావా?
ఇక, ఈరోజు ఇక్కడ్నుంచి నాల్గో ప్రశ్నను సంధిస్తున్నాను. కనీసం, దీనికైనా సమాధానం చెప్పు చంద్రబాబు. రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టుకైనా నీ కాలంలో ఫౌండేషన్‌ వేశావా..? పూర్తిచేశావా..? పోతిరెడ్డిపాడు గురించి బాబు పెద్ద ప్రసంగం చేశాడుకదా.. మరి ఆ ప్రాజెక్టుకు ఎవరు శంకుస్థాపన చేశారు..? దివంగత ఎన్టీరామారావు గారు మద్రాసుకు నీళ్లు ఇచ్చే తెలుగు గంగ కోసం కేవలం 11.5 వేల క్యూసెక్కుల డిశ్చార్జి నీటితో పోతిరెడ్డిపాడును ప్రారంభిస్తే.. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు పోతిరెడ్డిపాడు సామర్ధ్యం చాలదన్నారు. రాయలసీమ మొత్తానికి నీళ్లివ్వాలని ఉద్యమం చేశారు. లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు దాకా పాదయాత్ర కూడా చేశారు.

రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం కోసం ఉద్యమాలు చేసిన చరిత్రగానీ, పాదయాత్ర చేసిన చరిత్రగానీ చంద్రబాబుకు లేదు. ఆయన మామ ఎన్టీఆర్‌కూ లేదు. మహానేత వైఎస్‌ఆర్‌ గారు ముఖ్యమంత్రి అయ్యాక పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యాన్ని రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం కోసం 44వేల క్యూసెక్కులకు పెంచారు. దీన్నిబట్టి రాయలసీమకు నీళ్లిచ్చిన చరిత్ర చంద్రబాబుదా..? మహానేత వైఎస్‌ఆర్‌ గారిదా..? కచ్చితంగా, ముమ్మాటికీ వైఎస్‌ఆర్‌ గారిదేనంటూ సీమలో చిన్నపిల్లోడు కూడా చెబుతాడు. 

హంద్రీ-నీవా, గాలేరు-నగరికి నీవు చేసిందేమిటి బాబూ?
ఇక,  హంద్రీనీవా, గాలేరు – నగరి ప్రాజెక్టుల విషయానికొస్తే.. అప్పట్లో ఎన్టీరామారావు శంకుస్థాపన చేసినా అప్పట్లో వెన్నుపోటు పొడిచి ఆయన్ను అధికారంలో నుంచి చంద్రబాబు దించేశారు. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన చంద్రబాబు కనీసం ఈ ప్రాజెక్టుల విషయంలో ఒక్క అడుగైనా ముందుకేశాడా..? చేయనే చేయలేదని నేను సవాల్‌ చేసి చెబుతున్నాను. మరలా మహానేత వైఎస్‌ఆర్‌ గారు అధికారంలోకొచ్చిన తర్వాత గాలేరు – నగరి, హంద్రీ-నీవా, మచ్చుమర్రి అన్నింటికీ నిధులు ఇచ్చి పూర్తిచేశారు.   

ఏ లెక్కన పోలవరం నీ బ్రెయిన్ చైల్డ్ బాబూ..?
పోలవరం నా బ్రెయిన్ చైల్డ్ అని చంద్రబాబు అంటున్నాడు. పోలవరం ఆయన బిడ్డ ఎలా అవుతుంది..? అనేకమంది ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు అనేకసార్లు శంకుస్థాపనలు చేశారు. మరి, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా పోలవరం గురించి ఆలోచన చేశావా..? ఏ రోజైనా పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశావా..? ఏ రోజైనా పోలవరానికి ఒక్క రూపాయి ఖర్చుపెట్టావా..? అసలేమీ చేయనప్పుడు పోలవరం ఆయన బిడ్డ ఎలాగైంది..? అనేది నా ప్రశ్న. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పరిగెత్తించింది డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాదా..? అని అడుగుతున్నాను. పులిచింతల ప్రాజెక్టు కూడా మహానేత వైఎస్‌ఆర్‌ పుణ్యమేనని గుర్తుచేస్తున్నాను. బాబు ఏనాడైనా పోలవరం, పులిచింతలకు శంకుస్థాపన చేశాడా..? అని నిలదీస్తున్నాను. 

పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నది బాబే కదా..
పోలవరం మహత్తరమైన ప్రాజెక్టు అని బాబు చెప్పేదేముంది.. నిజంగా, అందరూ అంగీకరించాల్సిన గొప్ప ప్రాజెక్టు కాబట్టే.. కేంద్రం కూడా తన భుజస్కందాలపై వేసుకుని ప్రాజెక్టును పూర్తిచేస్తానన్నది. అలాంటి కేంద్ర నిర్ణయాన్ని కాదని.. నేనే ప్రాజెక్టు కడతాను. నిధులిస్తే పూర్తిచేస్తానని తెచ్చుకున్నావు. మరి, కేంద్రం నిధులిచ్చింది. నువ్వు పోలవరాన్ని పూర్తిచేశావా బాబూ..? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నావని కేంద్రం నుంచి సర్టిఫికేట్‌ తెచ్చుకున్నావు. 

గిల్లాడు కనుకే ‘బ్రో’గురించి మాట్లాడుతున్నాంః
ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని చంద్రబాబు నన్ను పట్టుకుని ఆంబోతంటాడు.. బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నానంటాడు. బ్రో సినిమా గురించి మాట్లాడటానికి మాకేం పనీపాటా లేదనుకుంటున్నాడా..? ఆ సినిమాలో నన్ను కించపరుస్తూ సన్నివేశం పెట్టాడు, కనుక రాజకీయంగా ఎదుర్కోలేని నీ దత్తపుత్రుడు మమ్మల్ని గిల్లాడు కనుకనే మేం బ్రో గురించి మాట్లాడుతున్నాం. బ్రో ఫైనాన్స్‌ గురించి పరిశోధిస్తున్నాం. 

నీ రెమ్యునరేషన్‌ ఎంత బ్రో..
అత్యంత నిజాయితీపరుడెవరయ్యా..? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘నేను..’ అంటూ పవన్‌కళ్యాణ్‌ ముందుకొస్తాడు. తాను అత్యంత నీతిమంతమైన, నిజాయితీగల్గిన నాయకుడినంటూ చే గువేరా, భగత్‌సింగ్‌ అంటూ కమ్యూనిస్టు నేతల పేర్లు కొందరివి చెబుతాడు. అడవుల్లోకి వెళ్లాలనుకున్నానని ప్రజాసేవ కోసం వెళ్లలేకపోయానంటున్నాడాయన. నాకూ ఆయనకు వివాదం వచ్చింది కనుక నేనొక ప్రశ్నను పవన్‌కళ్యాణ్‌ను అడుగుతున్నాను. 
- బ్రో.. నీ రెమ్యునరేషన్‌ ఎంత..? ఆ సినిమాకు నువ్వెంత తీసుకున్నావు..? అని అడుగుతున్నాను. 
- నిజాయితీపరులైతే నా ప్రశ్నకు పవన్‌కళ్యాణ్‌ గానీ.. బ్రో నిర్మాత గానీ రెమ్యునరేషన్‌ వివరాల్ని చెప్పాలి. మీరు బహిరంగంగా వివరాల్ని చెప్పగలరా..? అదిమాత్రం పవన్‌కళ్యాణ్‌ చెప్పడు. ఎందుకు సమాధానం చెప్పలేవని అడుగుతున్నాను. 

మీ బంధం ఇదేనా..
 నేను ఈ విషయం గురించి మాట్లాడుతుంటే, మరోవైపు చంద్రబాబుకు నొప్పి కలుగుతుంది. దత్తపుత్రుడు, దత్తతండ్రి బంధం బయటపడింది. బ్రో సినిమా గురించి మేము ఇక్కడ మాట్లాడితే.. ఎక్కడ్నో రాయలసీమ పోతిరెడ్డిపాడులో ఉన్న ఆయనకు, గండికోటలో ఉన్న ఆయనకు, పులివెందులలో ఉన్న ఆయనకు పొడుచుకొచ్చింది. మా పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారా..? అంటూ బాబు వస్తాడు. అసలు, బాబుకెందుకు మా ఇద్దరి గొడవ..? అని అడుగుతున్నాను. 

రాయలసీమ ద్రోహి చంద్రబాబుః
మైకు దొరికితే చాలు చంద్రబాబు అబద్ధాలకు అంతులేకుండా పోతుంది. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు –నగరి, చివరికి పులిచింతల  ప్రాజెక్టు కూడా అన్నీ నేనే కట్టించానంటూ చెప్పిన అబద్ధం మళ్ళీ మళ్ళీ చెబుతూ, చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆలోచన, ఆచరణ చేసిన గొప్పనేతలెవరైనా ఉన్నారంటే, అది డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గారు, గతంలో ఎన్టీరామారావు గారు. మా పార్టీకి సంబంధం లేకున్నా ఎన్టీఆర్‌ను మేం గుర్తుచేసుకోవడం ఎందుకంటే, వాస్తవాల్ని అంగీకరించే బాధ్యత, సంస్కారం మాకుంది కనుక. మరి, చంద్రబాబు మాత్రం రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాయలసీమ ద్రోహిగా ముద్రపడ్డాడు. 
- ఈ సందర్భంగా నేనొక విషయాన్ని కూడా గుర్తుచేస్తున్నాను. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీని విస్తరిస్తున్న సమయంలో కోస్తా రైతుల చేత ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నాలు చేయించిన పాపాత్ముడు ఈ చంద్రబాబేనని గుర్తుచేస్తున్నాను. ఇలాంటి నీచమైన దుర్మార్గుడికి రాయలసీమ మీద ప్రేమ ఉందంటే ఎవరు నమ్ముతారు. ఇలాంటి ద్రోహిని రాయలసీమ ప్రజలు క్షమించరు గాక క్షమించరు. లైవ్‌డిటెక్టర్‌కు కూడా దొరక్కుండా అబద్ధాలు చెప్పడంలో ప్రావీణ్యుడు ఈ చంద్రబాబు అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కనుక, ఆయన ఈరోజు ప్రతీ ఎకరాకు నీళ్లు ఇస్తామంటే నమ్మేవారు ఎవరూ లేరు. ఉండరు. 

 పోలవరం సందర్శనకు షెకావత్ః

నేను ప్రధానంగా ఢిల్లీకి వచ్చిన సందర్భమేమంటే, కొన్ని బహిర్గతం చేయడానికి.. మరికొన్నింటిపై అంతర్గతంగా చర్చించేందుకు వచ్చాను. పోలవరం ప్రాజెక్టు సందర్శన నిమిత్తం కేంద్రమంత్రి షెకావత్‌ గారిని కలిశాను. ఆయన కచ్చితంగా పోలవరం విజిట్‌ చేస్తామన్నారు. మా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలనూ కలిసి కొన్ని విషయాలపై చర్చించాం.  

జనసేన రాజకీయాల్ని మాని సినిమాలు చేస్తే మాకేం అభ్యంతరం..?
జనసేన పార్టీ రాజకీయాలు మానుకుని సినిమాలు తీస్తానంటే మాకేమీ అభ్యంతరం ఉండదు. పవన్‌కళ్యాణ్‌ మీద సినిమా తీసేది మా పార్టీ కాదు. నేను, నా మిత్రుల బృందం కలిసి ఆయన మీద సినిమా తీద్దామనుకుంటున్నాం. జనసేన నామీద సినిమా తీస్తే నేనూ సంతోషిస్తాను. సందులో సంబరాల శ్యాంబాబు అలియాస్‌ రాంబాబు అని పేరు పెడుతున్నారని తెలిసింది. ఆ సినిమా ఏదైనా కారణంతో ఆగిపోవాల్సి వస్తే.. అప్పుడు వాళ్లు నా దగ్గరకొస్తే నా పేరుమీద సినిమా కాబట్టి నావంతు సహకారం కూడా అందిస్తాను. 

సినిమాకి రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటానన్న పవన్ నోరు విప్పాలిః
రోజుకు రూ.2కోట్లు తీసుకుంటానని బహిరంగంగా చెప్పిన పెద్దమనిషి పవన్‌కళ్యాణ్‌ బ్రో సినిమాకు రెమ్యునరేషన్‌ ఎంత తీసుకున్నావయ్యా..? అంటే, సమాధానం చెప్పడెందుకు..? మరి, ఆయన పెద్ద నిజాయితీపరుడంటే మేమెలా నమ్మాలి.? ఆయన అఫీషియల్‌గా తీసుకునేది కొంత.. అన్ అఫీషియల్‌గా తీసుకునేది మరెంతో.. అలాగే, అఫీషియల్‌గా పెళ్లి చేసుకునేది కొందర్ని.. అన్ అఫీషయల్‌గా .. మేం చెప్పలేం. మాకేం తెలియదు. ఇది పవన్‌కళ్యాణ్‌ జీవితం.
-  నన్ను ఆయన సినిమా సన్నివేశాల్లో పెట్టి కించపరుస్తానంటే ఐ డోంట్‌ కేర్‌..  సరే, మాకుపోటీగా జనసేన తీసే సినిమాలో అవసరమనుకుంటే, డబ్బులు తీసుకుని పవన్‌కళ్యాణ్‌ను కూడా నటించమని చెప్పండి. మాకేం అభ్యంతరం లేదు. 

- ఈ ప్రెస్ మీట్ లో ఎంపీలు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్, శ్రీ నందిగం సురేష్ లు కూడా పాల్గొన్నారు. 
 

Back to Top