అమరావతి: బావ చంద్రబాబు జైల్లో.. అల్లుడు నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారని ఇదే సరైన సమయం..పోయిన పగ్గాలు తీసుకోండి అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే బాలకృష్ణకు సలహా ఇచ్చారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల అల్లరి, ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్ ఊదడం పట్ల మంత్రి అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులకు కౌంటర్‌గా సభలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్ గా ఉన్నాడు.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పాడు.. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ.. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు.. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి.. జన్మనిచ్చిన తండ్రి, క్లిస్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది.. ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చిందన్నారు. అంతే కాదు.. మీ బావ (చంద్రబాబు) జైల్లో… అల్లుడు (లోకేష్) ఢిల్లీలో ఉన్నారు.. ఇదే మీకు సరైన సమయం .. పోయిన పగ్గాలు తీసుకోండి.. నందమూరి వంశాన్ని నిరూపించుకోండి.. పార్టీని బ్రతికించుకోండి అంటూ బాలకృష్ణను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి.. మీకు నేను సలహా మాత్రమే ఇస్తున్నా.. పాటిస్తే పాటించు.. పాటించకపోతే అథపాతాళానికి పోతావు అంటూ హెచ్చరించారు. మీకు మీ నాయకుడు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే కమాన్ చర్చలో పాల్గొనండి.. ప్రజలే నిర్ణయిస్తారు.. ఎవరు తప్పుచేశారో.. ట్రెజరీ బెంచ్ సిద్ధంగా ఉంది చర్చకు రండి అంటూ సవాల్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేశారు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే టీడీపీ నేతలు ఉన్నారని మంత్రి మండిపడ్డారు. పేపర్ లో వార్తల కోసం టీడీపీ వ్యవహరించినట్లుగా అనిపిస్తోందని.. ఈ రోజు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే స్పీకర్ కచ్చితంగా చర్యలు తీసుకుంటారని మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు.