విజయవాడ: మూడు రాజధానులపై సందేహం అవసరం లేదని.. మూడు రాజధానులే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు అని తెలిపారు. విజయవాడలో భూగర్భ జలవనరుల డేటా సెంటర్ ను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయని.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు.
వారాహి ఏది.. ఎక్కడ.. ఆ సినిమా ఆపారా అని మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. అవగాహన ఉండి రాజకీయ విమర్శలు చేయాలని సూచించారు. లోకేశ్, పవన్ లకు నిబద్ధత లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లోకేశ్ తెలుగు వాడుక భాష మాట్లాడలేడు. తెలుగు మాట్లాడలేని వారు టీడీపీ వారసులా. ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ. లోకేశ్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుంది. అచ్చెన్నాయుడు ఎందుకు లోకేశ్ పాదయాత్ర పెట్టారా అని తలలు పట్టుకుంటున్నారు. 40 లక్షల ఎకరాలు రాష్ట్రంలో భూగర్భజలాల మీద ఆధారపడి ఉన్నాయి. ఏ పంటలకు అనుకూలంగా ఉండే జలాలు ఉన్నాయో ఇక్కడి ల్యాబ్ నిర్ణయిస్తుంది. ఏలూరు, విజయవాడ, చిత్తూరు, విశాఖ లలో డేటా సెంటర్లు ఏర్పాటు చేశాం. 16.5 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.