సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు

విశాఖ ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంపులు

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

విషజ్వరాల నివారణ చర్యలపై విశాఖ జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష

విశాఖ: సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలకు సంబంధించి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్, అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. విశాఖ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ 462, చికెన్‌ గున్యా 31, మలేరియా 708 కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లాలోని ఏజెన్సీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విష జ్వరాల కేసులు ఎక్కువకాకుండా ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. విష జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి రోజూ శానిటేషన్‌ డ్రైవ్‌తో పాటు సర్వే జరుగుతుందన్నారు. 

ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెడికల్‌ క్యాంపు నిర్వహించనున్నట్లు చెప్పారు. టెస్టులు చేసేందుకు పరికరాలు, మెడిసిన్‌ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామన్నారు. డాక్టర్లు, బెడ్స్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. ఏజెన్సీలో మలేరియా కేసులు గుర్తించేందుకు పరీక్షలు పెంచాలని వైద్యాధికారులకు సూచించామన్నారు. అరకు, అనంతగిరి, కొయ్యూరు, పెదబయలు మండలాలపై ప్రత్యేక దృష్టిపెట్టామని,  త్వరితగతిన దోమ తెరలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. 

 

Back to Top