షెడ్యుల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలు

జలుబు, దగ్గు, జ్వరం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రూమ్‌లో పరీక్షలు

కోవిడ్‌–19 నియంత్రణలో భాగంగానే విద్యాసంస్థలకు సెలవులు

మార్చి 31 వరకు సెలవులు, వైరస్‌ ఉధృతిని బట్టి తదుపరి నిర్ణయం

అవసరమైతే ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతులిచ్చాం

ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంట్‌ సూచనలు తప్పకుండా పాటించాలి

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సచివాలయం: కోవిడ్‌–19 నియంత్రణలో భాగంగా విద్యాశాఖ పరిధిలోకి వచ్చే అన్ని విద్యా సంస్థలకు మార్చి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించడం జరిగిందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరించారు. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ఇలా అన్ని సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యుల్‌ ప్రకారమే ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరుగుతున్నాయని, అవి కూడా ఈ నెల 23వ తేదీతో పూర్తవుతాయన్నారు. అదే విధంగా గతంలో ప్రకటించిన షెడ్యుల్‌ ప్రకారమే మార్చి 31వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. విద్యాశాఖ సూచనలను విద్యా సంస్థలు   తూచా తప్పకుండా పాటించాలని, ప్రత్యేకమైన నిఘా కూడా పెడతామన్నారు. 

సచివాయలంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెట్, ప్రైవేట్, రెసిడెన్షియల్, వెల్ఫేర్‌ స్కూల్స్, మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్స్, టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఇలా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంట్‌ పరిధిలోకి వచ్చే అన్ని విద్యా సంస్థలు మార్చి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించామన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా సెలవులు ప్రకటించడం జరిగిందని వివరించారు.  

జీఓ నంబర్‌ 37 ద్వారా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి రాష్ట్ర పరిధిలోని అన్ని యూనివర్సిటీలు, యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలు, ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, లాæఅన్ని విద్యా సంస్థలకు మార్చి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించామన్నారు. ప్రైవేట్‌ యూనివర్సిటీలు కూడా ఈ జీఓ పరిధిలోకి వస్తాయని గుర్తుచేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్ర విద్యా సంస్థలను కూడా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. బోర్డు అండ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌కు గతంలోనే నోటిఫికేషన్‌ ఇవ్వడం వల్ల ఆ పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. ఆ యొక్క రెసిడెన్షియల్‌ హాస్టల్స్‌ కొనసాగుతాయని, పరీక్షలు ముగిసిన తరువాత సెలవులు ప్రకటిస్తామన్నారు. 

పదో తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని మంత్రి సురేష్‌ వివరించారు. సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌కు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని హెల్త్‌ డిపార్టుమెంట్‌ జీఓ నంబర్‌ 202 ద్వారా ఆదేశాలు జారీ చేసిందన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు జ్వరం, జలుబు, దగ్గు ఉంటే ప్రత్యేకమైన రూమ్‌లలో కూర్చోబెట్టి పరీక్షలు రాయించాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. పరీక్షలు రాసే విద్యార్థి, విద్యార్థికి మధ్య మూడున్నర అడుగుల దూరంతో సీటింగ్‌ అరెంజ్‌మెంట్స్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. 

అవసరమైన చోట్ల ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చామని మంత్రి సురేష్‌ చెప్పారు. విద్యార్థులను జాగ్రత్తగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశామని వివరించారు. కరోనా వైరస్‌ ఉధృతిని  మళ్లీ సమీక్షించుకొని ఏ విధంగా ముందుకెళ్లాలో మార్చి 31 తరువాత ప్రకటిస్తామన్నారు.
 

Back to Top