అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నక్క జిత్తులను ప్రయోగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలన్నది ఆయన ప్లాన్ అని మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి సుచరిత గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తుళ్లూరులో నేటి చంద్రబాబు సభకు పోలీసులు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్ రూట్‌ను కూడా పోలీసులకు ఇచ్చారని, ఆ రూట్లో పోలీసులు అన్ని రకాలుగా నిన్ననే భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు. ఇప్పుడు ఆకస్మికంగా చంద్రబాబు తన రూట్‌ను మార్చుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు మద్దుతుగా కార్యక్రమాలు చేస్తున్న వారి వైపుగా తాను వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీని ద్వారా ఘర్షణలు జరగాలని, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించాలనేది చంద్రబాబు ఉద్దేశమని అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండకూడదని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలను అందరూ ఖండించాలని సూచించారు. చంద్రబాబు ముందు తన విషపు ఆలోచనలను విడిచిపెట్టాలని, శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులకు సహకరించాలని కోరారు.