అక్టోబ‌ర్‌లో ఐదు స్కిల్‌డెవ‌ల‌ప్‌మెంట్ కాలేజీల ప్రారంభం

ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి వెల్ల‌డి

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి: ఈ ఏడాది అక్టోబర్‌లో ఐదు స్కిల్‌డెవ‌ల‌ప్‌మెంట్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు ఐటీ శాఖ మం‍త్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ అధికారులతో మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్టోబర్‌లో 5 నైపుణ్య కళాశాలను లాంఛనంగా ప్రారంభించడమే లక్ష్యమని తెలిపారు. చదువు విలువను ప్రపంచానికి చాటిన గాంధీ జయంతి రోజు 4 స్కిల్‌ కాలేజీల ప్రారంభానికి శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా కడప, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో స్కిల్‌ కాలేజీల ప్రారంభోత్సవం ఉంటుంద‌న్నారు. వచ్చే ఏడాది జనవరిలో కొత్తగా మరో 25 స్కిల్‌ కాలేజీల ప్రారంభానికి సన్నద్ధం కావాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనుకున్నసమయానికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాల‌ని సూచించారు.

30 స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ కాలేజీల పర్యవేక్షణకు 'ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్'ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి తెలిపారు. అక్టోబర్‌లో ప్రారంభించే 5 కాలేజీలు పూర్తయ్యాయని ప్రస్తుతం కాలేజీల డిజైన్లు, లేఔట్లకు తుది మెరుగులుదిద్దుతున్నట్లు చెప్పారు. స్కిల్ కాలేజీ ఆకృతులు, సైట్లకు సంబంధించిన వ్యవహారాలను పరిశీలించేందుకు ప్రత్యేక ఆర్కిటెక్‌ బృందం కూడా పర్యటించనుందని వెల్లడించారు. ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా సీఎస్ఆర్ నిధుల సమీకరణపై మరింత దృష్టిసారించాని సూచించారు. ఇందుకోసం త్వరలో స్కిల్‌కు సంబంధించిన కోర్సులు, కరికులమ్‌లపై హైనెట్వర్క్ ఇండస్ట్రీస్ వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా చెప్పారు. కొత్త కోర్సులు, ప్రాధాన్యత రంగాలపై టాప్ కంపెనీల నిపుణులు, విద్యావేత్తలతో చర్చించిన తర్వాత ఆమోదించనున్నామన్నారు. పరిశ్రమలకు అవసరమైన కోర్సులు, మానవవనరుల వివరాలపై  సర్వేకు కూడా నైపుణ్యశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇప్పటికే కీలక రంగాలలో యువతకు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలుండే 20 కోర్సులపై అధ్యయనం చేశామని, ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి హై లెవల్ కమిటీ, ఐఎస్‌బీ ఆధ్వర్యంలో శిక్షణ క్లాసులు నిర్వహించనున్నట్లను పేర్కొన్నారు.

Back to Top