ఉత్తరాంధ్ర చర్చా వేదికలో రాజధాని ప్రస్తావన లేదు

మంత్రి గుడివాడ అమర్నాథ్‌

విశాఖ: ఉత్తరాంధ్ర చర్చా వేదికలో రాజధాని ప్రస్తావన లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. ప్రభుత్వంపై విమర్శలకే నేతలు పరిమితమయ్యారని తప్పుపట్టారు. శనివారం మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర చర్చా  వేదికలో ఉత్తరాంధ్రుల ఆకాంక్షలపై చర్చ జరగకపోవడం దురదృష్టకరమన్నారు. కోల్డ్‌ స్టోరేజ్‌ నేతలంతా చేరి ప్రభుత్వంపై విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబును సీఎం చేయాలన్నదే వీళ్లకు ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కొణతల రామకృష్ణ టీడీపీ తరఫున పని చేస్తున్నారని విమర్శించారు. విశాఖలో వేల కోట్ల విలువైన భూములను మా ప్రభుత్వమే కాపాడిందని గుర్తు చేశారు. ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్‌ వన్‌లో రోడ్‌షోలు వద్దని ఎక్కడా చెప్పలేదన్నారు. బహిరంగ సభలు రోడ్డుపై పెట్టొద్దని మాత్రమే నిబంధన పెట్టామని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు.

 సదస్సులో ఎవరు పాల్గొన్నారు?:
    ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట కొంత మంది కోల్డ్‌ స్టోరేజీ లీడర్లు, డార్క్‌ రూమ్‌ లీడర్లు కలిసి ఓ సదస్సు నిర్వహించారు. దాదాపుగా మూడున్నర దశాబ్ధాలుగా ఈ ప్రాంతాల్లో రాజకీయాల్లో ఉండి, అనేక పదవులు అనుభవించిన వారే అందులో పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడిన వారిలో ఉత్తరాంధ్ర ప్రాంతం వారి కంటే బయటి వారే ఎక్కువగా ఉన్నారు.

ఎవరి కోసం చర్చావేదిక సదస్సు?:
    ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అంటూ చంద్రబాబు చుట్టాలను, ఆయనతో కలిసి పోటీ చేయాలని తహతహలాడుతున్న వారందరినీ పిలిపించుకుని చర్చా వేదిక పేరిట సదస్సు పెట్టారు. నిజానికి విశాఖలో రాజధానిపై సదస్సులో మొదటి తీర్మానం చేస్తారని ఆశించాం. కానీ సదస్సులో ఎక్కడా విశాఖ రాజధాని గురించి, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష గురించి ప్రస్తావన లేదు. అంతా ప్రభుత్వంపై రాజకీయపరమైన విమర్శలే. 
    సభాధ్యక్షత వహించిన కొణతాల రామకృష్ణ నుంచి, తాగుబోతు అయ్యన్న, సహ జీవనం చేస్తున్న నాదెండ్ల మనోహర్, అసలు ఉందో లేదో తెలియని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రుద్రరాజు, చంద్రబాబునాయుడు పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ.. అందరూ తమకు ఉత్తరాంధ్రపై ఎంతో ప్రేమ పుట్టినట్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కానీ వారి ఉద్దేశం, లక్ష్యం ఒక్కటే. ఏదో ఒక విధంగా చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే. 
    సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నేతృత్వంలో రాజధాని కాబోతున్న ఉత్తరాంధ్రలో ఎక్కడ మన మనుగడ ఉండదో అని భయంతోనే ఇవన్నీ చేస్తున్నారు. టీడీపీ, ఇతర రాజకీయ పార్టీల విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. అందుకే తటస్తుల (న్యూట్రల్‌) ముసుగులో ఇలాంటి వేదికలు ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల సమయంలో, టీడీపీ కండువా వేసుకోకపోయినా కొణతాల రామకృష్ణ ఆ పార్టీకి ప్రచారం చేశారు.

యాక్టింగ్‌ అయ్యన్న:
    అక్కడ చంద్రన్న.. ఇక్కడ అయ్యన్న యాక్టింగ్‌. అయ్యన్నపాత్రుడు ఈ ప్రాంతం గురించి ఏడ్చినట్లు కొన్ని టీవీలు చూపిస్తున్నాయి. కానీ అది నిజం కాదు. ఎక్కువగా తాగడం, మాట్లాడడం వల్ల ఆయన కంటికి ఏదో సమస్య వచ్చినట్లుంది. అంతే తప్ప ఆయన ఏనాడూ దోచుకోవడం తప్ప, ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఆలోచించలేదు. ఏ మాత్రం పని చేయలేదు.

మీరు దోచారు. మేము స్వాధీనం చేసుకుంటున్నాం:
    45 వేల కోట్ల విలువైన ప్రైవేటు భూములు దోచేశారని అయ్యన్న ఆరోపిస్తున్నాడు. అయితే ఎక్కడైనా, ఏ ఒక్కరైనా వచ్చి మాపై ఫిర్యాదు చేశారా? ఎందుకా పిచ్చి ఆరోపణలు. విమర్శలు. 
    నిజానికి ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు దోచుకున్నారు. ఆ ఆధారాలు దొరక్కుంగా, హుద్‌హుద్‌ తుపాన్‌ పేరుతో రికార్డులన్నీ మాయం చేశారు. తుపాన్‌లో రికార్డులన్నీ ధ్వంసం అయ్యాయని ఆరోజు మీ గజిట్‌ పేపర్లే రాశాయి.
గీతం వర్సిటీ మీ పార్టీ నాయకుడిది కాదా? ఇప్పుడు మా ప్రభుత్వం ఆ భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. దాదాపు రూ.4 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకునే కార్యక్రమం చేపట్టాం.

ఏం అభివృద్ధి చేశారో చెప్పండి?:
    14 ఏళ్లు ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన దగ్గర అనే దఫాలు అత్యధిక కాలం అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్నాడు. మరి మీరూ, చంద్రబాబూ కలిసి ఈ ప్రాంతానికి ఏం చేశారో ఒక్కటైనా చెప్పండి. ఆనాడు మహానేత రాజశేఖరరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి హెల్త్‌ సిటీ వచ్చింది. కొత్తగా రోడ్ల నిర్మాణం జరిగింది. 
    ఇప్పుడు ఉత్తరాంధ్రలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో సీఎం వైయస్‌ జగన్, ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. కానీ అవేవీ వారి కళ్లకు కనిపించవు.

చంద్రబాబు మొసలి కన్నీరు:
    బాక్సైట్‌ తవ్వకాలపై ఆరోజు జీవో ఇచ్చింది చంద్రబాబే. ఈ విషయం అందరికీ తెలుసు. మళ్లీ అదే చంద్రబాబు ఇవాళ గిరిజనులను కాపాడటానికి అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. అప్పట్లో జగన్‌గారు చింతపల్లి వచ్చి సభ పెట్టి జీవో రద్దు కోసం పోరాటం చేశారు. తాను అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేశారు.

వారు ఏనాడూ ఆలోచించలేదు:
    ఏ రోజన్నా తెలుగుదేశం నేతలు వెనుకబడిన ఉత్తరాంధ్ర గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. విభజన చట్టంలో ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాలకు బ్యాక్‌వర్డ్‌ రీజియన్‌ డెవలెప్‌మెంట్‌ ఫండ్‌ కింద జిల్లాకు రూ.20 కోట్లు చొప్పున మొత్తం రూ.350 కోట్లు ఇస్తే ఆ డబ్బును ఏం చేశావో సమాధానం లేదు. అలా వచ్చిన డబ్బును చంద్రబాబు అమరావతిలో పెట్టాడు..అక్కడ తాత్కాలిక భవనాలు కట్టడానికి ఆ డబ్బు ఖర్చు చేశాడు.
మూడో సారి వెనుకబడిన ప్రాంతాల డబ్బు అడిగితే కేంద్రం ఇంతకు ముందు ఇచ్చిన డబ్బు నువ్వెక్క డ ఖర్చు పెట్టావో లెక్క చూపమని అడిగింది.

హోదా ఎవరు తాకట్టు పెట్టారు?:
    రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది మీ ఫ్రెండేగా సీపీఐ రామకృష్ణా?. ఆరోజు సుజనా చౌదరి, సిఎం రమేష్‌ లాంటి పెద్దమనుషులను పంపిన చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టించారు. అందుకే ఈ ప్రాంతం, ఇక్కడి వారి మనోభావాలు తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడటం సరి కాదు.
    జీ20 సదస్సులు, గోబల్‌ ఇన్వెస్ట్‌మెంటు సమ్మిట్లు అన్నీ ఇక్కడకు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలి. ఉత్తరాంధ్ర, విశాఖను మేము అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టాం కాబట్టే అవన్నీ వస్తున్నాయి.

మాయా కూటమి:
    వీళ్లకు కళ్లెదుట చంద్రబాబు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. వీళ్లంతా మరో మహాకూటమిలా తయారయ్యారు. రాష్ట్ర ప్రజలను మాయ చేయాలని ఆ కూటమి చూస్తోంది. ఇవాళ సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్, జనసేన, సీపీఐ నేతలంతా చంద్రబాబునాయుడి ఫ్రెండ్సే. ఇక చర్చావేదిక పేరుతో సదస్సు పెట్టిన కొణతాల రామకృష్ణ.. చంద్రబాబుకు బ్యాక్‌డోర్, డార్క్‌ రూమ్‌ ఫ్రెండ్‌.
    2015లో కొణతాల పాదయాత్ర చేశారు. అప్పుడు చంద్రబాబుపై ఎన్నో విమర్శలు చేసిన ఆయన 2019లో ఎందుకు తెలుగుదేశం జెండా పట్టుకున్నారో సమాధానం చెప్పాలి.

అదే మీ ప్రయత్నం:
    చర్చావేదిక సదస్సులో పాల్గొన్న వారిలో ఎవరికైనా అసలు ఉత్తరాంధ్రపై అవగాహన ఉందా?. మీ ఎజెండా అంతా సీక్రెట్‌. చంద్రబాబును జాకీలు పెట్టి లేపాలన్నదే మీ ప్రయత్నం.
    మీ రాజకీయ ప్రయోజనాల కోసం, ఎవరినో అధికారంలో కూర్చోబెట్టడం కోసం ఇలాంటివి పెడితే మీకున్న విలువ కూడా పోతుంది. నోరుంది కదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ ప్రాంతం బ్రాండ్‌ ఇమేజ్‌ని వారే దెబ్బ తీస్తున్నారనేది కూడా వాళ్లు తెలుసుకోవాలి. అసలు విశాఖ రాజధాని అవుతుందనే అంశాన్ని స్వాగతిస్తున్నాం అని అక్కడకి వచ్చిన వారు ఎవరైనా అన్నారా?

ఎనీ టైం విశాఖ నుంచి..:
    ఎప్పుడైనా.. ఎనీ టైం విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయాలంటే ఏ బిల్లూ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలని ఉత్తరాంధ్ర వాసులు కోరుకుంటున్నారు. వాళ్ల పేపర్లు, టీవీలు చూడటానికి ఇక్కడి ప్రజలు కావాలి కానీ, వాళ్లెవరూ ఇక్కడ మాత్రం ఉండరు. ఏప్రిల్‌ 1 తర్వాత ఎప్పుడైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవుతుంది.

ఆ రక్తపు మరకలు చెరపడానికే..:
    తన పబ్లిసిటీ పిచ్చి కోసం రెండు ఘటనల్లో 11 మంది ప్రాణాలు బలిగొన్న చంద్రబాబు చేసిన రక్తపు మరకలు చెరపడానికే ప్రభుత్వం జీఓ నెం:1 జారీ చేసింది. అందులో ఎక్కడా రోడ్‌షోలు, ర్యాలీల ప్రస్తావన లేదు. రహదారులు, వాటి పక్కన, మార్జిన్లలో బహిరంగ సభలు, సమావేశాలు నిషేధిస్తూ జీఓ జారీ చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాటికి అనుమతి ఇవ్వొచ్చని జీఓలో నిర్దేశించారు. 

మీకూ అనుమతి ఇస్తారు:
    మీరు బహిరంగ సభలు పెట్టుకుంటే అనుమతులు ఇస్తారు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా సభలు పెట్టుకోండి. నిన్నటికి నిన్న ఒంగోలులో బాలకృష్ణ సినిమా ఈవెంట్‌కి కూడా అనుమతి ఇచ్చారు. ఏ జీఓ కూడా ఓ పార్టీకి సంబంధించి ఉండదు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అయినా అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

 

Back to Top