తిరుపతి : కుప్పంలో తెలుగుదేశం పార్టీకి, అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ కార్యకర్తలు మరోసారి షాక్ ఇచ్చారు. వందమందికిపైగా నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో తిరుపతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైయస్ఆర్‌సీపీలో చేరారు. కుప్పం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ భరత్ నేతృత్వంలో గుడిపల్లి మండలంలోని అగరం, కుప్పిగానిపల్లి, పోగురుపల్లి, గుండ్లసాగరం, కనమనపల్లి, ఓఎన్ కొత్తూరు పంచాయతీల్లోని టీడీనీ క్రియాశీలక కార్యకర్తలు పార్టీ సభ్యత్వ కార్డులు సైతం తీసుకొచ్చి మరీ వైయస్ఆర్‌సీపీలో చేరారు. వారిలో మాజీ సర్పంచ్ వెంకటేష్, నేతలు సి.బి.సుబ్రమని, యల్లప్ప, సంపంగి తదితరులున్నారు. బాబు ఓటమి తథ్యం: మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలకతీతంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సుపరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి.. టీడీపీ శ్రేణులు వైయస్ఆర్‌సీపీకి ఆకర్షితులయ్యారని చెప్పారు. ఈ మూడేళ్లలో కుప్పంలో జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లోను టీడీపీకి ఘోర పరాభవం, వైయస్ఆర్‌సీపీకి అఖండ విజయం కలిగాయని గుర్తుచేశారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందని, రానున్న రోజుల్లో కుప్పంలో మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పారు. కుప్పంలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమని, 2024లో బాబు ఓటమి తథ్యమని పేర్కొన్నారు.