చిరు వ్యాపారుల జీవ‌నోపాధికి అండ‌గా ‘జగనన్న తోడు’

 జగనన్న తోడు ఆరో విడత కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

 ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.10 వేల ఆర్థికసాయం

3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు

ఇప్పటి వరకు 15,31,347 మందికి రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు

గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌

పూర్తి వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది

రుణాలు పొందిన వారిలో 80 శాతం మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలే

అర్హత ఉండి పథకాన్ని అందుకోనివారు ఉంటే వారికి కూడా లబ్ధి చేకూరుస్తాం

 తాడేపల్లి: చిరు వ్యాపారులు వారి కష్టంపైనే ఆధారపడతారు. పెట్టుబడికి ఇబ్బంది కాకూడదనే జగనన్న తోడు పథకాన్ని తెచ్చామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. చిరు వ్యాపారులు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. రుణాలు పొందిన వారిలో 80 శాతంమంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అన్నారు. ఇప్పటి వరకు 15,31,347 మందికి రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని చెప్పారు. గతంలో వీరి చేయిపట్టుకుని నడిపించే పరిస్థితి లేదు. వార్డుల్లో , గ్రామాల సచివాలయాల్లో వాలంటీర్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు వీరికి తోడుగా నిలబడుతున్నారు. లబ్ధిదారులను గుర్తించండం దగ్గర నుంచి, వీరి దరఖాస్తులు తీసుకోవడం దగ్గరనుంచి, బ్యాంకులతో మమేకం కావడం, రాష్ట్రస్థాయిలో బ్యాంకర్లతో మాట్లాడ్డం, వారిని ఒప్పించడం, పారదర్శక విధానంలో లబ్ధిదారులను గుర్తించాం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని వడ్డీ చెల్లించే బాధ్యత తీసుకుంటూ... నమ్మకం కలిగింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం జగనన్న తోడు ఆరో విడత కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు.

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమన్నారంటే.. 

3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగేలా.. ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో చిరువ్యపారాలు చేసుకుంటున్న మరో 3.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మంచి చేస్తూ వాళ్లందరి చిరు వ్యాపారాలకు తోడుగా ఉంటూ.. రూ.10 వేలు వడ్డీలేకుండా రుణాలిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 3.95 లక్షల మందిలో 3.67లక్షల మంది సకాలంలో రుణాలు చెల్లించి, మరలా రెండోసారి రుణాలు తీసుకుంటున్నారు. వీరు కాక మరలా కొత్తగా 28 వేల మందికి ఇవాళ రుణాలు ఇస్తూ కొత్తగా ఈ పథకంలో తీసుకొచ్చాం. మొత్తమ్మీద ఈ జగనన్న తోడు ద్వారా ఈ రోజు లబ్ధి పొందుతున్న 3.95 లక్షల మందిని కలుపుకుంటే దాదాపుగా 15.31 లక్షల చిరు వ్యాపారుల కుటుంబాలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. 
వీరికి మంచి చేసేందుకు, వాళ్లు వ్యాపారాలు కోసం ఏ ఒక్కరిమీదా ఆధారపడాల్సిన అవసరం లేకుండా వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండా వారికి  వడ్డీ లేకుండా రూ.10వేలు అందించే కార్యక్రమానికి అడుగులు పడుతున్నాయి.

స్వయం ఉపాధితో సమాజ మేలు...
వీరంతా వాళ్లంతట వారే ఉపాధి కల్పించుకోవడమే కాకుండా సమాజానికి కూడా గొప్ప మేలు చేస్తున్నారు. వీళ్లంతా స్వయం ఉపాధి పొందుతున్న వర్గానికి చెందినవాళ్లు. వాళ్ల కష్టం మీదే ఆధారపడుతున్నారు. ఎవరిమీదా ఆధారపడడ్డం లేదు. పెట్టుబడి సాయం కింద మనం వాళ్ల వ్యాపారం  కోసం రూ.10వేలు సాయం చేస్తున్నాం. వాళ్లు మరొక్కరి దగ్గర కొనుగోలు చేసి మన దగ్గరికి వచ్చి అమ్మకం చేసి తద్వారా వాళ్ల బ్రతుకు బ్రతకడమే కాకుండా.. స్వయం ఉపాధి రంగానికి గొప్ప మార్పు తీసుకొచ్చి నిలబెడుతున్నారు.


ప్రభుత్వ గ్యారంటీతో రూ.10వేలు రుణం...
 పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద కూరగాయలు, పండ్లు, వస్తువులు, ఆహారపదార్ధాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్డు పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు,  గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారితో పాటు చేనేతలు, సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పనిమీద బ్రతికేవారు, బొబ్బిలి వీణ వంటివి తయారుచేసేవారు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కళంకారీ, తోలు బొమ్మలు, లేస్‌ వర్కర్స్‌ అందరికీ ఈ రోజు సున్నావడ్డీ పథకం కింద రూ.10 వేలు బ్యాంకుల నుంచి ఎలాంటి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులను ఒప్పించి వారికి రూ.10వేలు వడ్డీ లేకుండా ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. వారి వడ్డీని కట్టే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. ఈ రుణాలు సకాలంలో చెల్లిస్తే మళ్లీ బ్యాంకులు వారికి తిరిగి రుణాలిచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. 

పాదయాత్రలో వీరి కష్టాలు, బాధలు చూసి...
ఈ పథకం ఎందుకు పెట్టామో అందిరికీ తెలుసు. నా సుదీర్ఘ పాదయాత్రలో వీరి బాధలు, కష్టాలు నా కళ్లతో చూశాను. ప్రతి చోటాప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ ఇవన్నీ సాధారణంగా కనిపించే విషయాలు. ఇటువంటి చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు పెట్టుబడి చాలా కష్టంగా మారుతున్న పరిస్థితి. రూ.1000 అప్పు కావాలంటే ముందే రూ.100 తీసుకుని కేవలం రూ.900 చేతిలో పెట్టి .. నెలనాటికి మళ్లీ ఆ డబ్బులు కట్టించుకుంటూ.. తిరిగి ఈ చిరువ్యాపారులతోనే వ్యాపారం చేసే అధ్వాన్నమైన పరిస్థితుల్లో సమాజం ఉంది. అలాంటి సమాజంలో మార్పులు తీసుకొచ్చి.. వాళ్ల బాధలకు, ఆ రోజు నేను చూసిన వాళ్ల కష్టాలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలన్న తపన, తాపత్రయంతో ఈ జగనన్న తోడు పథకం తీసుకువచ్చాం.

వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తూ...
అందులో భాగంగా పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ..  సమయానికి రుణాలు కట్టేలా చేస్తుంది. సమయానికి వాళ్లు డబ్బులు కడితే మరలా వారికి ఆ రూ.10 వేలు రుణాలిచ్చే విధంగా బ్యాంకులతో మాట్లాడుతూ..  వారి కట్టిన వడ్డీని మరలా నేరుగా ప్రభుత్వమే తిరిగి చెల్లించే కార్యక్రమానికి జగనన్న తోడు ద్వారా రూపకల్పన చేసాం. వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని, వారికి మంచి జరగాలని ఈ అడుగులు వేశాం.

3.95 లక్షల మందికి రూ.395 కోట్లు రుణాలు...
ఈ రోజు 3.95 లక్షల మంది చిరువ్యాపారాలకు, సాంప్రదాయ చేతివృత్తుల మీద ఆధారపడి బ్రతికే వారికి రూ.10 వేలు చొప్పున రూ.395 కోట్లు వడ్డీ లేని రుణాలు అందిస్తునాం. 
ఇది కాక గత 6 నెలలకు సంబంధించి రూ.15.17 కోట్ల వడ్డీని వారు కట్టింది తిరిగి రీయింబర్స్‌మెంట్‌ కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.

నేడు అందిస్తున్న రూ.395 కోట్ల రుణంతో కలుపుకుంటే ఇప్పటివరకు 15,31,347 మంది చిరువ్యాపారులుకు అందించిన వడ్డీ లేని రుణం. రూ.2406 కోట్లు. 

వీరిలో ఇప్పటికే ఏడాది సైకిల్‌... అంటే ఒకసారి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, బ్యాంకులకు కట్టి మరలా రెండోసారి రుణాలు పొందిన వారు 8,74,745 లక్షల మంది ఉన్నారు. ఒక సైకిల్‌ ప్రారంభమైంది. 15.31 లక్షల మందిలో 8.74 లక్షల మంది సైకిల్‌ పూర్తి చేసుకుని బ్యాంకులతో భేష్‌ అనిపించుకుని మరలా రుణాలు పొందారు. 

దేశ చరిత్రలో ఇదొక గొప్ప రికార్డు.. 
మొత్తం భారతదేశంలో 39.21 లక్షల రుణాలిస్తే.. అందులో మన రాష్ట్రంలోనే 24.06 లక్షల రుణాలు ఇచ్చాం. ఇదో గొప్ప కార్యక్రం. రూ.2406 కోట్లు రుణాలు ఇవ్వగలిగాం. ఇందులో యునిక్‌ బెనిఫిషియర్స్‌ 15,31,347 మంది ఉన్నారు. దేశంలోనే ఇదొక రికార్డు. 

ఇందులో ఇంకా సంతోషం కలిగించే విషయం ఏమిటంటే.. ఈ రుణాలు పొందిన వారిలో దాదాపు 80 శాతం మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలే ఉన్నారు. వీరంతా అట్టడుగు పరిస్థితుల్లో ఉన్నారు. బ్యాంకుల్లో ఎటువంటి గ్యారంటీ లేకుండా వీరికి ఎవరికీ కూడా రుణాలిచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు మారుస్తూ...  వీరి జీవితాలు మార్చాలని... దాదాపు 15.31 లక్షల కుటుంబాలకు ఈ మేలు చేయగలిగాం.

వడ్డీ లేని రుణాలు– నిరంతర ప్రక్రియ
6 నెలలకొకమారు వడ్డీ లేని రుణాలిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రుణాలు తీసుకుని సకాలంలో వడ్డీలు కట్టిన వారికి మరలా వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ చేయడంతో పాటు, కొత్త వారికి కూడా రుణాలిప్పించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇదొక నిరంతర ప్రక్రియ.  నవంబరు 2020లో ఈ దిశగా మొట్టమొదటిసారి అడుగులు పడ్డాయి. ప్రస్తుతం 6వ దశ కార్యక్రమం జరుగుతుంది. సకాలంలో వడ్డీ కట్టిన వారికి తిరిగి వెనక్కి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇచ్చే రూ.15.17 కోట్ల వడ్డీతో కలుపుకుని, సకాలంలో రుణాలు చెల్లించిన వారు 13.28 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున రూ.63.65 కోట్లు చెల్లించాం. 

వ్యవస్ధలో గొప్ప మార్పు దిశగా...
ఎవరకి అవసరం అయితే వాళ్లు రుణాలు తీసుకుంటున్నారు. మరలా చెల్లిస్తున్నారు. వాళ్లకు సహాయంగా బ్యాంకులు తిరిగి రుణాలు ఇస్తున్నారు. వాళ్లు కట్టిన వడ్డీని ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి వెనక్కి తిరిగి ఇస్తుంది. వ్యవస్ధలో గొప్ప మార్పు కనిపిస్తోంది. 
చిరు వ్యాపారం చేసుకుంటున్న ప్రతి అక్కకూ చెల్లెమ్మకు, తమ్ముడికీ ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం ద్వారా కొన్ని విషయాలు చెప్పాలి. అర్హత ఉండి కూడా పొరపాటున ఎవరైనా  ఈ పథకాన్ని అందుకోలేకపోయిన పరిస్థితులు ఉంటే ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. వారందరూ గ్రామ సచివాలయంలోకి వెళ్లి దరఖాస్తు చేసినా, వాలంటీర్‌కు చెప్పడంతో పాటు 1902 నెంబరుకు ఫోన్‌ చేస్తే చాలు.. వాళ్లతో దరఖాస్తు నింపించడం మొదలు బ్యాంకులతో టైఅప్‌ చేయించి వాళ్ల వ్యాపారాలకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించే కార్యక్రమం ప్రభుత్వం దగ్గరుండి చేస్తుంది. ఇది నిరంతరం జరుగుతుంది.
 
ఇంకా ఎవరికైనా అందని పరిస్థితి ఉంటే ఈ పథకం గురించి అవగాహన కల్పించి, ఈ కార్యక్రమాన్ని వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకునిరావాలని మనవి చేస్తున్నాను. 
వీరందరికీ మంచి చేసే ఈ కార్యక్రమం క్రమశిక్షణతో కూడినది. సకాలంలో డబ్బులు కడుతున్నవారి కోసం ఒక బ్యాంకును రెండు సచివాలయాలకు టైఅప్‌ చేశాం. ఈ రెండు సచివాలయాల్లో ఉన్న సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులగా ఉంటూ పనిచేస్తారు. ఎవరైనా సక్రమంగా రుణాలు చెల్లించకలేకపోతే.. మిగిలినవారి మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి.. సకాలంలో చెల్లించాలి. 

మరోవైపు ఈ ఏడాది సకాలంలో రుణాలు కడితే రూ.10 వేల నుంచి మరో వేయి రూపాయలు పెంచి రూ.11వేలు, రూ.11 వేల నుంచి రూ.1000 పెంచి రూ.12000 అందించే కార్యక్రమం చేస్తూ.. రూ13వేలు వరకు ఇచ్చేలా బ్యాంకులను ఒప్పించాం. 

వీళ్లందరికీ జగనన్న తోడుతో పాటు ఆసరా, చేయూత, సున్నావడ్డీ, ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం, విద్యాదీవెన, విద్యా కానుక, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ ,ఆరోగ్య ఆసరా, రైతు భరోసా అన్ని పథకాలతో మంచి జరుగుతుంది. 

వీరి జీవన ప్రమాణాలు మారాలి....
రాబోయే రోజుల్లో వీరందరికీ మంచి జరగాలి. వీరి జీవన ప్రమాణాలు మారాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్ల నిలబడే పరిస్థితి రావాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం ప్రసంగం  ముగించారు. 

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు,  పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఇతర ఉన్నతాధికారులు, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ (ఏపీ) నవనీత్‌ కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Back to Top