హక్కులను కాపాడుకుంటే దండయాత్ర ఎలా అవుతుంది..?

నాగార్జున సాగ‌ర్‌పై ఏపీ చ‌ర్య న్యాయ‌మైన‌ది, ధ‌ర్మ‌మైన‌ది

సాగర్ డ్యామ్ విషయంలో బాబు చేసిన తప్పును మేం సరిదిద్దాం

ఏపీ వాటాకు మించి ఒక్క నీటి బొట్టును కూడా వాడుకోం..

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వైరుధ్యం సృష్టించేలా ఎల్లో మీడియా త‌ప్పుడు రాత‌లు

తెలంగాణలో ఏ పార్టీని ఓడించాల్సిన అవ‌స‌రం మాకు లేదు

తెలంగాణ‌లో ఏ ప్ర‌భుత్వమున్నా.. ఆ ప్ర‌భుత్వంతో స‌త్సంబంధాలు ఉంటాయి

మన భూభాగంలోకి మన పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది..?

ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కొని మ‌న‌ హక్కులను చంద్రబాబు తెలంగాణకు ధారపోశారు

పురంధేశ్వరి ఆంధ్రా హక్కులను నీరు గార్చేలా మాట్లాడటం దారుణం

ఇరిగేష‌న్ శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు ధ్వ‌జం

తాడేప‌ల్లి: తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వైరుధ్యాన్ని సృష్టించేందుకు కొన్ని ప‌త్రిక‌లు త‌ప్పుడు రాత‌లు రాస్తున్నాయ‌ని, నాగార్జున సాగ‌ర్‌పై ఏపీ పోలీసుల దండయాత్ర అని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఇరిగేష‌న్ శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు ధ్వ‌జ‌మెత్తారు. రెచ్చ‌గొట్టి గంద‌ర‌గోళాన్ని సృష్టించే ప్ర‌య‌త్నాల‌ను మానుకోవాల‌ని సూచించారు. నాగార్జున సాగ‌ర్‌పై ఏపీ ప్ర‌భుత్వ చ‌ర్య న్యాయ‌మైన‌ద‌ని, రాష్ట్ర హ‌క్కును కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశామ‌న్నారు. సాగ‌ర్ కుడి కెనాల్‌ను కూడా తెలంగాణ ఆప‌రేట్ చేయ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌న్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అంబ‌టి రాంబాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి రాజకీయపరమైన ముడిపెట్టడం తగదన్నారు. తెలంగాణ‌లో ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయ‌న్నారు. తెలంగాణలో వైయ‌స్ఆర్ సీపీ లేదని,  అక్కడ పోటీ చేయలేదని, అలాంటప్పుడు ఏపార్టీని ఓడించాల్సిన అవసరం త‌మ‌కు ఉండదన్నారు. ఏపీ వాటాకు మించి ఒక్క నీటి బొట్టును కూడా వాడుకోబోమ‌ని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

మంత్రి అంబ‌టి ఇంకా ఏమ‌న్నారంటే..

నాగార్జునసాగర్ డ్యామ్ కు సంబంధించి, మన భూభాగంలో ఉన్న, మన హక్కు ప్రకారం 13 వ గేటు వరకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే,  "తెలంగాణ ఎన్నికల సమయంలో అక్కడ ఏదో ఒక రాజకీయ పార్టీకి సహాయం చేయడం కోసమని, దానివల్ల ఆ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరుతుంది..అందుకే ప్రభుత్వం  ఈ చర్య చేపట్టింది.." అనే మాటలు కొంతమంది విపక్షాలు మాట్లాడాయి. మరికొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోజునే ఎందుకు ఈ చర్యకు దిగారు.. పోలీసు బలగాలు అన్నీ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉంటాయి కాబట్టి, దాన్ని అదనుగా చేసుకుని ఈ పని చేసిందని అక్కడక్కడా వినిపిస్తున్న మాటలు. వీటన్నింటికీ సమాధానం చెప్పేందుకు, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు వాస్తవాలను విశదీకరించేందుకే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. 

మీడియాపరంగా చూస్తే.. మరో అడుగు ముందుకు వేసి, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కొన్ని పత్రికలు, టీవీ చానళ్ళు.. ఇదేదో మన ప్రభుత్వం చేసిన దండయాత్ర అని, హల్ ఛల్ అని, సాగర్ మీద ఘర్షణ అని.. ఇప్పుడే ఎందుకీ దండయాత్ర అని రామోజీరావు , సాగర్ పై ఏపీ పోలీసులు దండయాత్ర, టీ-పోలింగ్ ముందు వైయ‌స్ జగన్ హైడ్రామా.. సెంటిమెంటు కోసం జలనాటకం.. అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఇలా ఎవరికివారు  ఇష్టం వచ్చినట్టు వార్తలు రాశారు. వారి టీవీలు కూడా అదే కూస్తున్నాయి. ఇంకా రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవాలను ఈ రాష్ట్రంతోపాటు, తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వంగా,  మేము నిన్న చేపట్టిన చర్య ముమ్మాటికీ న్యాయమైనది, ధర్మమైనది, మేము తీసుకున్న చర్యను  ఎవరూ తప్పుబట్టలేరు. 

తెలుగు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు కృష్ణా జలాలను విభజించడం జరిగింది. మనకు ప్రధాన ప్రాజెక్టులు అయిన నాగార్జున సాగర్, శ్రీశైలం విడిపోయాక కూడా ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి. దీనిమీద కేంద్రం కృష్ణా రివర్ మేనేజ్ మెంటు బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రం... సాగర్ ను తామే పర్యవేక్షిస్తామని, తమ నియంత్రణలోకి తీసుకుంటామని చెబితే ఏపీ ప్రభుత్వం అంగీకరించింది, కానీ ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. ఇదే విషయాన్ని నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వివరించారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అతి సున్నితమైన అంశం. మేము ఏరకమైన తప్పు చేయలేదు. మా హక్కును కాపాడుకోవాలనే ప్రయత్నం మేము చేశాం. 

మన హక్కును కాపాడుకుంటే దండయాత్ర అంటారా..?
రాష్ట్రం కోసం పనిచేస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ, నిత్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బురదజల్లే.. ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు, న్యాయపరమైన మన హక్కును మనం సాధించుకున్నప్పటికీ.. యథావిధిగా మనపై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన తప్పును మేము సరిదిద్దితే... రామోజీ, రాధాకృష్ణలు సాగర్ మీదకు దండయాత్ర చేస్తున్నామని రాతలు రాస్తారా..? 

నాగార్జున సాగర్ డ్యామ్ స్ట్రక్చర్, భూభాగం, నీటి హక్కులకు సంబంధించిన అంశాలను మంత్రి అంబటి రాంబాబు  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విభజన చట్టం ప్రకారం సాగర్ లో మన వాటా ఏంటంటే.. మొత్తం 26 గేట్లల్లో, మన రాష్ట్రానికి 13 గేట్లు.. తెలంగాణ వారికి 13 గేట్లు ఉంటాయి. సాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు నీరు విడుదల చేస్తాం. 

తెలంగాణ ప్రభుత్వం, సాగర్ డ్యామ్ - మొత్తం 26 గేట్లను స్వాధీనం చేసుకుని, ఏపీ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తున్నారు. చట్ట ప్రకారంగానీ, ధర్మం ప్రకారంగానీ మన భూభాగంలో ఉన్న గేట్లు, హక్కులు తెలంగాణ  ప్రభుత్వం స్వాధీనంలో ఉండటానికి వీల్లేదు. మన భూభాగంలోకి మన ప్రజలు, మన పోలీసులు వెళితే.. దండయాత్ర ఎలా అవుతుందో చెప్పండి అని రామోజీ, రాధాకృష్ణలను అడుగుతున్నాను. మా హక్కులను కాపాడుకోవడానికి,  మీ పర్మిషన్  అవసరం లేదంటే అది దండయాత్ర అవుతుందా..?, ఇదేనా మీ జర్నలిజం..? దీనిని ఆంధ్రప్రదేశ్ పై ప్రేమ అంటారా.. లేక కక్ష అంటారా?. పొరుగు రాష్ట్రంలో ఉంటూ.. మా రాష్ట్రంపై నిత్యం విషం చిమ్ముతారా..? 

మేము తెలంగాణ భూభాగంలోకి వెళితే  అది తప్పు అవుతుందికానీ, మన భూభాగంలోకి మనం వెళితే ఎలా తప్పు అవుతుందో వారే చెప్పాలి.. ? మన హక్కు ప్రకారం, మన ప్రజలకు తాగు నీటిని ఇవ్వాలంటే.. తెలంగాణ వారి పర్మిషన్ తీసుకోవాలా..?- మా భూభాగంలో ఉన్న మా కెనాల్ ను మేము ఓపెన్ చేయడానికే  ముందుకు వెళ్ళాం.  పిచ్చి రాతలు రాస్తున్న ఎల్లో మీడియా వారి మాటలు నమ్మవద్దు..టీడీపీ హయాంలో మన హక్కుల్ని తెలంగాణకు ధారపోశారు. వాటిని చిత్తశుద్ధితో కాపాడుతూ, మన హక్కుల్ని మనం సాధించుకున్నాం. సాగర్ డ్యామ్ లో 13వ గేటువరకు రాష్ట్ర ప్రజల హక్కు, ఆ గేట్ల గుండా నీటిని విడుదల చేసే హక్కు మన రాష్ట్ర ప్రభుత్వానిది.దీనిని ఎవరూ తప్పుపట్టలేరు.  

బాబు అసమర్థతవల్లే హక్కులు కోల్పోయాం..
గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అసమర్థత వల్లే సాగర్ డ్యామ్ మీద మన హక్కుల్ని కోల్పోయాం. నాడు, తెలుగు ప్రజల హక్కుల్ని కాపాడటంలో చంద్రబాబు పూర్తిగా విఫలం అవ్వటం వల్లే వారు మన ప్రాంతానికి వచ్చారు, మన గేట్లను, మన భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వారి చెక్ పోస్టులను కూడా మన భూభాగంలో పెట్టారు. మన వాళ్ళు డ్యామ్ మీదకు  వెళ్ళాలన్నా తెలంగాణ వారి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితిని తెచ్చారు. దీనిని మార్చేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్య తీసుకున్నాం. సాధించాం. 2015 ఫిబ్రవరి 13న చంద్రబాబు హయాంలో..  సాగర్ నీటిని విడుదల చేయటానికి మన అధికారులను పంపితే.. విడుదల చేయటానికి వీల్లేదని తెలంగాణ వారు అభ్యంతరం పెట్టారు. దాంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య పెద్ద గొడవ జరిగింది. సాగర్ గరం.. గరం.. నీటి యుద్ధం అంటూ పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. చివరికి  గవర్నర్ దగ్గర మొరపెట్టుకుని, తెలంగాణ వారి దయాదాక్షిణ్యాలతో నీరు విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మన నీటిని మనం విడుదల చేసుకోవాలంటే.. తెలంగాణ వారి పర్మిషన్ అవసరామా..? మన రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం.. 2000 క్యూసెక్కుల నీటిని సాగర్ నుంచి నిన్న విడుదల చేశాం. దీనిమీద కొంతమంది దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వాస్తవాలేమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి. కృష్ణా వాటర్ లో 66 శాతం మనది.. 34 శాతం తెలంగాణ వారిది.. దాని ప్రకారం నీటిని పంచుకుంటాం. మా వాటాకు మించి ఒక్క బొట్టును కూడా మేము వాడుకోం. మా వాటా ప్రకారం వాడుకుంటాం. మన వాటా నీటిని వాడుకునేందుకు స్వేచ్ఛ మాకు కావాలి. మా నీటిని మేము వాడుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ వైపున పవర్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఉండటం వల్ల, వారు పరిమితికి మించి నీటిని వాడుకుంటున్నారు. ఇదే విషయాన్ని అనేకమార్పు కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాం. 

మన హక్కుల్ని బాబు తాకట్టు పెట్టాడు..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి, మన రాష్ట్ర హక్కులను తెలంగాణకు ఎందుకు ధారపోశారు అంటే.. ఆయన తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్ల రూపాయలు ఇస్తూ దొరికిపోవడం వల్ల,  ఓటుకు కోట్ల కేసు వల్ల మన హక్కుల్ని తెలంగాణకు ధారపోశారు. ఈ విషయాన్ని ఇరు రాష్ట్ర ప్రజలు  లాజికల్ గా, ధర్మంగా ఆలోచించాలి. చంద్రబాబు చేసిన తప్పును మేము సరిదిద్దే ప్రయత్నం చేశాం. సాగర్ డ్యామ్ స్వాధీనం విషయంలో తెలుగుదేశం వాళ్ళు అసలు మాట్లాడలేదు. టీడీపీ వారు కూడా ప్రభుత్వ చర్యను సపోర్ట్ చేయాలి. ఎందుకంటే, నాడు వారు ఫెయిల్ అయ్యారు. వైయ‌స్‌ జగన్ ప్రభుత్వం సక్సెస్ అయింది. 

పురంధేశ్వరి దిగజారుడు మాటలు..
తెలుగుదేశం అధ్యక్షురాలుగా మాట్లాడుతున్న పురంధేశ్వరి ఈ విషయమై మాట్లాడారు. ఆంధ్ర పోలీసులను పంపడం దారుణం, అన్యాయమని మాట్లాడుతున్నారంటే.. ఆమె బీజేపీ అధ్యక్షురాలా.. ? లేక టీడీపీ అధ్యక్షురాలా..? మన రాష్ట్ర ప్రజల హక్కుల్ని, మా హక్కుల్ని సీఎం వైయ‌స్‌ జగన్ రక్షించే ప్రయత్నం చేస్తుంటే.. ఆమె విమర్శించే స్థాయికి ఎందుకు దిగజారిపోయారు..? టీడీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే.. ఎటూ, వారి పార్టీకి కూడా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న పురంధేశ్వరి మాట్లాడింది కదా అని ఆగిపోయారేమో..? మన తాళాలు తెలంగాణ చేతుల్లో ఉండటం ఏమిటి అని 2015లో టీడీపీ వారే మాట్లాడారు కదా... ఇప్పుడెందుకు నోరు పెగలటం లేదు..? మనకు కేటాయించిన 66 శాతం నీళ్ళను రైతులకు ఇవ్వటానికి ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానిని విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోవాలి. 

మాకు ఏ ఇంట్రస్టులూ లేవు
రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తెలంగాణలో మా రాజకీయపక్షం లేదు. మేము అక్కడ పోటీలో లేము. మాకు అక్కడ ఎటువంటి ఇంట్రస్టులు లేవు, ఒక పార్టీని గెలిపించాల్సిన అవసరం గానీ, ఓడించాల్సిన అవసరం గానీ మాకు లేదు. వాళ్ళ రాజకీయాలు వేరు.. మా రాజకీయాలు వేరు. పొరుగు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో మేము సత్సంబంధాలు కొనసాగిస్తాం. తెలంగాణతో తగాదాలు, గొడవలు మాకు అవసరం లేదు.. మా హక్కుల్ని మేము కాపాడుకునేందుకే మేము ఒక అడుగు ముందుకు వేశాం. 

ఎప్పుడు చేశామన్నది అప్రస్తుతం
చంద్రబాబు హయాంలో, సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేనప్పుడు.. మళ్ళీ సరైన సమయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. విభజన చట్టం అమలులోకి వచ్చినప్పుడే వీటన్నింటిపై చర్యలు తీసుకోవాల్సింది. తీసుకోకపోగా, పోలీసుల్ని పంపి, విఫలమై, గవర్నర్ వద్ద రాజీ కుదుర్చుకున్నాడు.  ఇప్పటికి కూడా అలానే ఎందుకు ఉండాలి అన్నదే మా ప్రశ్న. అధర్మమైన రామోజీ, రాధాకృష్ణలు రాతలు రాసినట్టు మన హక్కుల్ని వదులుకోవాలా..? కేసులకు భయపడి చంద్రబాబు మన రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టాడు. మన హక్కుల్ని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్ళేందుకు మన ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది.  సమస్య పరిష్కారానికి ఎవరి స్ట్రేటజీలు వారికి ఉంటాయి. పోలింగ్ రోజు చేశారా.. ముందు చేశారా.. అనేది అప్రస్తుతం.. మనకు హక్కు ఉందా.. లేదా అనేదే వాస్తవం. ఆ వివాదాన్ని మనం పరిష్కరించాం.. మన భూభాగాన్ని మనం ఆక్రమించుకున్నాం. ఎవరి భూభాగాన్ని సెంటు కూడా ఆక్రమించుకోలేదు. వారి నీటి బొట్టు కోసం తాపత్రయపడలేదు. మన వాటా నీటిని వాడుకోవడానికి స్వేచ్ఛ సాధించాం. దీనిని తెలుగు ప్రజలంతా సమర్థించాలి, స్వాగతిస్తారని భావిస్తున్నాను. తెలంగాణ ప్రజలు కూడా పంతాలకు, పట్టుదలకు వెళ్ళొద్దు..

తెలుగు ప్రజల ద్రోహి చంద్ర‌బాబు..
ఆంధ్రా పోలీసులపై తెలంగాణ వారు పెట్టిన కేసు చెల్లదు. ఎందుకంటే, వారు చెబుతున్నట్టు, ఒకవేళ ఏపీ పోలీసులు నేరం చేశారనుకుంటే.. వారు ఎక్కడ చేశారు..? ఏపీలో నేరం చేస్తే.. తెలంగాణ పోలీసులు కేసు పెడతారా..? నేను కూడా మొన్న ఖమ్మం జిల్లా వెళితే.. నాపై తెలుగుదేశానికి చెందిన కుల వాదులు కొందరు దాడికి ప్రయత్నం చేస్తే.. తెలంగాణలో పోలీసులు కేసు పెట్టారు. ఇది వాస్తవం.  మా హక్కుల్ని మేము కాపాడుకుంటున్నాం.. తెలంగాణ వారి హక్కుల్ని మేం హరించం. భవిష్యత్తులోనూ ఇదే జరుగుతుంది. చంద్రబాబు తాకట్టు పెట్టిన హక్కును మళ్ళీ మనం తీసుకునే ప్రయత్నం చేసింది వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం. చంద్రబాబు తెలుగు ప్రజల ద్రోహి. మన రైతాంగం పాలిట ద్రోహి. మన నీటికి తెలంగాణ దగ్గర "కీ" పెట్టిన వ్యక్తి చంద్రబాబు. మన నీటిని వాడుకోవటానికి తెలంగాణ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడుక్కునే విధంగా చంద్రబాబు మన హక్కును తాకట్టు పెట్టి, ఓటుకు కోట్లు కేసులో  అడ్డంగా, అమరావతికి పారిపోయి వచ్చాడు. 

టీడీపీకి ప్రజలు సమాధి కట్టబోతున్నారు
తెలంగాణలో మాకు ఇంట్రస్టులు లేవు. ఎవరు వచ్చినా.. మాకు ఒకటే. ఏ ప్రభుత్వం వస్తే.. ఆ ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది. చంద్రబాబు పోయినసారి బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు సంబంధించిన కుల సంఘాలు అన్నీ తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్ మీటింగ్ లలో , రాహుల్, ప్రియాంకలు వస్తే.. కాంగ్రెస్ జెండాలతో పాటు తెలుగుదేశం జెండాలు సమాంతరంగా ఎగిరాయి. వాస్తవానికి బతికున్నా, చచ్చిపోయి ఉన్నా.. తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ తెలంగాణలో కూడా ఉంది. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు, ఆ పార్టీ శ్రేణులు ప్రవర్తన వల్ల, వ్యక్తులు, సామాజిక వర్గాల ప్రవర్తన వల్ల, రాబోయే ఎన్నికల్లో  తెలుగుదేశం  పార్టీని కూకటివేళ్ళతో ఆంధ్రప్రదేశ్ లో పెకలించబోతున్నారు.

పవన్ పిచ్చోడు కావొచ్చు..కానీ ఆ సామాజికవర్గం కాదు
ప్రజలందర్నీ.. లాజికల్ ప్రశ్న, జెన్యూన్ ప్రశ్న ఒకటి అడుగుతున్నాను. అవినీతి కేసులో చంద్రబాబును అరెస్టు చేస్తే .. ఏ ప్రతిపక్ష నాయకుడుగానీ, ఏ రాజకీయ నాయకుడు గానీ వెళ్ళలేదు. ఒకే ఒక్క పవన్ కల్యాణ్ వెళ్ళి, తెలుగుదేశానికి అండగా ఉంటాను, కలిసి పోటీ చేస్తానను అని పిచ్చి పవన్ కల్యాణ్ ఒక్కడే చెప్పాడు. పవన్ కల్యాణ్ ఇంత త్యాగం చేస్తే.. ఆయన తెలంగాణలో 8 సీట్లల్లో పోటీ చేస్తే.. పవన్ కల్యాణ్ ను గెలిపిస్తామని చంద్రబాబు సామాజికి వర్గం వారు అనలేదు ఎందుకు..?. చంద్రబాబు కోసం పనిచేస్తున్న... పవన్ కల్యాణ్ పిచ్చోడు అయితే పిచ్చోడు అవ్వొచ్చేమో గానీ.. ఆయనను మోస్తున్న ఆ సామాజిక వర్గం వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళు కాదు. తెలంగాణలో పవన్ కల్యాణ్ సామాజిక వర్గం వారిని కూకటిపల్లిలో, వేరే స్థానాల్లో ఓడిస్తారా..?.  ఇక్కడేమో ఆయన సామాజికవర్గం మిమ్మల్ని మోయాలా..?. ప్రజలు మీకు గుణపాఠం చెబుతారు గుర్తు పెట్టుకోండి. గ్లాసును తుక్కు తుక్కుగా ఓడించడానికి చంద్రబాబు, ఆయన సామాజికవర్గం తెలంగాణలో ప్రయత్నించిందా.. లేదా..? .  ప్రజలేమీ అమాయకులు కాదు. మీరు ఆడినట్టు ఆడటానికి... అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

తాజా వీడియోలు

Back to Top