ఈఎస్‌ఐ స్కామ్‌లో ఇంకొంతమంది పెద్దల ప్రమేయం

విచార‌ణ‌లో వాస్త‌వాల‌న్నీ బ‌య‌ట‌కొస్తాయి

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు: ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు స్వయంగా డైరెక్టర్లను బెదిరించి మరీ అక్రమాలకు పాల్పడ్డారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. నిబంధనలకు విరుద్ధమని డైరెక్టర్లు చెప్పినా వినిపించుకోలేదన్నారు. హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్‌ఐ స్కామ్‌లో ఇంకొంతమంది పెద్దల ప్రమేయం కూడా ఉందని, విచారణలో అన్నీ తేలుతాయన్నారు. మంత్రిని నేనా..? మీరా..? అంటూ అచ్చెన్నాయుడు డైరెక్టర్లను బెదిరించారని, సాక్షాధారాలు అన్నీ సేకరించాకే అరెస్టు చేశామన్నారు. 

ప్రభుత్వంపై ఏదోలా బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని, అచ్చెన్నాయుడి అరెస్టుపై కులం కార్డు వాడడం దారుణమన్నారు. అచ్చెన్నాయుడిని  పార్టీ మారమన్నామని అనటం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. తాము ఎవరినీ పార్టీలోకి ఆహ్వానించటం లేదన్నారు. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం చేసిన అక్రమాలు చాలనే ఉన్నాయన్నారు. ఇన్సూరెన్స్‌ లేని బస్సులు తిప్పి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడి ఇప్పుడు నీతులు చెప్తే ఎవరూ నమ్మరన్నారు. 
 

Back to Top