అమరావతి: ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే జగనన్నవిద్యా కానుక కిట్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల్లోనే విద్యాదీవెన కిట్లను స్కూళ్లకు చేర్చాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. అందుకు అవసరమైన టెండర్ల ఖరారు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి సంబంధిత ఏజెన్సీలతో సకాలంలో ఒప్పందాలు పూర్తిచేసుకుని వర్క్ ఆర్డర్లను జారీ చేయాలని సూచించారు. అలాగే అమ్మ ఒడి, విద్యాదీవెన పథకాలకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. కాగా జగనన్న విద్యా కానుక కిట్లలో మూడు జతల యూనిఫాం, షూస్, సాక్సులు, బెల్ట్, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్ ఉంటాయి. మరోవైపు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది.