ఎమ్మెల్యే అక్రమ క్వారీ మైనింగ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

అనంత‌పురం జిల్లా కలెక్టర్ కు మాజీ ఎంపీ తలారి రంగయ్య ఫిర్యాదు 

అనంత‌పురం:  టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర‌బాబు అక్ర‌మ క్వారీ మైనింగ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎంపీ త‌లారి రంగ‌య్య డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ క్వారీ దందా గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతుందని,  కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు దోచుకుంటున్నారని,  అధికారుల నిర్లక్ష్యం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని ఆయ‌న‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అనంతపురం కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో సంబంధిత గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆనంద్ కు మాజీ ఎంపీ తలారి రంగయ్య ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ తలారి రంగయ్య సార్ మాట్లాడుతూ.... దేవరకొండ కొండ బ్లాస్టింగ్ ఆపాలని హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఇచ్చారని, ఇదే విషయం రెండు రోజుల క్రితం కలెక్టర్, జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా దేవరకొండ కొండ బ్లాస్టింగ్ ను ఆపేసినట్టు స్థానిక అధికారులతో తప్పుడు సమాచారం జిల్లా అధికార యంత్రాంగానికి పంపించారన్నారు.  

దాదాపుగా 292 ఎకరాల విస్తీర్ణత ఉండే కొండలో పురాతన దేవాలయాలు, జంతువులు, పెద్ద పెద్ద వృక్షాలు, కొండపై ఆధారపడే ఎన్నో జీవరాసులు ఉన్నాయని,  ఎమ్మెల్యే సురేంద్ర బాబు అక్రమ మైనింగ్ తో వాటినన్నిటిని లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.  కొండలను చిన్న కాంట్రాక్టర్లకు లీజులకు ఇస్తే చిన్న మిషనరీలు వేసుకొని పనిచేస్తారు. అయితే ఎస్ఆర్‌సీకి ఎలాంటి  పర్మిషన్లు లేకున్నా  పెద్ద పెద్ద మిషనరీలు తెప్పించి కొండలను, ప్రకృతిని నాశనం చేస్తున్నారని అన్నారు. కొండలలో బ్లాస్టింగ్ చేసి కంకరను తరలిస్తే సంబంధిత గ్రామ ప్రజలు స్పందించి అడిగితే  వారిపై అసభ్యకరంగా బీహార్ యువకులతో హిందీలో తిట్టించడం, ఎస్సీల పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్యే సురేంద్ర బాబు పై తలారి రంగయ్య మండిపడ్డారు. ప్రకృతికి విరుద్ధంగా ఏ గవర్నమెంట్ కూడా క్వారీలను ప్రజా ప్రతినిధులకు కట్టబెట్టడం లేదని తలారి రంగయ్య అన్నారు.  ఎమ్మెల్యే సురేంద్ర బాబు పైన మాకు ఎలాంటి కక్ష సాధింపు లేదని, కళ్యాణదుర్గం నియోజకవర్గం వెనుకబడిన  ప్రాంతమని వ్యవసాయంపై ఆధారపడి ఉందన్నారు.  `ఎమ్మెల్యేగా గెలిచాను నేను ఏమైనా చేసుకుంటాను కొండలను పిండి చేసి కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దోచుకుంటామంటే చూసి సహించేది లేదు` అంటూ ఎమ్మెల్యే సురేంద్ర బాబు పై  తలారి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్ ను ఆపకపోతే బాధిత గ్రామ ప్రజలను కలుపుకుని ప్రజా ఉద్యమాలు చేపడతామని, ప్రజాధనాన్ని దోచుకుంటే  ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తలారి రంగయ్య హెచ్చరించారు.

కార్యక్రమంలో యాటకల్లు, ఐదుకల్లు గ్రామస్తులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడగట్ట నారాయణ,ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, మండలాల కన్వీనర్లు హనుమంతరాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, గోళ్ళ సూరి, ఐ సుధీర్, కదిరిదేరపల్లి హనుమంతరాయుడు, జడ్పీటీసీ అయ్యగార్లపల్లి మంజునాథ్, ఎంపీపీలు సోమనాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆంజనేయులు, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు యాదవ్, జిల్లా కార్యదర్శి యర్రంపల్లి కృష్ణమూర్తి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top