ఉరవకొండ: `నవరత్నాల`తో పేద ప్రజల జీవితాల్లో గొప్ప మార్పులు చోటుచేసుకున్నాయని, సంక్షేమంతో ప్రతీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోందని ఉరవకొండ వైయస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరు మండలం గడే హోతురు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ.. ప్రతీ ఇంటికీ అందిన్న సంక్షేమ సాయం గురించి ఆరా తీశారు. అర్హులై ఉండి ఇతరత్రా కారణాలతో పథకాలు అందని వారు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం వివిధ పథకాల ద్వారా లబ్ది పొందిన మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.