ప్రొద్దుటూరు: ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాక, వైయస్ జగన్ కుటుంబం మీద, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నిత్యం ఏదో రకమైన అబద్ధపు ప్రచారం చేసి పబ్బం గడుపుకొంటున్న సీఎం చంద్రబాబు, ఇకనైనా విషప్రచారం ఆపకపోతే తాము కూడా ఘాటుగానే బదులివ్వాల్సి ఉంటుందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు విజయమ్మ కారు టైరు పగిలిపోతే, ఆమె హత్యకు వైయస్ జగన్ కుట్ర చేశాడంటూ టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాల్లో చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేయిస్తున్నారని, దీన్ని పట్టుకుని ఎల్లో మీడియాలు కధనాలు రాయడం, వాటిపై టీవీల్లో డిబేట్లు పెట్టించడం అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. ఇంకా దిగజారి తల్లిని ఎలా చూసుకోవాలో టీడీపీ నాయకులను చూసి నేర్చుకోవాలంటూ వారితో చిలకపలుకులు పలికిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ తరహాలో చంద్రబాబు కుటిల రాజకీయాలు దశాబ్దాలుగా చూస్తున్నామని చెప్పారు. ప్రొద్దుటూరులో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బాబూ, మరి అవన్నీ కుట్రలేనా?: ప్రజలను కుటుంబ సభ్యుల్లా, మహిళలను తోబుట్టువుల్లా చూసుకున్న మాజీ సీఎం వైయస్ జగన్, తల్లి హత్యకు కుట్ర చేశాడంటూ వస్తున్న అసత్య కథనాలపై రాచమల్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మామ ఎన్టీఆర్ మరణం, ఆయన బావమరిది హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కూడా కుట్రలేనా? అని సూటిగా ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే.. వాటన్నింటికీ తామూ లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. తన బాబాయ్ పవన్‌కళ్యాణ్ నుంచి ప్రాణహాని ఉందని గతంలో చిరంజీవి కూతురు మీడియాతో మాట్లాడిన విషయాన్ని కూడా లింక్ పెట్టేలా చేసుకోవద్దని ఆయనకు సూచించారు. అందుకే వ్యక్తిగత, కుటుంబ వివాదాల విషయాలను రాజకీయాల్లోకి లాగకుండా సంయమనం పాటించాలని హితవు చెప్పారు. వైయస్ కుటుంబ ఆస్తులకు సంబంధించి వివాదానికి ముగింపు పలకాలని కోరుతూ.. తన బిడ్డలిద్దరూ పరిష్కరించుకుంటారని, కాబట్టి ఎవరూ జోక్యం చేసుకోవద్దని విజయమ్మ బహిరంగ లేఖ రాయడంతో తాము కూడా పార్టీ ఆదేశాలతో మౌనంగా ఉన్నామని రాచమల్లు వివరించారు. షర్మిలకు మీ రక్షణ అవసరమా?: షర్మిలమ్మకు రక్షణ కల్పిస్తామని పవన్‌కళ్యాన్ హామీ ఇవ్వడంపై రాచమల్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. షర్మిలమ్మకు భద్రత కల్పిస్తామంటూ ఎందుకు కొత్త డ్రామా? అన్న ఆయన, రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే కదా? అని ప్రశ్నించారు. 5 నెలల కూటమి పాలనలో 78 మంది అమాయక ఆడబిడ్డలు, మహిళలు అత్యాచారాలకు గురై చనిపోతే వారికెందుకు రక్షణ కల్పించలేదని నిలదీశారు. అత్యంత కిరాతకంగా నాలుగేళ్ల చిన్నారులను కూడా వదలకుండా అత్యాచారాలు చేసి చంపేస్తుంటే ఒక్క నిందితుడినీ పట్టుకోలేదని ఆరోపించారు. పిఠాపురంలో 16 ఏళ్ల యువతికి మత్తుమందిచి టీడీపీ నాయకుడు అత్యాచారం చేస్తే ఎందుకు కాపాడలేదని ప్రశ్నించిన రాచమల్లు, తిరుపతి సమీపంలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన సమాజానికి మాయని మచ్చగా మిగిలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోబుట్టువులకు చంద్రబాబు ఇచ్చిన ఆస్తులెన్ని?: వైయస్ కుటుంబ ఆస్తుల వివాదంపై మాట్లాడుతున్న చంద్రబాబు, తన సోదరి హైమవతి, తమ్ముడు రామ్మూర్తినాయుడుకు ఎన్ని కోట్ల ఆస్తులు పంచాడు? హెరిటేజ్‌లో ఎన్ని వేల షేర్లు రాసిచ్చాడో? చెప్పాలని రాచమల్లు డిమాండ్ చేశారు. చివరకు కన్నతండ్రికి కూడా చంద్రబాబు అంత్యక్రియలు నిర్వహించలేదని గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే, అందుకు చంద్రబాబు సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు.