రాష్ట్రం విడిపోయినందుకు శుభాకాంక్షలా..? 

మళ్లీ శుభాకాంక్షలు చెప్పలేదంటూ సీఎంపై నిందలా?

అసలు మైండ్‌ ఉండే మాట్లాడుతున్నావా బాబూ..?

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న బాబు ఏ రాష్ట్ర పౌరుడో చెప్పాలి.

రాష్ట్ర ప్రజలకు నవంబర్‌ 1నే ఆవిర్భావ దినోత్సవం

విడగొట్టమన్నది నువ్వే అయితే, ఆనాడు ఉద్యమాలు ఎందుకు చేశావ్‌?

రాష్ట్ర అప్పులపై నిత్యం బురద చల్లుతూ దుష్ప్రచారం

బాబు హయాంలో ఒక్కరోజులోనే రూ.5 వేల కోట్ల అప్పు

మేం ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు రూ.1.82 లక్షల కోట్లు

అదే సమయంలో డీబీటీలో రూ. 2.11 లక్షల కోట్లు జమ

వారాహి యాత్ర కూడా ప్యాకేజీనా?

అన్నవరం, భీమవరం బదులు చంద్రవరం అంటే బాగుండేది

మాజీ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: రాష్ట్రం విడిపోయినందుకు శుభాకాంక్షలు చెబుతున్న చంద్రబాబుకు అసలు మైండ్‌ ఉందా? చెడిపోయిందా..? తను ఆ పని చేయడమే కాకుండా, సీఎం శుభాకాంక్షలు చెప్పడం లేదని నిందిస్తున్న చంద్రబాబు.. పూర్తిగా గతి తప్పార‌ని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. నిజానికి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన తేదీన, నల్ల బ్యాడ్జీలు పెట్టి ఎన్నో డ్రామాలు చేశారని, రాష్ట్రం విడగొట్టారంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను, రాహుల్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాడన్నారు. అదే రాష్ట్ర విభజనను గట్టిగా సమర్థించిన బీజేపిని మాత్రం ఏనాడు ఒక్క మాట అనలేదని గుర్తుచేశారు. తాడేప‌ల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పేర్ని నాని విలేక‌రుల‌స‌మావేశం నిర్వ‌హించారు.

మాకా తెలివితేటలు లేవు
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న బాబు ఏ రాష్ట్ర పౌరుడో చెప్పాలి. ఎన్టీఅర్‌ను చంపేసి, మళ్లీ ఎన్టీఆర్‌ బర్త్‌డే చేసుకున్నట్టు.. రాష్ట్రాన్ని విభజించిన రోజును, రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకునేంత తెలివితేటలు మాకు లేవు.    అసలు జూన్‌ 2న రాష్ట్రం ఏర్పడటం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరు నవంబరు 1వ తేదీనే అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు. అంతేకానీ, చంద్రబాబు చెప్పారని ఎవరూ జూన్‌ 2న, ఆ పని చేయరు.చంద్రబాబు ముందుచూపుతో రెండు రాష్ట్రాల ప్రజలు విడిపోయి బాగు పడాలంటూ, విడగొట్ట్టమని చెప్పాడట. అలాంటప్పుడు రాష్ట్రం విడిపోయనప్పుడు టీడీపీ ఎందుకు ఉద్యమం చేసింది? నాడు బెజవాడ నడిబొడ్డులో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేశారా? లేదా? అదీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ద్వంద్వ వైఖరి.కానీ ఆరోజుకీ, ఈ రోజుకీ మా విధానం ఒక్కటే. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే మా పార్టీ స్టాండ్‌. అంతేకానీ, మీ మాదిరిగా రోజుకో మాట మాట్లాడం. 

ఆ పేరెత్తే అర్హత మీకు లేదు
2014లో రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఏం మాట్లాడావు? ఇప్పుడు నేనే విడగొట్టాను అంటున్నాడు. పొట్టి శ్రీరాములుని గుర్తు పెట్టుకోవాలా..? ఆయన బలిదానం తర్వాత నవంబర్‌ 1 ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం అనాదిగా చేస్తున్నాం.మీ ఐదేళ్ల హయాంలో మీరు ఎందుకు చేయలేదు. పొట్టి శ్రీరాములు పేరెత్తే అర్హత మీకుందా..? భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది పీవీ నరసింహారావు. మీ ఊకదంపుడు ఉపన్యాసంలో పీవీ ఈ దేశ దిశా దశా మార్చాడు అని ఒక్క నిజం చెప్పగలిగావా..? బ్రాహ్మణులు, వైశ్యుల ఓట్లు కావాలి కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పొటి శ్రీరాములు కనిపించరు. ఏపీ అవతరణ దినోత్సవం చేయరు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ఎన్ని శాపనార్ధాలు పెట్టావు..? మళ్లీ ఇప్పుడు రాష్ట్రం విడిపోవాలి అని నేనే చెప్పాను అంటున్నాడు. 

నాడు వ్యక్తిత్వం లేదన్నారు. నేడు సూరీడు అంటున్నారు. తెలుగు వాళ్ల ఆత్మగౌరవాన్ని ప్రపంచమంతా చాటిచెప్పిన వాడు ఎన్టీఆర్‌ అంటున్నావు. అలాంటప్పుడు ఆయన్ని ఎందుకు దింపేశావు...?అంత మంచోడైతే ఎందుకు కుట్ర చేసి నువ్వు, రామారావు కొడుకులు, కూతుళ్లు అంతా కలిసి ఆ ప్రభుత్వాన్ని కూలదోశారు..? ఎన్టీఆర్‌ని నీతిమాలిన వాడు, సంస్కార హీనుడు అన్నావు కదా..?ఎన్టీఆర్‌కి వ్యక్తిత్వం లేదని ఆ రోజు మాట్లాడి ఇప్పుడు వీరుడు సూరుడు అంటున్నావు. 

హైదరాబాద్‌ తానే కట్టాడట!..
తెలంగాణాతో పోలిస్తే ఏపీ ఆదాయం 37 వేల కోట్లు తగ్గిపోయిందని చంద్రబాబు అంటున్నాడు. ఆయన ఉండగా కేవలం 2 వేల కోట్ల వ్యత్యాసమే ఉందంటున్నాడు. నోరు తెరిస్తే అబద్దాలే కదా? అందుకే నువ్వు చెప్పేది నిజమా కాదా అనేది లెక్క చూద్దాం.హైదరాబాద్‌ని నేనే అభివృద్ధిని చేశానంటూ ఇంకా మానసిక వైకల్యంలో ఉన్నాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ పార్క్‌ గురించి ఆలోచించింది. లేఅవుట్‌ అప్రూవ్‌ చేసి, శంకుస్థాపన చేసింది నేదురమల్లి జనార్ధన్‌రెడ్డి. నేదురమల్లి వేసిన లేఅవుట్లో ఒక ప్లాట్‌లో ఎల్‌ అండ్‌ టి ఒక బిల్డింగ్‌ కట్టించాడు. వైయ‌స్సార్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకూ హైటెక్‌ సిటీకి ఒక రోడ్డుందా..? వైయ‌స్సార్‌ వచ్చాక హైటెక్‌ సిటీ లో మౌలిక వసతులు కల్పించి, 4 లైన్ల రోడ్లు, పీవీ నరసింహరావు ఫ్లైఓవర్‌ నిర్మించారు. ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి చేశారు. నువ్వేం చేశావ్‌ చంద్రబాబూ..? వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి అవుటర్‌ రింగ్‌ చేశారనడానికి సాక్ష్యం మీరే కదా.. చంద్రబాబు, మురళీమోహన్‌ పొలాల్లోంచి అవుటర్‌ రింగ్‌ రోడ్డు పెట్టేస్తున్నాడని ఆనాడు కాకిగోల చేసింది మీరే కదా. ఐటీ పార్క్‌ 2, 3 దశలను కూడా చేసింది వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి. ఒకే ఒక్క బిల్డింగ్‌ కట్టి.. దాన్ని బొమ్మాడించి హైదరాబాద్‌కి ఈయనే కులీకుతుబ్‌ షా అని చెప్తాడు. 

అప్పుడు 2020.. ఇప్పుడు 2047!..
2047కి ఈ రాష్ట్రంలోని పేదవాళ్లనందరినీ ధనికులను చేస్తాడట. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో ధనికులను చేస్తా అంటే అధికారంలోకి వస్తే చేస్తాడేమో అనుకున్నా. కాదట..2047కి చేస్తాడట..అప్పటికి నీ వయసు ఎంతుంటుంది చంద్రబాబూ..? అధికారం లేనప్పుడు ప్రతి సారీ నాకు అధికారం ఇవ్వండి 20 ఏళ్లలో మార్చేస్తా అంటాడు. అప్పుడు 2020 అన్నాడు..ఇప్పుడు 2047 అంటున్నాడు. ఆయన జన్మకి నాకు అధికారం ఇస్తే ఐదేళ్లలోపు ఇది చేస్తా అన్న మాట మాట్లాడలేడు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయడు..తన, తన వాళ్ల సంపద మాత్రమే పెంచుకుంటాడు. ఒక్క రోజన్నా రాబోయే ఏడాదిలో ఇది చేస్తాను...చేశాను అని చెప్పాడా..? 2014–19 వరకూ ఈ రాష్ట్రంలో ఇది నేను చేశాను, నాకు ఓట్లు వేయండి అని అడుక్కోలేని దౌర్భాగ్య స్థితి బాబుది. ఈయన మాట్లాడేది పిట్టల దొర మాటలు. 

అమరాతిలో వారి సంపదే పెరిగింది
కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య సంపద సృష్టించానంటున్నాడు. కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులకు ఎవరికీ సంపద రాలేదు. రెండు జిల్లాల మధ్యలో అమరావతి పేరుతో పొలాల్లో చంద్రబాబు, తన మందీమాగదానికి సంపద సృష్టించుకున్నాడు. ఎయిర్‌ పోర్టు వద్ద భూమి ఇచ్చాడట..సీడ్‌ క్యాపిటల్‌లో కమర్షియల్‌ ల్యాండ్‌ అంటున్నాడు. నువ్వు అమరావతిలో 57 వేల ఎకరాల భూమి ఎటువంటి వివాదం లేకుండా సేకరించాను అంటున్నావు కదా..సంపద సృష్టించాను అని మాట్లాడుతున్నాడు. గన్నవరం ఎయిర్‌ పోర్టులో స్థలం ఇచ్చిన ఒకే ఒక వ్యక్తికి తప్ప పొలం ఇచ్చిన వారికి ఒక్కరికన్నా ప్లాట్‌ పంచిపెట్టావా..? ఎవరికీ ప్లాట్‌లు ఇవ్వకుండా నమ్మిన వారిని వెన్నుపోటు పొడిచి మళ్లీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ దిక్కుమాలిన తప్పుడు ఆలోచన చేసే బదులు, ప్రతి విషయంలో డబ్బు కోసం పాకులాడే బదులు సరిగ్గా ఉండొచ్చుగా. దేనికోసం ఈ పాకులాట?. ఎంత తిన్నా మూడు పూటలేగా? ఎందుకీ వెంపర్లాట? ఎవరి కోసం ఆరాటం?ఏపీఎస్పీ 350 ఎకరాల్లో శాశ్వితంగా రాజధాని, సచివాలయం, అసెంబ్లీ పక్కాగా కడితే బాగుండేది కదా..? మీరు, నారాయణ, మీ మనుషులు సంపాదించుకోవాలి కాబట్టి పెట్టలేదు. మీరు సంపద సృష్టించింది మీకు, మీ మందీ మాగదులకి మాత్రమే...ఈ రాష్ట్ర ప్రజలకు కాదు..మీరు అధికారంలో ఉన్న ప్రతి సారీ మీ హెరిటేజ్‌ కంపెనీ షేర్‌ వ్యాల్యూ పెరిగింది..రాష్ట్ర ప్రజల అప్పు పెరిగింది. 

అధికారంలో ఉన్నా..
కేంద్రంలో రెండు మంత్రి పదవులు నాలుగున్నరేళ్లు అనుభవించావు. వెంకయ్యనాయుడు కూడా నీ మనిషే కదా? నీ చేతిలో మూడు కేంద్ర మంత్రి పదవులు పెట్టుకుని ఈ రాష్ట్రానికి ఏం తెచ్చావ్‌..?
విమానయాన శాఖ మంత్రి నీ గుప్పిట్లోనే ఉన్నాడు. కనీసం విశాఖ ఎయిర్‌ పోర్టు పనులు కూడా మొదలు పెట్టలేదు. ఐదేళ్లలో ఒక్క ఎయిర్‌ పోర్టు కూడా ప్రారంభించలేదు..ఇప్పుడు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నాడు.

ప్రతి వారం వెళ్లి ఏం సాధించావ్‌?..
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి 2016 సెప్టెంబర్‌లో ప్యాకేజీ, పోలవరాన్ని బతిమిలాడి తెచ్చుకున్నది ఎవరు..? ఆనాడు అమిత్‌షా ఏపీ ముఖ్యమంత్రి పలు మార్లు వత్తిడి చేయడం వల్ల మేము రాష్ట్ర ప్రభుత్వం కట్టేందుకు అంగీకరిస్తున్నాం అన్నాడు. ప్రధాని మోడీ గుంటూరులో చంద్రబాబుకి పోలవరం ఏటీఎం అని చెప్పాడు. వారం వారం మీరెళ్లి ఏం చేశారు..? లెక్కలు చూసుకుని ఎంత మిగిలింది ఎంత తెచ్చుకోవాలి అనేదే మీరు చేసింది. కనీసం నిర్మాణమే ప్రారంభం కాకుండా గేట్లు పెట్టిన ఘనత మీది. పోలవరాన్ని మీరు ఒక ఆదాయ వనరుగా చూడటం వల్ల, ముందుచూపు లేకుండా చేయడం వల్ల కాఫర్‌ పూర్తిగా నిర్మాణం చేయని కారణంగా డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నది. ముందు చూపుతో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కోసం కేంద్రంతో ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ముంపులో ఇళ్లు కోల్పోయే వారికి ఇళ్లు కట్టించడానికి డబ్బు తెచ్చారా..? వైయ‌స్‌ జగన్‌ పోలవరం డ్యాంను పూర్తి చేయడమే కాకుండా నీళ్లు నిలబెట్టాడు. నువ్వన్నట్లు 41 మీటర్లు కాదు...45 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తారు. డ్యాం ప్రోటోకాల్స్‌ ఉంటాయన్న విషయం కూడా తెలియదా..? 

అదే సీఎం ఇవి రాబట్టారు..
మొదటి ఏడాది ఎంత నిల్వ పెట్టాలి. రెండో ఏడాది ఎంత నిల్వ పెట్టాలి. అనే ప్రోటోకాల్స్‌ ఉంటాయి. ఎంత మందిని ఖాళీ చేయించాలో అంతమందికి డబ్బులివ్వండని ఇప్పుడు వైయ‌స్‌ జగన్‌ అడుగుతున్నాడు. చంద్రబాబు 23 సార్లు తిరిగాడు. అప్పట్లో ఇవన్నీ అడగకుండా వైయ‌స్‌ జగన్‌ ని లోపలేయండి అంటూ అడుక్కున్నాడు. వైయ‌స్‌ జగన్‌ తిరిగిన ప్రతి సారీ నిధుల విషయాన్ని అడుగుతూనే ఉన్నారు. జగన్‌ కేసుల కోసం కాదు. కాసుల కోసం తిరిగాడు.2014 విభజన సందర్భంగా మనకు రావాల్సిన లోటు బడ్జెట్‌ 16 వేల కోట్ల రూపాయాల్లో మీరు 4వేల కోట్లు తెచ్చారు. ఈ నాలుగేళ్లలో మేం 12 వేల కోట్లు తెచ్చుకున్నాం. మీ ఐదేళ్లలో కలిసి కాపురం చేసి 4 వేల కోట్లు తెచ్చుకోవడం మీకు కష్టమైపోయింది. పోలవరం నిర్వాసితుల కోసం 17వేల కోట్లు తీసుకొస్తున్నాం. నువ్వు కనీసం అడగగలిగావా..? తీసుకురాగలిగావా..? 

అప్పులపై తప్పుడు ప్రచారం..
వైయ‌స్‌ జగన్‌పై తప్పుడు మాటలు మాట్లాడటానికి మాత్రం పరుగెత్తుకుని వస్తాడు. వైయ‌స్‌ జగన్‌ రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశాడని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా తెలంగాణా సంపద అంతా తానే సృష్టించబట్టే ఏపీ కంటే 37 వేల కోట్లు అక్కడ అదాయం వచ్చిందని చెప్పడం మరీ హస్యాస్పదం. 75 ఏళ్ల వయసుంది కదా...ఒక్క మాట నిజాయితీగా మాట్లాడలేవా..? నీ కన్నా చిన్న కుర్రాడు కదా.. 2019 మే 30న వైయ‌స్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసే నాటికి చంద్రబాబు చేసిన అప్పుల చిట్టా రూ.2.62 లక్షల కోట్లు. 2019 ఏప్రిల్‌ 11వ తేదీన ప్రజలు ఓట్లేస్తే...ఓటింగ్‌కి, లెక్కింపుకి మధ్యలో ఒక్క రోజే రూ.5 వేల కోట్లు అప్పులు తెచ్చావ్‌ చంద్రబాబు.. అప్పులు తేవడంలో, పాపాలు చేయడంలో చంద్రబాబు పెద్ద పనోడు.జగన్‌ ఈ నాలుగేళ్లలో తీసుకొచ్చిన అప్పు రూ. 1.82 లక్షల కోట్లు మాత్రమే.  ఈ నాలుగేళ్లలో ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో వేసిన డబ్బు రూ. 2.11 లక్షల కోట్లు.  చంద్రబాబు కూడా రూ.2.62 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు కదా..ఎవరికన్నా లెక్క చెప్పాడా..? ఆ డబ్బు ఏం చేశాడు..?  మేం తెచ్చిన అప్పునకు మేం లెక్క చెప్తున్నాం...రూ.1.82 లక్షల కోట్లు అప్పు తెస్తే రూ.2.11 లక్షల కోట్లు పైసా లంచం లేకుండా ప్రజలకే అందజేశాం. 

5 సంతకాలు. 10 అబద్దాలు..
చంద్రబాబు ఎంత సత్యవంతుడో ఆయన ప్రమాణ స్వీకారం నాడే తేలింది. ఐదు మొదటి సంతకాల్లో రైతు రుణమాఫీ, చేనేత రుణమాఫీ మొదటి సంతకం. డ్వాక్రా రుణమాఫీ రెండోది, వ్యవసాయానికి 9 గంటల పగటి పూట  నిరంతరవిద్యుత్‌ మూడోది, సారా బ్రాంధీ బెల్టు షాపులు రద్దు నాలుగోది, వెయ్యి రూపాయల పెన్షన్‌ ఐదో సంతకం అన్నాడు. ఈ ఐదింటిలో ఒకటైనా అమలు చేశావా..? జూన్‌లో మొదటి సంతకం పెట్టి అక్టోబర్‌ నుంచి పెన్షన్‌ ఇచ్చాడు. చంద్రబాబు చరిత్ర అంతా 5 సంతకాలు..10 అబద్దాలు. డబ్బున్నోళ్లు పేదలని దత్తత తీసుకోవాలట. మీరు ఎన్టీఆర్‌ని కూలదోసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మీరు, మీ శ్రీమతి, కుమారుడు ఎంత మందిని దత్తత తీసుకున్నారు..? మనం ఎవరికన్నా చెప్పేటప్పుడు చేయాలి కదా..? అప్పుడు పిల్లల్ని కనొద్దన్నాడు...ఈ రోజు ఇష్టానుసారం కనేయమంటున్నాడు. ఈయన చెప్పడం వల్లనే ప్రజలు పిల్లలను కనడం లేదు..జనాభా ఆగిపోయింది అంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి ఇక పిల్లల్ని కంటారు. 

మీ హయాంలోనే మత్తు పదార్ధాలు..
గంజాయి గురించి నీ రాష్ట్ర క్యాబినెట్‌లోనే చర్చించారు. నీ క్యాబినెట్‌ సభ్యుడు గంటా శ్రీనివాసరావు ఏపీ గంజాయికి కేంద్రంగా మారిందని  బాబు బాధపడిపోతున్నాడని చెప్పాడు. ఈ రాష్ట్రాన్ని గంజాయి పాలు చేసింది ఎవరు..? మీ అసమర్ధత, తప్పుడు పరిపాలన వల్లేనని మీ మంత్రి గంటా శ్రీనివాసరావే చెప్పాడు. మీ మంత్రి ఏం చెప్పాడో కావాలంటే మీరు వీడియోలు పంపుతాను.. రాష్ట్రానికి పులివెందుల వాళ్లేమన్నా శతృవులా..?

ఇతరుల క్రెడిట్‌ నీ ఖాతాలో..
అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేని తానే మంజూరు చేస్తే దాన్ని వైయ‌స్‌ జగన్‌ పులివెందులకు వేసుకున్నాడు అంటున్నాడు. ఆయనకు తప్పుడు మాటలు మాట్లాడటం అలవాటుగా మారిపోయింది. చంద్రబాబు హయాంలో ఈ రోడ్డు కోసం భూసేకరణ చేసి ఇస్తే మేం రోడ్డు వేస్తాం అన్నాడు..బాబు భూసేకరణ చేయలేదు. ఆ రూట్‌ చెప్పి పార్టీ ఎమ్మెల్యేలను భూములు కొనుక్కోమని చెప్పి భూసేకరణ చేయకుండా ఇంటికి వెళ్లిపోయారు. వైయ‌స్‌ జగన్‌ వచ్చాక హిందూపురం నుంచి అనంతపురం, నర్సరావుపేట మీదుగా విజయవాడకు ఒక గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే రోడ్డు వేస్తున్నాడు. అద్దంకి నుంచి పులివెందుల మీదుగా బెంగుళూరుకు ఒక గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మీ వాళ్లు కొనుగోలు చేసిన పొలాల పక్కనుంచి వెళ్లే రోడ్డు కాదు ఇది. కేంద్ర ప్రభుత్వమే భూ సేకరణ చేస్తోంది. ఏం పులివెందుల మన రాష్ట్రంలోది కాదా..అక్కడి ప్రజలు మన రాష్ట్ర ప్రజలు కాదా..? రాష్ట్రానికి వాళ్లేమన్నా శతృవులా..? మీరేం బాధ పడనవసరం లేదు. మీరు కొనుకున్న ప్రాంతంలోని రోడ్డు కూడా చేస్తాం. 

పదవుల్లో మాది సామాజికన్యాయం..
రాజ్యసభ సీట్లు మూడు అమ్ముకున్నామని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. నీ బతుక్కి 2014 నుంచి 2019 వరకూ ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక్కరికన్నా రాజ్యసభ సీటు ఇచ్చావా..? వైయ‌స్‌ జగన్‌ ఇచ్చిన వాటిలో సింహ భాగం వారికేగా..? రాజ్యసభలో మొట్టమొదటి సారిగా ఒక మత్స్యకారుడు వైయ‌స్‌ జగన్‌ వల్ల వెళ్లాడు. ఒక యాదవుడు రాజ్యసభకు వెళ్లాడంటే ఎవరి వల్లో రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు. 

మాటలకు అర్ధం మార్చిన బాబు..
కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ హామీలను బిస్బిల్లా బాత్‌ చేసినట్లుగా పులిహోర కలుపుతున్నాడు అన్నాడు వైయ‌స్‌ జగన్‌. దాన్ని కూడా బలవర్ధకమైన ఆహారం.. మంచి సర్టిఫికెట్‌ ఇచ్చాడు జగన్‌ అని జబ్బలు చరుచుకుంటున్నాడు. రేపు ప్రజలు కూడా 2019లో ఇచ్చినదానికంటే మంచి సర్టిఫికెట్‌ ఇవ్వబోన్నారు. 2019లో మిమ్మల్ని తెడ్డుకాల్చి వాత పెట్టినట్లు పేద మధ్యతరగతి వర్గాలు మరి కొద్ది మాసాల్లోనే మళ్లీ చేయనున్నారు. 

అప్పటికి.. ఇప్పటికి పోల్చి చూద్దామా?..
2019కి ముందు చంద్రబాబు పరిపాలనను, 2019 తర్వాత వైయ‌స్‌ జగన్‌ పరిపాలనను పోల్చి చెప్పండి. రాష్ట్రం ఏం గాడితప్పిందో..?జన్మభూమి కమిటీల లాంటి తప్పుడు కమిటీలు లేకుండా, పైసా లేకుండా నేరుగా రూ. 2.10 లక్షల కోట్లు ప్రజలకు అందజేసిన ప్రభుత్వం దేశంలో ఒక్కదాన్నైనా చూపండి. ఏ రంగంలోనైనా సరే..విద్యా, వైద్యం..ఇలా దేనితోనైనా పోల్చి చూడండి. మీకే అర్ధం అవుతుంది. కొత్తగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 750 సీట్లు తీసుకొచ్చాం. అదే చంద్రబాబు ఉంటే ప్రైవేటు వారికి ఇద్దామని చూస్తాడు. వైయ‌స్‌ జగన్‌ మాత్రం ప్రజల ఆస్థి కింద కడుతున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అనుమతి తీసుకొస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఒకటన్నా నిర్మాణం చేశాడా..? గాడితప్పిన పరిపాలనను గాడిలో పెట్టిన నాయకుడు వైయ‌స్‌ జగన్‌. 

మీది ప్రైవేట్‌. మాది పబ్లిక్‌..
తాను అధికారంలో ఉన్నప్పుడు పీపీపీ చేశాడట..ఇప్పుడు నాలుగు పీలు చేసాడట. ఆయన ఏ పీలు చేసినా దోచుకోవడం, దాచుకోవడమే కదా..? ఆ నాలుగు పీలు కూడా ప్రైవేట్‌...ప్రైవేట్‌..ప్రైవేట్‌.. వైయ‌స్‌
జగన్‌ ఏది చేసినా పబ్లిక్‌...పబ్లిక్‌..పబ్లిక్‌.. మూడు పోర్టులు కడుతున్నాడు...చంద్రబాబు అయితే తన వాళ్లకు పంచేసే వాడు. రామాయపట్నం, బందరు పోర్టు, మూలపేట..అన్నీ ప్రభుత్వానివే. ప్రజల ఆస్థిని పెంచేందుకు ఒక్క సంపద సృష్టించాడా..? వైయ‌స్‌ జగన్‌ సంపద సృష్టిస్తున్నారు. 17 మెడికల్‌ కాలేజీలు సంపద సృష్టి. మూడు పోర్టులు...ప్రజల ఆదాయాన్ని పెంచే సంపద సృష్టి. ఇవన్నీ ప్రజల కోసం సృష్టిస్తున్న సంపద..జగన్‌ సృష్టిస్తున్నారు. 

బాబూ ఇదే మా ఛాలెంజ్‌..
చంద్రబాబుని చాలెంజ్‌ చేస్తున్నాం..మీరు చెప్పే 6లక్షల కోట్ల పెట్టబడులు, 30 లక్షల ఉద్యోగాలు ఎక్కడో చూపించండి. రాష్ట్ర ప్రజలకు నిజమైన సంపద సృష్టిస్తున్న నాయకుడు వైయ‌స్‌ జగన్‌. 46 వేల స్కూళ్ల నిర్మాణం సంపద సృష్టి కాదా..? 

వారు మాత్రం బాధ పడుతున్నారు
రాష్ట్రంలో ఈరోజు వామపక్షాలు కూడా పూర్తిగా సిద్ధాంతాలు వదిలేశాయి. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ పని చేస్తున్నాయి. అందుకే నిజమైన కమ్యూనిస్టు ఎర్రజెండాను వదలకుండా ఉన్న కార్యకర్తలు వీళ్ల పోకడ చూసి ఏడుస్తున్నారు. వాళ్లు ఆ పార్టీని వదిలేసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చంద్రబాబు అని పెట్టుకుంటే నిజమైన కమ్యూనిస్టులు ఆనందపడతారు.

పవన్‌ లక్ష్యం ఒక్కటే
ఎప్పుడూ చూడని సినిమా చూస్తారు అని పవన్‌ కళ్యాణ్‌ అంటున్నాడు. సినిమా క్లాప్‌ కొట్టేటప్పుడు, రిలీజ్‌ రోజు కూడా వంద రోజులు గ్యారెంటీ అనే చెప్తారు. సినిమాల్లో అలవాటై ఇక్కడ కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనే మాకు అధికారం అక్కర్లేదు.. చంద్రబాబు గెలవాలి అని చెప్తున్నాడు. గెలవడం నావల్ల కాదు...నాకు కాస్త సీట్లిస్తే చాలంటున్నాడు. 

టూర్‌ ప్యాకేజీనా పవన్‌?
అమరావతి నుంచి తిరుపతి, అమరావతి నుంచి అరసవల్లిలా ఇవన్నీ టూర్‌ ప్యాకేజీలా ఏంటి..? అన్నవరం టు భీమవరం కూడా టూర్‌ ప్యాకేజీనా..? దసరా, సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి అయిపోయింది. ఇప్పుడు అన్నవరం, భీమవరం వచ్చిందా..? అన్నవరం టు భీమవరం బదులు చంద్రవరం యాత్ర అని పెడితే బాగుంటుంది. 

అప్పుడు, ఇప్పుడు అదే..
ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎంతసేపు వైయ‌స్‌ జగన్‌ ని తిట్టడం తప్ప వాళ్లు చేసిదేముంది..? అధికారంలో ఉన్నా, లేకున్నా వైయ‌స్‌ జగన్‌ నే తిడతారు..దాన్ని రాజకీయ పార్టీ అంటారా..? వారాహి దసరా నుంచి తిరగడం లేదా..? మేం ఇంకా తిరుగుతుంది అనుకుంటున్నాం.చంద్రబాబు ఈస్ట్, వెస్ట్‌ తిరగమని ఉంటాడు..అక్కడే పెట్టుకున్నాడు. చంద్రబాబు అబ్బాయి నడుస్తున్నాడు.. అది డామినేట్‌ కాకూడదు అని నాలుగు రోజులు ఆగమన్నాడు..ఆగాడు. ఇప్పుడు షూటింగ్‌ గ్యాప్‌ వచ్చినట్లుంది. అందుకే పవన్‌ ప్యాకేజీ టూర్‌ మొదలుపెడుతున్నాడని మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top