పెట్టుబడి సాయం అంటే పవన్‌కు తెలుసా ?

రైతులను రాజకీయం కోసం వాడుకోవద్దు

సీఎం వైయ‌స్‌ జగన్ రైతు పక్షపాతి.. అన్న‌దాత కోసం అనేక‌ ప‌థ‌కాలు అమ‌లు

చెప్పిన దాని కంటే మిన్న‌గా రైతులకు పెట్టుబడిసాయం అందిస్తున్నాం

మూడేళ్లలో రైతుల‌కు రూ.20,117 కోట్లు అందించాం

వైయ‌స్ఆర్ రైతుభ‌రోసాతో 52.38 లక్షల రైతుల కుటుంబాలకు ప్రయోజనం 

కౌలు రైతులకు సైతం పెట్టుబ‌డి సాయం ఇస్తున్న ఏకైక సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

కౌలు రైతుకు సాయ‌మివ్వ‌ని కేంద్రాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌వు..

ప‌వ‌న్‌పై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వ‌జం

కాకినాడ: ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట కంటే మిన్న‌గా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం రైతుల‌కు వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా సాయం అందిస్తుంద‌ని, కౌలు రైతుల‌కు సైతం పంట పెట్టుబ‌డిసాయం అందిస్తున్న ఏకైక సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు. పంట పెట్టుబ‌డి సాయం అంటే ఏంటో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు తెలుసా అని ప్ర‌శ్నించారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం రైతుల‌ను వాడుకోవ‌ద్ద‌ని సూచించారు. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు పెట్టుబ‌డి సాయం.. మొత్తం రూ.67,500 వేలు ప్ర‌తి రైతు కుటుంబానికి ప్ర‌భుత్వం అందిస్తుంద‌న్నారు. గ‌డిచిన మూడేళ్లలో పెట్టుబడి సాయంగా రూ.20,117 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ చేశామ‌ని, రైతు భ‌రోసా ప‌థ‌కం ద్వారా మొత్తం 52.38 లక్షల రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరింద‌ని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు. కాకినాడ‌లో మాజీ మంత్రి క‌న్న‌బాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

కురసాల కన్నబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..
ఏ ప్రభుత్వం అయినా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఎగ్గొట్టాలని చూస్తుంది. కానీ ఒక్క వైయస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే అన్ని హామీలు నిలబెట్టుకోవడమే కాకుండా, అంత కంటే ఎక్కువే చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ ఒక ప్రకటన చేశారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తోంది. వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద తొలుత ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు ఇస్తామని చెప్పినప్పటికీ, అంత కంటే ఎక్కువగా, దాన్ని రూ.13,500 చేస్తూ, ఐదేళ్ల పాటు మొత్తం రూ.67,500 ఇస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు.

కేంద్రం వారికి ఇవ్వ‌డం లేదు..
పీఎం కిసాన్‌ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. అయితే అందులో కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులు, దేవాలయాల భూములు సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయం చేయడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారందరికీ కూడా పెట్టుబడి సాయం చేస్తోంది. అంతే కాకుండా ఎక్కడా, అవినీతికి తావు లేకుండా నగదు బదిలీ (డీబీటీ) విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో ఆ సహాయం జమ చేస్తోంది.

అర్హత ఉన్న ప్రతి రైతుకూ..
వైయస్సార్‌ రైతు భరోసా పథకంలో ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ పథకంలో 52.38 లక్షల రైతుల కుటుంబాలకు పెట్టుబడి సాయం అందుతోంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఈ పథకంలో మొత్తం రూ.20,117.59 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు. దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో ఆ విధంగా రైతులకు సహాయం అందలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు పథకంలో ప్రయోజనం కల్పించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు 10 సెంట్ల భూమిలో చివరకు తమలపాకు తోటలు పెంచే రైతులకు, సుబాబుల్, యూకలిప్టస్‌ వంటివి సాగు చేస్తున్న రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తున్నాం.

కేంద్రాన్ని ప‌వ‌న్‌ ఎందుకు అడగడం లేదు?
పవన్‌ను నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. మీరు బీజేపీతో సయోధ్యలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ ఆ ప్రభుత్వం కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేయడం లేదు. వారికి కూడా పెట్టుబడి సహాయం చేయాలని పవన్‌ కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తోంది.

రాజకీయాల కోసం రైతులు వద్దు..
 రైతులను ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయొద్దు. చెప్పిన దానికన్నా ఎక్కువే రైతులకు ఇస్తున్నా, వారికి పెట్టుబడి సాయం చేయడం లేదని పవన్‌ ఎలా చెబుతున్నాడో అర్ధం కావడం లేదు. 2014 ఎన్నికల ముందు రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక, రైతుల రుణాలు మాఫీ చేయలేదు. రైతులకు రూ.84 వేల కోట్లకు పైగా ఉంటే, రకరకాల లెక్కలు వేసి, 5 ఏళ్లలో చివరకు రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. ఇక డ్వాక్రా మహిళల రుణాలు అస్సలు మాఫీ చేయలేదు. మరి చెప్పిన దాని కంటే ఇంకా ఎక్కువే చేసిన సీఎం వైయ‌స్‌ జగన్‌పై పవన్‌ ఎలా విమర్శలు చేస్తున్నారో అర్ధం కావడం లేదు.

ఆ పరిహారాన్నీ పెంచాం..
రైతుల ఆత్మహత్యల గురించి కూడా పవన్‌ మాట్లాడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల సహాయం చేస్తానంటున్నారు. కానీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు జరగకూడదని కోరుకుంటోంది. ఒకవేళ ఎక్కడైనా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, అంతకు మందు ఇచ్చిన పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి పెంచి రూ.7 లక్షలు ఇస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో బలవన్మరణాలకు పాల్పడిన 450కి పైగా రైతుల కుటుంబాలకు కూడా సీఎం వైయస్‌ జగన్‌ రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు.

కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు..
కౌలు రైతులకు పంటలమీద మాత్రమే హక్కు కల్పిస్తూ, వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా వారికి సీసీఆర్సీ కార్డులు ఇచ్చాం. ఈ మూడేళ్లలో 11 లక్షలకు పైగా సీసీఆర్సీ కార్డులు ఇచ్చాం. ఒక్క గత ఏడాదే 5 లక్షల కార్డులు ఇచ్చాం. వాటి ద్వారా ఇతర రైతుల మాదిరిగా కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సాయం అందుతోంది. ఈ–క్రాప్‌లో కూడా కౌలు రైతుల పేర్లు నమోదు చేస్తున్నాం. దేవాలయాల భూములు సాగు చేస్తున్న రైతులు, చెరువు శిఖం భూములు, అటవీ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా అన్నీ ఇస్తున్నాం.

మాది రైతు పక్షపాత ప్రభుత్వం..
గత ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించకుండా రూ.2558 కోట్లు ఎగ్గొట్టింది. కానీ మా ప్రభుత్వం వచ్చాక ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే, అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నాం. రైతుల పట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కి చిత్తశుద్ధి ఉంది కాబట్టే, ఇది సాధ్యమవుతోంది. విత్తనం మొదలు పంటల విక్రయం వరకు రైతులకు అండగా నిలబడేలా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పుడు కొత్తగా పవన్ రైతు భరోసా యాత్ర ఎందుకు మొదలు పెడుతున్నారో అర్ధం కావడం లేదు. అర్హత ఉన్న ప్రతి రైతుకు, కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తున్నాం. పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటున్నాం. రూ.3 వేల కోట్లకు పైగా బీమా కింద రైతులకు ఇచ్చాం. ఇవీ వాస్తవాలు. ఇంకా గత ప్రభుత్వం సున్నా వడ్డీ బకాయిల కింద కూడా దాదాపు రూ.1258 కోట్లు ఎగ్గొట్టి పోతే, ఈ ప్రభుత్వం కట్టింది. పాత బకాయిలతో సహా ఏకంగా రూ.1282.11 కోట్లు డీబీటీ విధానంలో రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. అలాగే రూ.3707 కోట్లు ఉచిత పంటల బీమా కింద వేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 29.05 లక్షల రైతుల కుటుంబాలకు ప్రయోజనం కలిగింది.

కావాలంటే సమాచారం పొందాలి..
పవన్‌కళ్యాణ్‌ కావాలంటే ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకోండి. అంతేకానీ, చంద్రబాబు మాదిరిగా మీరు కూడా అర్ధం లేని లెక్కలు మాట్లాడితే, ఎవ్వరూ నమ్మబోరు. ఈ ప్రభుత్వం ప్రతి పనీ పారదర్శకంగా చేస్తోంది. ఆ ప్రక్రియలో ప్రతి జాబితాను ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నారు. అర్హత మాత్రమే అర్హతగా, కులం, మతం, వర్గం, రాజకీయం వంటి వాటికి తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నాం. ఇవన్నీ వాస్తవంగా జరుగుతుంటే, ఏమీ జరగడం లేదని ఎలా విమర్శిస్తారు?. సీఎం వైయ‌స్‌ జగన్ రైతు పక్షపాతి. ఆయన రైతుల కోసం ఎన్నెన్నో చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీ బకాయిలు, ధాన్యం కొనుగోలు బకాయిలు, విత్తనాల బకాయిలు వదిలిపెట్టి పోతే అన్నీ మా ప్రభుత్వం చెల్లించింది.

పంటల కొనుగోలు..
ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు మూడేళ్ల కాలంలో రూ.39 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఒక్కసారి గత ప్రభుత్వాలు ఏమేర కొనుగోలు చేసిందన్నది చూడండి. ఆర్బీకేలు కేంద్రంగా పంటలు కొనుగోలు చేస్తూ, 21 రోజుల్లో బిల్లులు చెల్లిస్తోంది. కేంద్రం నుంచి నిధులు ఆలస్యమైనా ప్రభుత్వం మాత్రం సకాలంలో రైతులకు చెల్లిస్తోంది. అదే విధంగా రూ.6554 కోట్ల విలువైన ఇతర పంటలను కూడా కొన్నాం. కేంద్రం ప్రకటించినవే కాకుండా, మరో ఏడు రకాల పంటల (త్వరగా చెడిపోయేవి)కు కూడా కనీస మద్దతు ధర ప్రకటించాం. సీఎం యాప్‌ ద్వారా ప్రతి రోజూ ఎమ్మెస్పీ మానిటరింగ్‌ జరుగుతోంది. మేము రైతులకు మాట ఇచ్చి, చేయనిది ఒక్కటైనా ఉందా? ఉంటే చెప్పండి. 

అందరం సమష్టిగా పని చేస్తాం..
సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ నన్ను పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశాను. ఇప్పుడు ఇచ్చిన బాధ్యతను కూడా స్వీకరిస్తాను. పార్టీ కోసం ఇంకా కృషి చేస్తాను. మేం ఏం చేశామన్నది చెబుతూ ఇల్లిల్లూ తిరుగుతాం. చేసినవన్నీ ధైర్యంగా ప్రజలకు చెబుతాం. సీఎం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అందరినీ సమన్వయం చేసుకుంటూ పని చేస్తాను. పార్టీ మళ్లీ విజయం సాధించేలా అందరం కలిసి అదే స్ఫూర్తితో పని చేస్తాం.. అని మాజీ మంత్రి కన్నబాబు వివరించారు.

Back to Top