కాకినాడ: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబే దోషి అని, హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కౌంటర్‌తో ఈ విషయం మరోసారి సుస్పష్టమైందని వైయస్ఆర్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబుకు ఉచ్చు బలంగా బిగుసుకుంటోందన్న ఆయన, సూట్‌కేస్ కంపెనీల ద్వారా రూ.151 కోట్లు దారి మళ్లించి స్వాహా చేసిన విషయం ఈడీ దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఈ కేసు కుట్రపూరితమంటూ నాడు విమర్శలు గుప్పించిన కూటమిలోని జనసేన, బీజేపీ ఇప్పుడేమంటాయని ప్రశ్నించారు. ఏకంగా రోడ్డు మీద పడుకున్న నాయకులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కాకినాడలో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో పక్కా ఆధారాలతో సహా దొరికినా, చంద్రబాబు నిర్దోషి అంటూ ఆయనను సమర్థించిన పార్టీలు, నాయకులకు ఇప్పుడు హైకోర్టులో ఈడీ కౌంటర్ చెంపపెట్టు వంటిదని కన్నబాబు స్పష్టం చేశారు. కాగ్ నివేదికలో చెప్పిందే నిజమైంది స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలున్నా, కూటమి ప్రభుత్వం వచ్చాక సీఐడీ దర్యాప్తును అటకెక్కించారని మాజీ మంత్రి తెలిపారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా సుమన్‌బోస్, వికాస్ వినాయక్ కన్వేల్కర్ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ఇటీవల ప్రకటించడం, తాజాగా అదే ఈడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తూ, సూట్‌కేస్ కంపెనీల వివరాలు బయటపెట్టిన నేపథ్యంలో, స్కామ్‌లో చంద్రబాబు పాత్రను అందరూ నమ్ముతున్నారని చెప్పారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గతంలోనే కాగ్ నిర్ధారించిందని, ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చిని విషయాన్ని ఈ సందర్భంగా కన్నబాబు ప్రస్తావించారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఈ స్కాం గురించి పుణెలోని ఒక విజిల్ బ్లోయర్ వివరాలు అందించినా విచారణ జరిపించకుండా అడ్డుకోవడంతో పాటు, ఫైల్స్ దహనం చేశారని గుర్తు చేశారు. కేసు దర్యాప్తులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు నోటీస్ ఇస్తే, హాజరు కాకుండా విదేశాలకు పారిపోయిన ఆయనకు, టీడీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి ఉద్యోగం ఇవ్వడం నిబంధనలు ఉల్లంధన అని అభిప్రాయపడ్డారు. ఈ కేసును సీఐడీ ద్వారా కాకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా పారదర్శకంగా విచారణ జరిపించాలన్నది తమ పార్టీ డిమాండ్ అని కన్నబాబు చెప్పారు. వాడకంలో చంద్రబాబుని మించిన వారుండరు వాడకంలో చంద్రబాబుని మించిన వారు ఈ దేశంలో ఎవరూ ఉండరని వైయస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విషయంలో అదే జరుగుతోంది అన్న ఆయన, ఆమెను రోడ్డు మీదకు తీసుకొచ్చిన చంద్రబాబు, తనకు అనుకూలంగా మాట్లాడిస్తున్నారని తెలిపారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఇక్కడ చంద్రబాబుకు పూర్తి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అలా రాష్ట్రంలో రెండు పార్టీల అధ్యక్షులను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్, బిజేపి.. దేశమంతా ఉప్పు నిప్పులా ఉంటే, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీల కార్యకలాపాలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయని కన్నబాబు తేల్చి చెప్పారు. మీడియా వ్యవహార శైలి బాధాకరం: చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని, ఆయన్ను కాపాడే ఓ వర్గం మీడియా రక్షణ కవచంగా భుజాలపై మోస్తూ ప్రజలకు అన్యాయం చేస్తోందని కన్నబాబు అసహనం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోయినా, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నా, పంట నష్టం పరిహారం ఇవ్వకపోయినా, ఉచిత పంటల బీమా ఎత్తేసి వెన్నుపోటు పొడిచినా ఆ వర్గం మీడియా ఆయన్ను భుజాన మోయడం బాధాకరమన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని చెప్పి, మొత్తానికే ఉద్యోగాలు ఊడపెరికేసినా, కాంట్రాక్టు సిబ్బందిని తొలగించినా ఆ వర్గం మీడియాకు మాత్రం కనిపించదని ఆక్షేపించారు. టీడీపీ వర్సిటీలో నేర్పేది కుట్రలు, కుతంత్రాలే: టీడీపీ ఒక యూనివర్సిటీ అని చెబుతున్న చంద్రబాబు, అందులో నాయకులకు కుట్రలు, కుతంత్రాలు నేర్పిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీ నాయకులను చంపడం, వారిపై దాడి చేయడం, వారి ఆస్తులను దోచుకోవడం కూడా నేర్పుతున్నారని దుయ్యబట్టారు. చివరకు ఆడపిల్లల మీద అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా నోరు మెదపవద్దని మీ యూనివర్సిటీలో చెబుతున్నారా అని ప్రశ్నించారు. అదేనా చంద్రబాబు ఉద్దేశం?: 1995 నాటి చంద్రబాబుని అవుతానని, రాజకీయ పరిపాలన చేస్తానని చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం.. కులాలు, మతాలు, పార్టీలు చూసి పథకాలు అమలు చేయడం, సొంత పార్టీ నాయకులకు ప్రజాధనం దోచిపెట్టడమేనా అని నిలదీశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుకలో ఉచితం లేదని, నాణ్యమైన మద్యంలో నాణ్యత లేదని స్పష్టం చేశారు. విజయవాడ వరదలు వారి కోసమే వచ్చినట్లుగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల ఖర్చుల పేరిట రూ.23 కోట్లు, చంద్రబాబు కలిపిన పులిహోరకు ఏకంగా రూ.356 కోట్లు దోచేశారని కన్నబాబు గుర్తు చేశారు.