శ్రీకాకుళం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం బరితెగింపు చర్యలు ఏంటని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుందని ఆయన మండిపడ్డారు. వైయస్ జగన్ పిలుపు మేరకు శ్రీకాకుళం పట్టణంలో ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుబంధ విభాగాలైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే రాజ్యాంగ విధులను ఈ ప్రభుత్వం ఏమి నిర్వర్తించినట్టు అని ప్రశ్నించారు. వైద్య విద్య ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రభుత్వం నిర్వర్తించడానికి ఉన్న పనులు ఏంటని నిలదీశారు. రాజ్యాంగం ఏం చెప్పింది.. సాధారణ పౌరులకు అనారోగ్యం కలిగితే కోర్టుకు పోవాలా ? రాజ్యాంగ మార్గదర్శక లో వైద్య విద్య ప్రభుత్వం చూడాల్సిదే అన్నారు. ఈరోజు ప్రతి కుటుంబానికి ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి.. అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే.. ఆ వ్యక్తికి ఉన్న ఆస్తంతా ఫీజులు రూపేనా దోచుకుంటున్నారని త ఎలిపారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా చెడిపోవడానికి కారణం కార్పొరేట్ వైద్యమే అన్నారు. ఉన్న వైద్యాన్ని కూటమి ప్రభుత్వం పేదవాళ్లకు పకడ్బందీగా అందించే ప్రయత్నం చేయకపోగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కళాశాలలను, ఆ కళాశాలకు అనుబంధంగా పనిచేస్తున్న జిల్లా ఆసుపత్రులను బరితెగించి ప్రైవేటీకరణ చేస్తుందని ధ్వజమెత్తారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలనగా అభివర్ణించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు నెలకు ఇంత మొత్తం కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలని సూచించారు. వైద్యం అనేది చౌకగా పేదవాడికి సామాన్యుడికి అందాలి, కుటుంబాలు చెడిపోవడానికి వైద్యం అనేది కారణం కాకూడదన్నారు. ఇంత మంచి బాధ్యతను వదిలేసి ప్రైవేటీకరణ వైపు పరుగులు తీస్తున్న ఈ ప్రభుత్వానిది బాధ్యతారహిత్యమే అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసింది, ప్రభుత్వం మెడికల్ కళాశాలలో వాటికి అనుబంధంగా ఏర్పాటు చేసే ఆసుపత్రులు ప్రైవేట్ వ్యక్తులు చేతులకు వెళ్లడానికి మేము అంగీకరించమని మా పార్టీ అధినేత వైయస్ జగన్ స్పష్టం చేశారని ధర్మాన తెలిపారు. ఒకవేళ బరితెగించి ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కళాశాలన్నీ, ఆసుపత్రులని ప్రజలకి ఇచ్చే నిర్ణయం తీసుకుంటుందని హెచ్చరించారు. అనుభవం ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబు..గత ఐదేళ్లలో, కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏం చేశారో చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, వైద్య విద్యా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, యువ నాయకుడు ధర్మాన రామ్మోహర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు