తాడేపల్లి: సిట్ జరిపిన అరెస్టులు నెయ్యి టెండర్ల ఉల్లంఘన మీద తప్ప, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని కాదని గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు ఆయన మెడకే చుట్టుకున్నాయని, దీంతో ఆయన్ను బయటపడేసేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆపసోపాలు పడుతున్నాయని అంబటి ఎద్దేవా చేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనడానికి ఆధారాలే లేవన్న అంబటి, టెస్టుల్లో ఫెయిలైన ట్యాంకర్లు కొండపైకి చేరే అవకాశమే లేనప్పుడు లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు చెప్పినట్టు పంది కొవ్వు కలిసే అవకాశమే ఉండదని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం ఆయన చేసిన ఆరోపణలకు మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. వాడని నెయ్యి మీద జరుగుతున్న విచారణ - తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణల నేపథ్యంలో కేసును విచారిస్తున్న సిట్ నలుగుర్ని అరెస్ట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. - అయితే ఇక్కడ అందరూ గమనించవలసిన అంశం.. కల్తీ నెయ్యి వ్యవహారంలో జరిగిన ఈ అరెస్టులు టెండర్ల ఉల్లంఘన మీద తప్ప, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని మాత్రం కాదు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనేది ఆధారాలు లేని ఆరోపణ మాత్రమే. - ఇదంతా వాడని నెయ్యి మీద జరిగిన విచారణ తప్ప, వాడిన నెయ్యి మీద కాదు. - లడ్డూ తయారీలో జంతువుల కోవ్వు కలిసిందని చంద్రబాబు తెలివి తక్కువ ఆరోపణలు చేసి అడ్డంగా దొరికిపోయాడు. అందులో భాగంగానే చంద్రబాబు విన్యాసాలు చేస్తుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇష్టమొచ్చినట్టుగా వార్తలు రాసేస్తున్నాయి. - రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని అర్థమైపోయింది. ఆయన చేసిన ఆరోపణల నుంచి బయటకు రావడానికి ఆపసోపాలు పడుతున్నాడు. - చంద్రబాబు నోరు జారి ఇరుక్కుపోయినందుకే గతంలో తన పాలనలో, జగన్ పాలనలో వెనక్కి పంపిన ట్యాంకర్ల మీద కేసులు పెట్టకుండా, ఇప్పుడు రిజెక్ట్ అయిన వాటి మీదనే కేసులు పెట్టి విచారణ చేయిస్తున్నారు. - తిరుమలపై తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులకు, పార్టీలకు, సంస్థలకు శ్రీవారి ఆశీస్సులు ఉండవని మేము విశ్వసిస్తున్నా. టీటీడీలో దశాబ్దాలుగా ఒకటే విధానం - టీటీడీ చాలా పవిత్రమైన ఆలయం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు శ్రీవారిని ఆరాధిస్తారు. టీటీడీలో తయారు చేసే అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం నాణ్యతకు పెట్టింది పేరు. ప్రపంచంలోని అనేక ఆలయాలు టీటీడీలో ఏవిధంగా ప్రసాదాలు తయారు చేస్తారు, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తారు అనేది అధ్యయనం చేస్తుంటారు. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే.. అందరికీ తెలిసిందే. - టీటీడీకి ఆవు నెయ్యి సరఫరా కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలవడం, ఎల్ -1 గా వచ్చిన వారికి కాంట్రాక్టు ఇవ్వడం అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్న రూల్. వారు సరఫరా చేసే నెయ్యిని శాంపిల్స్ తీసుకుని మూడు టెస్టులు చేసి పాసైతేనే కొండమీదకు పంపడం జరుగుతుంది. ఏ ఒక్క టెస్టులో ఫెయిలైనా వెనక్కి పంపడం జరుగుతుంది. - ఆ విధంగా జగన్ హయాంలో 18 ట్యాంకర్లు, 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లోపించిందన్న కారణంతో 15 ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింది. టెస్టులు పాసైన నెయ్యిని మాత్రమే కొండ మీదకు పంపినప్పుడు కల్తీ జరగడానికి ఆస్కారమే ఉండదు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. లడ్డూ వివాదంలో ఎప్పుడేం జరిగిందంటే.. - చంద్రబాబు జూన్ 12న ప్రమాణస్వీకారం చేశారు. జగన్ హయాంలో రోటీన్‌గా వచ్చిన టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి. ఫైనల్ అయిన టెండర్లలో ఏఆర్ సప్లయర్స్ టెండర్లు దక్కించుకున్నారు. - జూన్ 4, 12, 21, 25 తేదీల్లో చంద్రబాబు సీఎంగా ఉండగానే నెయ్యిని సరఫరా చేశారు. అవన్నీ బాగానే ఉన్నాయని నిర్ధారించి కొండపైకి పంపించారు. - ఆ తర్వాత జూలై 6, 12న మరికొన్ని ట్యాంకర్లు వస్తే అవి టెస్టులు ఫెయిలయ్యాయి. వాటిని వెనక్కి తిప్పి పంపించారు. - ఆ తర్వాత టీటీడీ ఈవో శ్యామలారావు ఒక ప్రెస్‌మీట్ పెట్టి జూలైలో సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిసిందని రిపోర్టు రావడంతో వెనక్కి పంపామని చెప్పారు. - అయితే సీఎం చంద్రబాబు మాత్రం సెప్టెంబర్ 18న జరిగిన కూటమి ఎమ్మెల్యే సమావేశంలో రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో భగవంతుడిని అడ్డం పెట్టుకుని పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో పంది కొవ్వు కలిసిందని నిరాధార ఆరోపణలు చేశాడు. తద్వారా వైయస్ఆర్‌సీపీ మీద బురదజల్లాలని కుట్ర చేశాడు. - ఒక పక్క ఈవో నెయ్యిలో కల్తీ జరిగిందని టెస్టుల్లో తేలడంతో వెనక్కి పంపామని చెబుతుంటే, చంద్రబాబు మాత్రం కుట్రపూరితంగా కల్తీ నెయ్యిని వెనక్కి పంపామనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందంటూ అబద్ధపు ప్రచారాన్ని చేశాడు. అంతటితో ఆగకుండా ఆ లడ్డూ ప్రసాదాన్ని దేశంలోని భక్తులంతా తినేశారని నిర్లజ్జగా తప్పుడు ఆరోపణలు గుప్పించాడు. - రాజకీయ లబ్ధిపొందాలనే దురుద్దేశంతో గత సీఎం వైయస్ జగన్ మీద, టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డిల మీద ఆరోపణలు చేశాడు. నీచమైన ఎత్తుగడతో చేసిన ఆరోపణలు తర్వాత చంద్రబాబు మెడకే చుట్టుకున్నాయి. - ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెట్లు కడిగి నానా హంగామా చేసి వచ్చాడు. అయోధ్య ఆలయ ప్రారంభత్సవానికి కూడా కొవ్వు కలిసిన కల్తీ లడ్డూలు వెళ్లాయంటూ భక్తుల మనోభావాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా అత్యంత జుగుప్సాకరంగా నోటికొచ్చినట్టు మాట్లాడాడు. కేవలం వైయస్ఆర్‌సీపీ మీద బురదజల్లాలన్న తాపత్రయం తప్ప, వారు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. సిట్ ఏర్పాటుపై.. - సెప్టెంబర్ 18న ఆరోపణలు చేసి, సెప్టెంబర్ 25న కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిట్ వేసింది. - చంద్రబాబు చేసిన దుర్మార్గమైన, నిరాధార ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్ట్ విస్మయం వ్యక్తం చేస్తూ ఏ ఆధారాలతో ఆరోపణలు చేశారని చంద్రబాబుని చీవాట్లు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ను మార్చి సీబీఐ అధికారిని చేర్చి కొత్తగా సిట్‌ను ఏర్పాటు చేసింది. - ఆవులు ఆహారం సరిగా ఆహారం తీసుకోకపోయినా, అవి తిన్న ఆహారంలో ఆవాలు, అవిశలు, పామాయిల్, వనస్పతి వంటివి కలిసినా రిపోర్టులు మారే అవకాశం ఉందని ఎన్డీబీఐ తన రిపోర్టులో డిస్‌క్లైమర్ ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపిస్తుందని స్పష్టంగా చెప్పారు. - ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులంతా చంద్రబాబు చేసిన ప్రచారం నిరాధారంగా రుజువు కావాలని కోరుకుంటున్నారు. ఆయన మాత్రం మీరంతా పంది కొవ్వు కలిసిన లడ్డూలు తిన్నారని ప్రచారం చేశాడు. ఇలాంటి వ్యక్తికి ఏడుకొండలవాడు సహకరించడు. ఆలస్యం కావొచ్చేమో కానీ నిజాలు తప్పకుండా నిగ్గుతేలతాయి. - తిరుమల తిరుపతి దేవస్థానంతో ప్రభుత్వానికి సంబంధమే ఉండదు. అదొక ఇండిపెండెంట్ వ్యవస్థ. దానికంటూ ప్రత్యేక వ్యవస్థ ఉంది. టీటీడీ కార్యకలాపాల్లో ప్రభుత్వం కలగజేసుకోదు. కానీ చంద్రబాబు నీచమైన స్థాయికి దిగజారి ఆరోపణలు చేసి ఇరుక్కుపోయాడు. దాని పర్యవసానమే ఈ సిట్ వ్యవహారం. జనసేనను బీజేపీలో కలిపేస్తారేమో! - మరో నాలుగేళ్లు అధికారంలో ఉంటామనే ధీమాతో ఇష్టమొచ్చినట్టు పాలన చేస్తున్నారు. కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చే ఉద్దేశం చంద్రబాబుకి లేదు. - మర్డర్ కేసుల్లోనే మూడు నెలల్లో బెయిల్ తెచ్చుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన కేసుల్లో మాత్రం బెయిల్ రాకుండా వేధిస్తున్నారు. - ప్రజారాజ్యం ముదిరిముదిరి కాంగ్రెస్‌లో కలిసింది.. జనసేన కూడా ముదిరి ముదిరి బీజేపీలో కలుస్తుందేమో.. - చిరంజీవి కేంద్రమంత్రి అయినట్టే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీలో చేరి కేంద్రమంత్రి అవుతారని సందేశం ఇచ్చారేమో అనిపిస్తుంది.