తాడేపల్లి: రాజకీయాల్లో ఉన్నంతకాలం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటానని మాజీ హోంమంత్రి, వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో భేటీ అనంతరం మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడారు. మీడియాలో తనపై వస్తున్న రకరకాల కథనాలకు దయచేసి పుల్‌స్టాప్ పెట్టాలని సుచరిత కోరారు. సీఎం వైయస్ జగన్ తనను సోదరిగా, కుటుంబంలో మనిషిగా భావిస్తారని, సీఎంను కలిసే అవకాశం, స్వేచ్ఛ తనకు ఎప్పుడూ ఉంటుందన్నారు. సీఎంకు థ్యాంక్స్ గీవింగ్ నోట్ రాస్తే.. దాన్ని రాజీనామా లేఖ అని, స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా అని రకరకాలుగా పుకార్లు సృష్టించారని, వాటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలోనే కొంతమందికి పార్టీ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుందని సీఎం చెప్పినప్పుడు.. ఎలాంటి అభ్యంతరం లేదని తానే ముందుగా చెప్పానని సుచరిత గుర్తుచేశారు. దళిత మహిళను హోంమంత్రి చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌దన్నారు. మేకతోటి సుచరిత రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయస్‌ఆర్ సీపీలోనే.. వైయస్ జగన్‌తోనే నడుస్తుందని, వేరేవైపు చూడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల నుంచి విరమించుకోవాల్సి వస్తే.. వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తగా, ఓటర్‌గానే ఉంటానని స్పష్టం చేశారు. 2009 నుంచి వైయస్ జగన్ వెన్నంటే నడుస్తున్నానని, పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదని చెప్పారు. వైయస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ధైర్యంగా రాజీనామా చేసి వచ్చానని చెప్పారు. పదవులు ముఖ్యం కాదు.. శాశ్వతం కాదని చెప్పారు. సీఎం వైయస్ జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలతో.. రాబోయే 30 ఏళ్ల పాటు వైయస్ జగన్ సీఎంగా కొనసాగుతారని, అందుకోసం తాను, తన అనుచరులు పనిచేస్తామని చెప్పారు.