కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ యోచన మానుకోవాలి

మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్‌

పీపీపీ విధానంలోకి కొత్త మెడికల్‌ కాలేజీల నిర్వహణసరైంది కాదు. 

ఆ యోచన పూర్తిగా అసమంజసం

అది కచ్చితంగా కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణే

మెడికల్‌ సీట్లపై ఎన్నికల హామీలు అమలు చేయాలి

లేకపోతే పేద విద్యార్థుల పక్షాన పోరాటాలు చేస్తాం

మెడికల్‌ సీట్లపై ఎన్నికలకు ముందు ఒక మాట

ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరో మాట

దీనికి చంద్రబాబు, లోకేష్, పవన్‌ సమాధానం చెప్పాలి

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టీకరణ

తాడేపల్లి:     ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలోకి కొత్త మెడికల్‌ కాలేజీలను మార్చాలన్న యోచన విరమించాలని మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్‌ చేశారు. అది కచ్చితంగా ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ చేసే చర్యలని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, పేద విద్యార్థుల పక్షాన పోరాడతామని ప్రకటించారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.

    ఏరు దాటాక తెప్ప తగిలేయడం అన్న మాట టీడీపీ కూటమి ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుందన్న మేరుగ నాగార్జున, ఇప్పుడు ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీలపై నిర్ణయం అందుకు తార్కాణంగా నిలుస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త మెడికల్‌ కాలేజీల్లో సీట్లపై ఎన్నికల ముందు పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు ఊరూరా ప్రచారం చేసిన కూటమి నేతలు, ఈరోజు ఆ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి నిర్ణయించారని ఆక్షేపించారు.
    కొత్తగా ఏర్పాటు చేస్తున్న 17 మెడికల్‌ కాలేజీల నిర్వహణలో ఈ ఇబ్బంది ఉండకూడదని, ఆర్థికంగా అవి స్వయం సమృద్ధి చెంది పేద విద్యార్థులు కూడా వైద్య విద్యను అభ్యసించేలా సీట్లు అందుబాటులోకి రావాలన్న ఒక గొప్ప ఆశయంతో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లపై వైయ‌స్ జగన్‌గారు నిర్ణయం తీసుకుంటే.. ఆరోజు దాన్ని వక్రీకరించి నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారాలు చేశారని మేరుగ నాగార్జున గుర్తు చేశారు.
    అప్పుడు దానిపై ఎల్లో మీడియాలో ఏం రాశారు?. నారా లోకేష్, పవన్‌కళ్యాణ ఏం మాట్లాడారన్నది చెబుతూ.. ఆ క్లిప్పింగ్స్‌తో పాటు, వీడియో ప్రదర్శించారు.
    ఆరోజు అలా ప్రభుత్వాన్ని విమర్శించిన వారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, నిస్సిగ్గుగా కొత్త మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానంలోకి మార్చడంపై క్యాబినెట్‌లో ఎలా చర్చించారని, ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు.    
    పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంపై వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, కేవలం జగన్‌గారిపై బురద చల్లడానికే ఆరోజు అలా మాట్లాడారని.. అధికారంలోకి రాగానే ఆ జీవోలన్నీ రద్దు చేసి కొత్త మెడికల్‌ కాలేజీల్లో అన్ని సీట్లూ ప్రభుత్వ రంగంలోనే భర్తీ చేస్తామని చెప్పారని మేరుగ నాగార్జున తేల్చి చెప్పారు.
    కానీ, అధికారంలోకి వచ్చాక, అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ.. కొత్త మెడికల్‌ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళిక చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు ఇదేం కొత్త కాదన్న మేరుగ, ఆ విధానానికి పునాది వేసి, మెడికల్‌ సీట్ల రూపంలో డబ్బులు గుంజే వ్యవస్థ తీసుకొచ్చింది చంద్రబాబే అని గుర్తు చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, తన హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు.
    వారు అలా వ్యవస్థను నాశనం చేశారు కాబట్టే.. జగన్‌గారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టారని మేరుగ నాగార్జున తెలిపారు. ఆ కాలేజీల వల్ల కొత్తగా 2,550 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పారు.

రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న 12 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మెడికల్‌ సీట్లు 2360 మాత్రమే ఉండగా, కొత్తగా 17 కాలేజీల వల్ల మరో 2,550 సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
    జగన్‌గారు చేపట్టిన 17 మెడికల్‌ కాలేజీల్లో అయిదు గత విద్యా సంవత్సరం 2023–24లో ప్రారంభమయ్యాయని (విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల), దాని వల్ల ఒకేసారి 750 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు.
    నాడు జగన్‌గారు మొదలుపెట్టిన మెడికల్‌ కాలేజీలన్నీ ఏ నారాయణో.. లేక మరే ఇతర యాజమాన్యాల కిందవి కావని, అవన్నీ ప్రభుత్వానివే కాబట్టి, ఆ కాలేజీల్లో సీట్ల కోసం కట్టే ఫీజులన్నీ, ఆయా కాలేజీల (ప్రభుత్వానికి)కు వెళ్తాయి తప్ప, వేరెవరి జేబుల్లోకి కాదని మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. ఆ ఫీజుల ద్వారా వచ్చిన డబ్బులు ఆ కాలేజీల నిర్వహణ, అభివృద్ధికి వినియోగిస్తారని, అయినా దాన్ని కూడా తప్పబడుతూ దుష్ప్రచారాలు చేశారని ఆక్షేపించారు.
    అదే ఇప్పుడు జగన్‌గారు పదవిలో ఉండి ఉంటే, రెండో దశలో.. ఈ విద్యా సంవత్సరం 2024–25లో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు ప్రారంభం అయి ఉండేవని, కానీ ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో తెలియడం లేదని చెప్పారు. వాటిలో పాడేరు మెడికల్‌ కాలేజీ పనులు దాదాపు పూర్తి కాగా, మిగిలిన చోట్ల అకడమిక్‌ కార్యకలాపాల కోసం లెక్చర్‌ హాల్స్, ల్యాబ్స్, హాస్టళ్లు, క్యాంటీన్లు.. ఇలా అన్ని నిర్మాణాలు చేపట్టి, ఎన్నికల నాటికి దాదాపు 80 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు.
    గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, ఈ 5 కాలేజీలతో పాటు, మిగిలిన 7 కాలేజీలను కూడా అందుబాటులోకి తెచ్చి, మొత్తం సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ చేయాలని మేరుగ నాగార్జున కోరారు. అలాగే  ఇప్పటికే ప్రారంభమైన 5 మెడికల్‌ కాలేజీల్లో మొత్తం సీట్లు కన్వీనర్‌ కోటాలో ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు.
    అంటే ఎన్నిలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట. కనీసం సిగ్గనిపించడం లేదా? అన్న మేరుగ నాగార్జున, వీటన్నింటికీ చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌ సమాధానం చెప్పాలన్నారు. అదే సమయంలో ఇంత జరుగుతున్నా, ఎల్లో మీడియా ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన నిలదీశారు.

Back to Top