నెల్లూరు: విజయవాడలో వరద నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా చేతులెత్తేసిన చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆక్షేపించారు. చంద్రబాబు తీరు.. ‘ఆడలేక మద్దెలోడు’ అన్నట్లుగా ఉందని అన్నారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము పోస్టింగ్స్ ఇవ్వకుండా ఉంచిన ఐఏఎస్, ఐపీఎస్‌లు వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమవడానికి కారణమని సాక్షాత్తూ ముఖ్యమంత్రే మాట్లాడ్డం అత్యంత దుర్మార్గమని కాకాణి మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలను తప్పు బట్టిన ఆయన, సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకుని, ఎదుట వారి మీద నిందలు వేయడం కోసం తన పార్టీ లీడర్లతో మాట్లాడించడం, ఆ అంశాలనే ఎల్లో మీడియాలో వచ్చేలా చేయడం.. ఆ తర్వాత చంద్రబాబు అవే మాటలను వల్లెవేస్తూ.. తమ తప్పేమీ లేదని చెప్పడం పరిపాటిగా మారిందన్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా ప్రభుత్వాలు మారుతాయే తప్ప అధికారులు మారరని తేల్చి చెప్పారు. అలాంటి అధికారుల మీద వేధింపులకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడి.. వారి మీద మరక వేసే కార్యక్రమం చేయవద్దని సూచించారు. రాష్ట్రంలో చెత్త ముఖ్యమంత్రితో కూడిన చెత్త కేబినెట్ ప్రజల బ్రతుకులను బుగ్గిపాలు చేస్తోందని కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రులైతే అసలు అడ్రస్ లేకుండా పోయారన్నారు. గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినా, ఆదివారం వరకు సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. భారీ వర్షాలు, వరదలపై ఐఎండీ (వాతావరణ శాఖ) ముందే హెచ్చరించినా, ఎందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించారు. చిన్న సంఘటన జరిగితే వెంటనే తాను ప్రజల పక్షాన ఉంటానని చెప్పుకునే డిప్యూటీ సీఎం.. ఎక్కడున్నారో కూడా తెలియడం లేదన్నారు. ప్రజలకు తాను అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్ ఆదివారం తూతూ మంత్రంగా కనిపించి వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయారని చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వాటిని విస్మరించిం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో వారున్నారని కాకాణి దుయ్యబట్టారు.