విజయనగరం : ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి శుక్రవారం విజయనగరం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దారిద్య్ర రేఖకు దిగువ కుటుంబాలకు చెందిన వారమని వైద్యానికి, చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం కావాలని విన్నవించుకున్నారు. వారి సమస్యలను ముఖ్యమంత్రితో మొర పెట్టుకున్నారు. ఆయన బాధితుల సమస్యలను ఓపికగా విని వారితో కాసేపు మాట్లాడారు. వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. బాధితుల్లో ఒకరు ముఖ్యమంత్రిని చూడగానే బోరున విలపించగా వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బాధితుడి భుజంపై చేసి ఓదర్చారు. ఏం కాదులే మేమున్నామని ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైద్య కళాశాల ప్రారంభోత్సవం అనంతరం తిరుగు పయణంలో హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రిని గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పూసపాటిరేగ గ్రామానికి చెందిన చిన్నారి తోంపల లేఖన, గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన బోన్‌మేరో వ్యాధిగ్రస్థుడైన దూరి భానుప్రసాద్, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేరశం గ్రామానికి చెందిన పోలియో వ్యాధిగ్రస్థుడు పిల్లా శంకర రావు, అనుకోని ప్రమాదంతో వీల్ ఛైర్ కు పరిమితమైన సి. శిగడాం మండలం నిద్దాం గ్రామానికి చెందిన చౌదరి గణేశ్ కలిశారు. సహాయాన్ని అభ్యర్థించారు. స్పందించిన ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున నలుగురికీ రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిమిషాల వ్యవధితో చెక్కులు సిద్ధం చేసిన కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన అనారోగ్య బాధితులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ తీవ్ర కృషి చేశారు. కలెక్టరేట్ ఏవోకు స్వయంగా ఫోన్ చేసి నిమిషాల వ్యవధిలో చెక్కులు సిద్ధం చేయించి హెలీప్యాడ్ వద్దకు రప్పించారు. అక్కడికక్కడే ఆమె సంతకాలు చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించేందుకు ప్రయత్నించిగా... నీ చేతుల మీదుగానే ఇచ్చేయ్ తల్లి అని ముఖ్యమంత్రి చిరునవ్వుతో చెప్పారు. రూ.4 లక్షల విలువ గల చెక్కుల అందజేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించుకున్న అనారోగ్య బాధితులు తోంపల లేఖన, దూరి భానుప్రసాద్, పిల్లా శంకర రావు, చౌదరి గణేశ్ లకు జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఎస్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ, సహకారాలు పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా బాధితులకు జడ్పీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ చెప్పారు. వారిలో మనో ధైర్యం నింపి వారితో బృంద ఫోటో దిగారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, వెలమ కార్పొరేషన్ ఛైర్పర్శన్ నెక్కల నాయుడు బాబు, డీసీహెచ్ ఎస్ డా. గౌరీ శంకర్, ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్ డా. అప్పలరాజు, భోగాపురం, తెర్లాం ఎంపీడీవోలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.