అమరావతి: గొర్రెల కాపరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తీసుకు వస్తోంది. ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేయనుంది. ఎన్‌సీడీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఆర్థిక సాయంతో ‘వైయస్‌ఆర్ కాపరి బంధు’ పథకాన్ని అమలు చేయనుంది. యూనిట్ల కొనుగోలుకు మంజూరు చేసే రుణంలో 30 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. గొర్రెల రేట్లు అధికంగా ఉండటంతో ఒక యూనిట్ (20 గొర్రెలు, ఒక పొట్టేలు) కొనుగోలుకు రూ.1.50 లక్షలు మంజూరు చేయనుంది. సంవత్సరానికి 12,500 మంది చొప్పున నాలుగు సంవత్సరాలకు 50 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఎన్‌సీడీసీ ఈ పథకానికి తొలుత రూ.200 కోట్లు కేటాయించేందుకు అంగీకరించిందని అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ – రాష్ట్రంలోని గొర్రెల కాపరులు, సొసైటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇటీవల కలిసి తమ జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఒక పథకాన్ని అమలు చేయాలని కోరారు. – ఎన్‌సీడీసీ ఆర్థిక సాయంతో ప్రస్తుతం గొర్రెలకాపరులు రుణంపై గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. – ఈ పథకం అమలులో నిబంధనలు కఠినంగా ఉండటంతో గొర్రెల కాపరులు రుణాలు పొందలేక పోతున్నారు. – ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో నిబంధనలు సరళీకృతం చేయడంతో పాటు, సబ్సిడీ పెంచే విధంగా పథకాన్ని రూపకల్పన చేయాలని ఆదేశించారు. – ఎన్‌సీడీసీ ఇస్తున్న సబ్సిడీని 20 శాతం నుంచి 30 శాతానికి పెంచుతున్నారు. – రుణం ఇచ్చేటప్పుడు గొర్రెల కాపరులు భూమిని తనఖా పెట్టే విధానం అమలులో ఉంటే.. అందులో కొన్ని మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. – ఈ మేరకు అధికారులు పథకాన్ని రూపకల్పన చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపారు. దీనిపై త్వరలో జరనున్న సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. నష్ట పరిహారం, పశు వైద్యంతో అండగా.. – రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ పశు నష్ట పరిహారం, రాజన్న పశు వైద్యం వంటి పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. వీటితోపాటు సబ్సిడీపై పశువుల దాణా, పరికరాలను అందిస్తోంది. – చనిపోయిన పశువులు, గొర్రెలు, మేకలకు ఎటువంటి ప్రీమియం చెల్లించక పోయినప్పటికీ నష్టపరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది. – ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయిన 9 వేల అవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు ప్రభుత్వం వాటి పోషకుల బ్యాంకు ఖాతాల్లో రూ.14 కోట్ల వరకు జమ చేసింది. – తొలి విడతగా ప్రభుత్వం పశు నష్టపరిహారం పథకానికి రూ.35 కోట్లు కేటాయించింది. – ఫిబ్రవరిలో ప్రారంభమైన రైతు భరోసా కేంద్రాల ద్వారా రాజన్న పశు వైద్యం పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. – గ్రామ సచివాలయాల్లో కొత్తగా నియమితులైన పశు సంవర్థక శాఖ సహాయకులు పశువులకు వైద్యసాయాన్ని అందిస్తున్నారు.