అమలాపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు (బాబి) అమలాపురం లోని తన క్యాంప్ కార్యలయంలో మొక్కజొన్న, పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులపై మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదని మండిపడ్డారు. రైతుల పక్షాన పోరాడడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని రామారావు డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు..రైతు ఇంట సంతోషం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రైతులు పండించిన ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరం. ఈ రెండేళ్లలో రైతులు పండించిన శనగ, మొక్కజొన్న, పొగాకు, కోకో, చీని, అరటి, మామిడి టమాట ఇలా ఏ పంటకు కనీస మద్దతు ధర లభించలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర లేకపోవడం, ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడా చెల్లించలేని దయనీయ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరటి, మామిడి, టమాట లాంటి పంటలను రోడ్ల మీదనే వదిలేసిన సంఘటనలు ఎన్నో చూసాం. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఏ రైతు సంతోషంగా ఉన్నది లేదు. - డబ్బుల్లేవని చేతులెత్తేసిన ప్రభుత్వం ప్రస్తుతం మొక్కజొన్న రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. క్వింటాలు మొక్కజొన్న కు కనీస మద్దతు ధర రూ. 2,400 దక్కాలి. కానీ క్వింటా మొక్కజొన్న రూ.1,400 నుండి 1,800 లోపే అమ్ముకుంటున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీయే లో భాగస్వామ్యంగా ఉంటూ.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్న కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. పక్క రాష్ట్రాలైన తెలంగాణా, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాలు క్వింటా మొక్కజొన్న రూ. 2,400 కు కొంటున్నాయి. కానీ కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని చెబుతున్న టీడీపీ మాత్రం మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. వ్యవసాయ మంత్రి దగ్గరకు రైతులు వెళ్లి వేడుకుంటే.. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చేతులెత్తేసిన దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. గత మా ప్రభుత్వంలో కిలో కోకో రూ.1,050 కి కొంటే అది తమ ఘనత అంటూ కూటమి క్రెడిట్ చోరీ చేసింది. కానీ ఇప్పుడు కిలో కోకో కనీసం రూ.260 కూడా కొనడం లేదు. దీనికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను. - పొగాకు కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం దేవరాపల్లి ప్రాంతంలో పొగాకు రైతులకు మద్దతుగా ధర్నా చేయడం జరిగింది. గతేడాది కేజీ పొగాకు రూ.400 వరకు ఉంటే ఈ ఏడాది కనీసం రూ. 260 కూడా రావడం లేదు. దేవరాపల్లి ప్రాంతంలోనే సుమారు 30 వేల హెక్టార్లలో పొగాకు సాగు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85 వేల హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్నారు. కేవలం వెయి హెక్టార్లలో జరిగిన పొగాకు సాగును మాత్రమే కొన్నాం అని దేవరాపల్లి పొగాకు బోర్డ్ అధికారులు చెబుతున్నారు. పొగాకు ను నియవ ఉంచడం వలన ధర మరింత పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లోని కొందరు ప్రైవేటు కంపెనీలతో చేతులు కలిపి పొగాకును కిలో రూ.260 కొంటున్నారని రైతులు వాపోతున్నారు. పండించిన పంటకు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాల్సింది పోయి.. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై రైతుల నడ్డి విరవడం బాధాకరం. - వై.యస్.జగన్ హయాంలో రైతులకు ప్రతి రోజు పండగే వై.యస్.జగన్ హయాంలో రైతాంగం పండుగలా ఉండేది. ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఉండేది. కోవిద్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతులను ఆదుకున్న చరిత్ర వై.యస్ జగన్ గారికే దక్కుతుంది. రైతులు పండించిన పంటకు ఎక్కువ ధర వచ్చే విధంగా ప్రక్క రాష్టాలకు కూడా ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసి మరీ విక్రయం చేసిన సందర్భాలు ఉన్నాయి. రైతన్నలు ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వై.యస్.జగన్ చేసిన విధానాలనే పాటించడం వలన రైతాంగం అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. యూరియా ను కూడా బ్లాక్ లో అమ్మి టీడీపీ నాయకులు సొమ్ము చేసుకున్న పరిస్థితులు చూసాం. తాజాగా డీజిల్ కొరత సృష్టించి సొమ్ము చేసుకున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోంది. కాంట్రాక్టర్ల కోసం, లాభర్జనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేయడం మానుకోవాలి. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను. లేదంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని రామారావు (బాబి) హెచ్చరించారు.