ఏపీలో విచ్చలవిడిగా బోగస్‌ ఓట్లు

  • సర్వేల పేర్లతో కుట్రలు చేస్తున్న చంద్రబాబు
  • ఎన్నికలు చట్టప్రకారం జరగాలని గవర్నర్‌ను కోరాం
  • పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

హైదరాబాద్‌: ఎన్నికలు సమీపిస్తున్నాయని చంద్రబాబు విచ్చల విడిగా బోగస్‌ ఓట్లు సృష్టిస్తున్నారని పీఏసీ చైర్మన్, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాజ్‌భవన్‌ వద్ద బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. తన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంగా ప్రజలను ఆందోళన పెట్టిన చంద్రబాబు, ఎన్నికల సమయంలోనూ గందరగోళంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన పనికి ఎంతోమంది ఓట్లు లిస్టులో కనిపించడం లేదన్నారు. దొంగ సర్వేల పేరుతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరుల ఓట్లను విచ్చల విడిగా తీసేశారన్నారు. అంతే కాకుండా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను సృష్టించారన్నారు. రాష్ట్రంలో 3.69 కోట్ల ఓట్లలో 60 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయని, అందులో తెలంగాణకు సంబంధించినవి 20 లక్షలు, 39 లక్షలు కేవలం ఏపీకి సంబంధింనవి ఉన్నాయన్నారు. 

రకరకాల పేర్లతో సర్వేలు చేస్తూ రేషన్‌ అందుతుందా.. సంతోషంగా ఉన్నారా..? అనే ప్రశ్నలు అడుగుతూ చివరకు మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారని ప్రశ్న వేస్తున్నారని, వైయస్‌ఆర్‌ సీపీకి ఓటేస్తామన్న వారి ఓట్లను గుర్తించి తొలగిస్తున్నారని వివరించారు. ఇవన్నీ ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని,  ప్రజలను డైరెక్ట్‌గా కొనుగోలు చేయడానికి కుట్రలు చేస్తున్నారని వివరించామన్నారు. వివిధ స్కీమ్‌ల పేర్లతో ప్రజలను మభ్యపెడుతూ చెక్కులు, ఇంకో రూపంలో వాగ్దానాలు చేస్తూ ఎన్నికల సమయంలో అన్యాయానికి పాల్పడుతున్నారన్నారు. ఇవన్నీ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం, పోలీస్, రెవెన్యూ, వారికి కావాల్సిన సామాజిక వర్గానికి చెందిన వారిని వివిధ పోస్టింగ్‌లో వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉపయోగించుకునేందుకు నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో వారందరినీ డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్‌లు, ఆర్డీఓలుగా నియమించారన్నారు. ఎన్నికలు చట్టపరంగా ఎన్నికలు జరగాలని, అధికారులు, యంత్రాంగం, వివిధ డిపార్టుమెంట్లను పర్సనల్‌గా వాడుకోకుండా పద్ధతిగా జరగాలని గవర్నర్‌ను కోరామన్నారు. 
 

Back to Top